- Home
- Sports
- Cricket
- సౌతాఫ్రికా టీ20 లీగ్ వేలానికి ఉన్ముక్త్ చంద్... అండర్ 19 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ ఖాతాలో...
సౌతాఫ్రికా టీ20 లీగ్ వేలానికి ఉన్ముక్త్ చంద్... అండర్ 19 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ ఖాతాలో...
2012 అండర్19 వరల్డ్ కప్ గెలిచిన భారత మాజీ క్రికెటర్ ఉన్ముక్త్ చంద్, సౌతాఫ్రికా టీ20 లీగ్ వేలానికి పేరు రిజిస్టర్ చేయించుకున్నాడు. ఇప్పటికే బిగ్ బాష్ లీగ్‌లో పాల్గొన్న మొట్టమొదటి భారత పురుష క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పిన ఉన్ముక్త్ చంద్, సౌతాఫ్రికా టీ20 లీగ్ వేలంలో అమ్ముడుపోతే... అక్కడ ఆడబోతున్న మొదటి భారత క్రికెటర్‌గానూ రికార్డు క్రియేట్ చేయబోతున్నాడు...

2012 అండర్ 19 విజయం తర్వాత బీభత్సమైన క్రేజ్, పాపులారిటీ తెచ్చుకున్న ఉన్ముక్త్ చంద్, దాన్ని సక్రమమైన రీతిలో వాడుకోవడంలో విఫలమయ్యాడు. ఐపీఎల్‌లో విఫలమై, దేశవాళీ టోర్నీలో వివాదాల్లో ఇరుక్కుని... 9 ఏళ్ల పాటు అవకాశాల కోసం ఎదురుచూస్తూ గడిపేసిన ఉన్ముక్త్ చంద్, 2021లో భారత క్రికెట్‌కి రాజీనామా చేసి యూఎస్‌కి మకాం మార్చాడు...
యూఎస్ ‘మైనర్ క్రికెట్ లీగ్’లో పాల్గొన్న ఉన్ముక్త్ చంద్, బిగ్ బాష్ లీగ్ 2022లో మెల్‌బోర్న్ రెనెగేడ్స్ తరుపున ఆడాడు. 2024 టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో యూఎస్‌ఏ జట్టు తరుపున ఆడాలని ఆశిస్తున్నాడు ఉన్ముక్త్ చంద్...
Unmukt Chand
2012 అండర్-19 వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై అజేయంగా 111 పరుగులు చేసి, భారత జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు ఉన్ముక్త్ చంద్.. మనోడి ఆటకు ముగ్దుడైన ఆస్ట్రేలియా మాజీ దిగ్గజం ఇయాన్ ఛాపెల్.. ఇతన్ని వీలైనంత త్వరగా టీమిండియాకి ఆడించాలని ప్రశంసలు కూడా దక్కించుకున్నాడు.
ఉన్ముక్త్ చంద్, అండర్-19 వరల్డ్ కప్ 2012 విజయం తర్వాత వచ్చిన క్రేజ్‌తో విరాట్ కోహ్లీ, ఎమ్మెస్ ధోనీ, సురేష్ రైనా వంటి దిగ్గజ క్రికెటర్లతో కలిసి ఓ కూల్‌డ్రింక్ యాడ్‌లో కూడా నటించాడు... ఆ యాడ్‌లో ‘నేను కావాలంటే ఇప్పుడు కూడా మీ టీమ్‌లోకి వస్తాను... మీరు మాత్రం నా టీమ్‌లోకి రాలేరు’ అంటూ డైలాగ్ చెప్పిన ఉన్ముక్త్ చంద్... టీమిండియా తరుపున ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే దేశం విడిచి వెళ్లడం విశేషం..
ఇండియాలో ఉన్ముక్త్ చంద్ కెరీర్ అనుకున్నంత సక్సెస్‌ఫుల్‌గా సాగలేదు. ఐపీఎల్ 2013లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరుపున ఆరంగ్రేటం చేసిన ఉన్ముక్త్ చంద్, బ్రెట్ లీ బౌలింగ్‌లో మొదటి బంతికే డకౌట్ అయ్యాడు. అదే అతని కెరీర్‌ని మలిచివేసింది...
ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ వంటి జట్లకు మారినా అతనికి అవకాశాలు మాత్రం రాలేదు. దేశవాళీ క్రికెట్‌లోనూ ఢిల్లీ జట్టుకి దూరం కావడం, ఉత్తరాఖండ్‌కి ఆడినా పెద్దగా ఫలితం లేకపోవడంతో గత ఏడాది టీమిండియాకి రిటైర్మెంట్ ప్రకటించాడు ఉన్ముక్త్ చంద్...
కేవలం అండర్ 19 వరల్డ్ కప్ విజయంతో ఉన్ముక్త్ చంద్ పేరిట ‘ది స్కై ఈజ్ ది లిమిట్’ పేరుతో ఓ ఆటో బయోగ్రఫీ పుస్తకం కూడా వచ్చింది. అయితే ఉన్ముక్త్ చంద్ ఆకాశం, అండర్19 వరల్డ్ కప్ దగ్గరే ఆగిపోయిందని అంటూ ట్రోల్ చేస్తారు కొందరు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్..