ఛాంపియన్స్ ట్రోఫీ 2025: టీమిండియా జెర్సీలో పాకిస్థాన్ లోగో.. !
Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీలో తమ ఆటగాళ్లు పాక్ పేరుతో ఉన్న జెర్సీలు ధరించవద్దనీ, కెప్టెన్ రోహిత్ శర్మ పాక్ పర్యటనను నిలిపివేయాలని బీసీసీఐ కోరిందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.

Champions Trophy: ఫిబ్రవరి-మార్చిలో పాకిస్తాన్, దుబాయ్ వేదికలుగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ జరగనుంది. ఈ క్రమంలోనే కొత్త వివాదం కలకలం రేపింది. బీసీసీఐ తన ఆటగాళ్లు ఆతిథ్య దేశమైన పాకిస్తాన్ పేరు ఉన్న జెర్సీలను ధరించకూడదని కోరిందని వార్తలు వచ్చాయి. కెప్టెన్ రోహిత్ శర్మ కెప్టెన్ల ప్రెస్ కాన్ఫరెన్స్, ఫోటో షూట్ కోసం పాకిస్తాన్‌కు వెళ్లరని బీసీసీఐ చెప్పిందని పలు మీడియా కథనాలు పేర్కొన్నాయి.
ఫిబ్రవరి 19న టోర్నమెంట్ ప్రారంభమయ్యే ముందు జరిగే వేడుకలను పాక్ నుంచి దుబాయ్ కు మార్చాలనే వార్తలు కూడా వచ్చాయి. అయితే, భారత జేర్సీలపై పాక్ లోగో గురించిన వార్తలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. భారత జెర్సీలపై పాక్ లోగో తో పాటు ఛాంపియన్స్ లీగ్ ఐసీసీ లోగోలు ఉంటాయని పలు నివేదికలు పేర్కొంటున్నాయి.
భారత జెర్సీపై పాకిస్తాన్ లోగో
భారత క్రికెట్ జట్టు తమ ఛాంపియన్స్ ట్రోఫీ జెర్సీలపై ఆతిథ్య దేశం పాకిస్థాన్ లోగోను కలిగి ఉంటుందని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) సెక్రటరీ దేవాజిత్ సైకియా బుధవారం తెలిపారు. BCCI 'పాకిస్థాన్'ని తొలగించాలని కోరుతున్నట్లు వచ్చిన పుకార్లను సైకియా కొట్టిపారేశారు. భారత జట్టు జెర్సీపై ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లోగో, పాక్ క్రికెట్ లోగో ఉంటుందని తెలిపారు.
ఐసీసీ మార్గదర్శకాలు ఏమైనా పాటిస్తాం : బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా
క్రిక్‌బజ్‌న నివేదికల ప్రకారం.. టోర్నమెంట్ సమయంలో భారత జట్టు, క్రికెట్ బోర్డు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) ఆదేశాలకు కట్టుబడి ఉంటాయని సైకియా స్పష్టం చేసింది. టోర్నమెంట్ కోసం ఆతిథ్య హక్కులను పాకిస్థాన్ కలిగి ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లోగో క్రింద వారి పేరు ఉంటుంది. అయితే పాకిస్థాన్ తమ స్వదేశంలో అన్ని మ్యాచ్‌లు ఆడదు. పాకిస్థాన్ కనీసం ఒక మ్యాచ్ ఆడేందుకు దుబాయ్ వెళ్లాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 23న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్‌తో తలపడనుంది.
ఐసీసీ మార్గదర్శకాలు ఏమైనా తాము పాటిస్తామని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపారు. పాకిస్థాన్ పేరుపై వివాదానికి ముగింపు పలికిన సైకియా.. బీసీసీఐ ఐసీసీ మార్గదర్శకాలను పాటిస్తుందని తెలిపారు.
ఆతిథ్య దేశం లోగో వద్దని చెప్పడం ఐసీసీ నిబంధనలు ఉల్లంఘించడమే..
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం జట్టు పాకిస్థాన్‌కు వెళ్లనందున అధికారిక లోగోపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసిందనే పుకార్లను బీసీసీఐ కార్యదర్శి తాజా వ్యాఖ్యలు తోసిపుచ్చాయి. ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యమివ్వగా, భారత్ తమ గ్రూప్-స్టేజ్ మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడనుంది.
నిబంధనల ప్రకారం, తమ జెర్సీపై ఆతిథ్య పాకిస్తాన్ పేరుతో ఉన్న అధికారిక లోగోను ధరించడానికి నిరాకరిస్తే, ఐసీసీ అధికారిక దుస్తుల కోడ్‌ను భారత్ ఉల్లంఘిస్తుంది. టోర్నమెంట్‌ను విదేశాల్లో నిర్వహించినప్పటికీ, పాల్గొనే జట్లు తమ జెర్సీలపై ఆతిథ్య దేశం పేరును కలిగి ఉండటం సాధారణం. ఉదాహరణకు, 2021 T20 ప్రపంచ కప్ UAEలో జరిగినప్పటికీ, పాకిస్తాన్ తమ జెర్సీలపై టీమిండియా లోగోను కలిగి ఉంది.
ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19న ఆతిథ్య పాకిస్థాన్‌తో న్యూజిలాండ్ తలపడే మ్యాచ్ తో ప్రారంభమవుతుంది. భారత్ దుబాయ్‌లో మూడు గ్రూప్ దశ మ్యాచ్‌లు ఆడనుంది. బంగ్లాదేశ్ (ఫిబ్రవరి 20), పాకిస్థాన్ (ఫిబ్రవరి 23), న్యూజిలాండ్ (మార్చి 2)లతో భారత్ తమ గ్రూప్ మ్యాచ్ లను ఆడనుంది. ఒకవేళ భారత్ సెమీఫైనల్, ఫైనల్‌కు అర్హత సాధిస్తే, టోర్నమెంట్ ఫైనల్‌తో సహా దుబాయ్ స్టేడియంలో రెండు అదనపు మ్యాచ్‌లు జరుగుతాయి.