- Home
- Sports
- Cricket
- మా చేతిలో ఓడిపోతామని భారత్ భయపడుతున్నట్టుంది.. అందుకే రావడం లేదేమో : పీసీబీ చీఫ్ షాకింగ్ కామెంట్స్
మా చేతిలో ఓడిపోతామని భారత్ భయపడుతున్నట్టుంది.. అందుకే రావడం లేదేమో : పీసీబీ చీఫ్ షాకింగ్ కామెంట్స్
IND vs PAK: ఆసియా కప్ - 2023 ఆడేందుకు పాక్ కు వెళ్లేదే లేదని భీష్మించుకున్న భారత క్రికెట్ జట్టుపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చీఫ్ నజమ్ సేథీ సంచలన ఆరోపణలు చేశాడు.

ఆసియా కప్ వివాదం భారత్ - పాకిస్తాన్ క్రికెట్ బోర్డుల మధ్య దూరాన్ని మరింత పెంచుతున్నది. పాకిస్తాన్ లో ఈ టోర్నీ నిర్వహిస్తే తాము అక్కడకి వెళ్లమని, హైబ్రిడ్ మోడల్ అయితే ఆడతామని బీసీసీఐ సూచించగా దానికి పాక్ అంగీకారం తెలిపింది. కానీ కొద్దిరోజుల క్రితమే శ్రీలంక, బంగ్లాదేశ్ కూడా తాము కూడా పాకిస్తాన్ లో ఆసియా కప్ ఆడేందుకు సుముఖంగా లేమని బీసీసీఐకి మద్దతుగా నిలవడంతో ఈ సమస్య మళ్లీ మొదటికి వచ్చింది.
Image credit: PTI
ఆసియా కప్ ను శ్రీలంకకు తరలిస్తున్నారని వార్తలు రావడం, అలా అయితే పాక్ దానిని బహిష్కరిస్తుందని పీసీబీ బెదిరించడం వంటివి తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఆసియ కప్ తో ఆగకుండా ఈ వివాదం వన్డే వరల్డ్ కప్ మీద ప్రభావం చూపనుంది. ఆసియా కప్ ఆడేందుకు భారత జట్టు పాకిస్తాన్ కు రాకుంటే తాము కూడా వన్డే వరల్డ్ కప్ ఆడేందుకు భారత్ కు వచ్చేది లేదని, తమకూ తటస్థ వేదికలు కావాలని పాకిస్తాన్ కోరుతున్నది.
Image credit: Wikimedia Commons
తాజాగా ఇదే అంశంపై పీసీబీ చీఫ్ నజమ్ సేథీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత క్రికెట్ జట్టు పాకిస్తాన్ లో పాకిస్తాన్ చేతిలో ఓడిపోతుందనే భయంతోనే ఇక్కడికి రావడం లేదని వాపోయాడు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు.
సేథీ మాట్లాడుతూ.. ‘భారత్ కు చెందిన వాలీబాల్, కబడ్డీ ఆటగాళ్లు టీమ్స్ పాకిస్తాన్ కు వచ్చాయి. వాళ్లకు ఇక్కడ ఎటువంటి భద్రతా సమస్యలు లేవు. మరి భారత క్రికెట్ జట్టు పాకిస్తాన్ కు ఎందుకు రావడం లేదో నాకు అర్థం కావడం లేదు. నాకు తెలిసి భారత జట్టు భయపడుతున్నట్టుంది. పాకిస్తాన్ లో పాకిస్తాన్ తో ఆడితే ఓడిపోతామని టీమిండియా భయపడుతున్నట్టుగా ఉంది...’అని వ్యాఖ్యానించాడు.
ఇక ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ లో భాగంగా భారత్ - పాక్ మధ్య జరుగబోయే మ్యాచ్ ను అహ్మదాబాద్ వేదికగా నిర్వహించేందుకు బీసీసీఐ సన్నాహకాలు చేస్తుండటంపై సేథీ మాట్లాడుతూ.. ‘ఈ స్టేట్మెంట్ చూడగానే నాకు నవ్వొచ్చింది. ఇది ఏకపక్ష నిర్ణయం. అసలు మేం ఇండియాకు రావడం లేదు. ఒకవేళ మీరు చెన్నై, కోల్కతా అని చెప్పినా మేం ఆలోచించేవాళ్లమేమో.. భారత్ కు వెళ్లేందుకు మా ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు...’అని స్పష్టం చేశాడు.