- Home
- Sports
- Cricket
- కలిసికట్టుగా ఆడనంటున్న కెప్టెన్లు.. ద్రావిడ్ కు తలనొప్పులు.. సున్నితమైన సమస్యను ‘ది వాల్’ పరిష్కరించేనా?
కలిసికట్టుగా ఆడనంటున్న కెప్టెన్లు.. ద్రావిడ్ కు తలనొప్పులు.. సున్నితమైన సమస్యను ‘ది వాల్’ పరిష్కరించేనా?
Virat Kohli-Rohit Sharma: భారత జట్టుకు స్ప్లిట్ కెప్టెన్సీ (వివిధ ఫార్మాట్లకు వేర్వేరు సారథులు) ప్రయోగం ఎంతమేరకు విజయవంతమవుతుందో గానీ ఇప్పటికైతే ఇరు కెప్టెన్ల మధ్య పొడచూపిన అభిప్రాయభేదాలు మాత్రం సగటు క్రికెట్ అభిమానిని కలవరపెడుతున్నాయి.

పదిహేను రోజుల కిందటి మాట.. ‘భారత జట్టు కొత్త కోచ్ రాహుల్ ద్రావిడ్ టీ20 కెప్టెన్ రోహిత్ శర్మతో బాగా కలిసిపోయాడు. టెస్టు జట్టు సారథి విరాట్ కోహ్లీ తో ముంబై టెస్టులో కూడా మంచి రిలేషన్ షిప్ మెయింటెన్ చేశాడు. ఇక భారత జట్టుకు ఢోకా లేదు...’
ఇంతలోనే అంతా రివర్స్ అయింది. బీసీసీఐ షాకింగ్ నిర్ణయం ఇప్పుడు రాహుల్ ద్రావిడ్ కు కొత్త తలనొప్పులు తీసుకొచ్చింది. రెండు ఫార్మాట్ల కెప్టెన్లు.. ఒకరి కెప్టెన్సీలో ఒకరు ఆడనని (దక్షిణాఫ్రికా సిరీస్ వరకైతే) పట్టుబట్టి కూర్చున్నారు. త్వరలో జరుగబోయే టెస్టులకు రోహిత్ శర్మ దూరం కాగా.. వన్డే సిరీస్ నుంచి తనకు విశ్రాంతి కావాలని విరాట్ కోహ్లీ బీసీసీఐని కోరినట్టు వార్తలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ కు కొత్త సమస్యలు తలెత్తాయి. క్రికెట్, విజయాలు,ట్రోఫీల సంగతి పక్కనబెడితే ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న ఇగోలను పరిష్కరించే బాధ్యత రాహుల్ ద్రావిడ్ దే.
వన్డే కెప్టెన్సీ నుంచి తనను తప్పించడంతో బీసీసీఐ పై గుర్రుగా ఉన్న కోహ్లీ.. తన సారథ్యంలో ఆడిన రోహిత్ శర్మ నాయకత్వంలో ఆడేందుకు అంతగా సిద్ధంగా లేడని వినిపిస్తున్నది. అతడికి అహం అడ్డు వస్తుందనేది హిట్ మ్యాన్ ఫ్యాన్స్ ఆరోపణ. అయితే టీ20 తో పాటు వన్డే జట్టుకు కూడా సారథిగా ఎంపికైన తర్వాత రోహిత్ శర్మ మాత్రం కోహ్లీ గురించి ఎక్కడా నోరు జారలేదు. పైగా ఐదేండ్లు తనతో ఆడటాన్ని తాను ఎంతగానో ఎంజాయ్ చేశానని చెప్పుకొచ్చాడు.
బయటకు చెప్పకున్నా వీళ్లిద్దరి మధ్య వన్డే కెప్టెన్సీ చిచ్చు పెట్టిందనేది బహిరంగ రహస్యమే. ఇక ప్రాక్టీస్ లో రోహిత్ శర్మకు గాయమైందని చెబుతున్నా అదేం పెద్దది కాదని కూడా బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. కొద్దిసేపట్లోనే అతడిని టెస్టు సిరీస్ మొత్తం నుంచి విశ్రాంతినిస్తూ ప్రియాంక్ పంచల్ ను ఆగమేఘాల మీద ఎంపిక చేసింది.
ఇప్పుడు ఈ ఇద్దరూ వెటరన్స్ ను కలపడం రాహుల్ ద్రావిడ్ ముందున్న పెద్ద టాస్క్ అని క్రికెట్ పండితులు భావిస్తున్నారు. బద్దకస్తుడిగా పేరున్న రోహిత్ శర్మ.. తన అహం విషంయలో తగ్గేదేలే అన్నట్టుగా ఉండే విరాట్ కోహ్లీ లలో ఎవరు తగ్గుతారు..? వారిని ద్రావిడ్ ఎలా కలుపుతాడు..? అనేది భారత క్రికెట్ అభిమానులను వేధిస్తున్న ప్రశ్న..?
కాగా.. గాయం కారణంగా రోహిత్ శర్మ టెస్టులకు దూరమైతే.. కూతురు వామిక బర్త్ డే వేడుకలను చూపి విరాట్ కోహ్లీ వన్డే సిరీస్ నుంచి తప్పుకున్నాడు. కానీ హిట్ మ్యాన్ గాయం పెద్దది కాదని ముందు చెప్పిన బీసీసీఐ తర్వాత అతడికి విశ్రాంతినిచ్చింది. ఇక కోహ్లీ కూతురు వామిక బర్త్ డే జనవరి 11. అప్పటికీ మూడో టెస్టు ప్రారంభమవుతుంది. ఆ తర్వాతే వన్డే సిరీస్ జరుగనుంది.
మిస్టర్ కూల్ గా పేరున్న ద్రావిడ్.. సమస్యలను పరిష్కరించడంలో దిట్ట. తన కెరీర్ లో ఎన్నో ఎత్తు పల్లాలను చూసిన ‘ది వాల్’.. తాను క్రికెట్ ఆడే రోజుల్లో కూడా గంగూలీ తో అభిప్రాయభేదాలు వచ్చాయని గతంలో చెప్పాడు. కానీ పరస్పర అ్తంగీకారంతో ఈ ఇద్దరూ మళ్లీ కలిశారు.
గంగూలీ.. కోహ్లీ లది దాదాపు ఒకే మనస్తత్వం. ఇద్దరిలోనూ దూకుడు పుష్కలం. భారత క్రికెట్ కు అగ్రెసివ్ నేర్పింది గంగూలీ అయితే.. దానిని పీక్స్ కు తీసుకెళ్లింది విరాట్ కోహ్లీ. ఇగో దెబ్బతింటే కోహ్లీ దెబ్బ ఎలా ఉంటుందో ప్రపంచ బౌలర్లకు పరిచయమే. తనను రెచ్చగొట్టిన ప్రతీసారి అతడు ధీటుగా సమాధానమిచ్చాడు.
అయితే ఇప్పుడు రెచ్చిపోతే అది కోహ్లీకే ప్రమాదకరం. ఎంతటి గొప్ప ఆటగాళ్లకైనా బ్యాడ్ డేస్ తప్పవు. మహామహా ఆటగాళ్లకే ఇది తప్పలేదు. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్, బ్రాడ్ మన్ లు కూడా వీటికి అతీతులేం కాదు. అహాన్ని వీడి.. రోహిత్ శర్మతో కలిసి నడిస్తేనే అది కోహ్లీ కెరీర్ కు.. భారత క్రికెట్ భవిష్యత్తుకు లాభదాయకమని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. ఇక కోహ్లీ, రోహిత్ లను కలపడంలో రాహుల్ ద్రావిడ్ ఎంతమేరకు కృతకృత్యుడవుతాడో కాలమే నిర్ణయించనుంది.