2030 కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు భారత్ బిడ్.. ఈ నగరానికి లక్కీ ఛాన్స్
Commonwealth Games India : కేంద్ర కేబినెట్ 2030 కామన్వెల్త్ గేమ్స్ బిడ్‌కు ఆమోదం తెలిపింది. గుజరాత్ లోని అహ్మదాబాద్‌ను ఆతిథ్య నగరంగా ప్రతిపాదించింది.

కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు కేంద్ర కేబినెట్ ఆమోదం
ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర కేబినెట్ కామన్వెల్త్ గేమ్స్-2030 నిర్వహణ బిడ్‌కు బుధవారం అధికారిక ఆమోదం తెలిపింది. ఈ బిడ్‌ను యువజన, క్రీడా వ్యవహారాల మంత్రిత్వశాఖ సమర్పించనుంది.
అధికారుల ప్రకారం.. బిడ్‌తో పాటు హోస్ట్ కోలాబొరేషన్ అగ్రిమెంట్ (HCA)పై సంతకం చేయడానికి, అవసరమైన మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థల నుండి హామీలు ఇవ్వడానికి అనుమతి లభించింది. బిడ్ విజయవంతమైతే గుజరాత్ ప్రభుత్వానికి అవసరమైన ఆర్థిక సహాయం కూడా మంజూరు చేయనుంది.
KNOW
అహ్మదాబాద్ లో కామన్వెల్త్ గేమ్స్
2030 కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, దీని కోసం అహ్మదాబాద్‌ను ప్రతిపాదించారు. ప్రపంచంలోనే అతిపెద్ద నరేంద్ర మోడీ స్టేడియం, అధునాతన శిక్షణ సౌకర్యాలు, క్రీడాసంస్కృతి ఉన్న నగరంగా అహ్మదాబాద్‌ను "ఐడియల్ వేదిక"గా కేబినెట్ పేర్కొంది.
ఈ స్టేడియం ఇప్పటికే 2023 ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్‌తో సహా అనేక అంతర్జాతీయ మ్యాచ్‌లకు వేదికైంది. ఐపీఎల్ ఫైనల్స్ (2022, 2023, 2025) నిర్వహించిన అనుభవం కూడా ఉంది.
కామన్వెల్త్ గేమ్స్ – ఇండియా బిడ్
కామన్వెల్త్ గేమ్స్ బిడ్ సమర్పణకు చివరి తేదీ ఆగస్టు 31గా నిర్ణయించారు. భారత ఒలింపిక్ సంఘం (IOA) ఇప్పటికే ఈ ప్రక్రియకు అంగీకారం తెలిపి "ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్" సమర్పించింది.
వచ్చే 48 గంటల్లో IOA బిడ్ ప్రక్రియను పూర్తి చేస్తుందని అంచనా. భారత్ చివరిసారిగా కామన్వెల్త్ గేమ్స్‌కి ఆతిథ్యం 2010లో ఇచ్చింది. న్యూ ఢిల్లీ వేదికగా ఈ గేమ్స్ నిర్వహించారు.
కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణతో ఆర్థిక, ఉపాధి, పర్యాటక లాభాలు
72 దేశాల క్రీడాకారులు పాల్గొనే కామన్వెల్త్ గేమ్స్ కు అన్ని ఒకే అయితే అహ్మదాబాద్ వేదిక కానుంది. వేల సంఖ్యలో క్రీడాకారులు, కోచ్‌లు, అధికారికులు, పర్యాటకులు, మీడియా ప్రతినిధులు రావడం వల్ల స్థానిక వ్యాపారాలు లాభపడతాయని కేంద్రం తెలిపింది.
ఈవెంట్ నిర్వహణ వల్ల పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందనీ, ఉపాధి అవకాశాలు విస్తృతంగా వస్తాయని అంచనా. స్పోర్ట్స్ సైన్స్, ఈవెంట్ మేనేజ్‌మెంట్, లాజిస్టిక్స్, రవాణా, ప్రసార మీడియా, ఐటి, కమ్యూనికేషన్, పబ్లిక్ రిలేషన్స్ వంటి విభాగాల్లో ఉద్యోగాలు కలుగనున్నాయి.
భారత క్రీడా రంగంలో మరో మైలురాయి
కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణ భారత్‌లో క్రీడా రంగానికి దీర్ఘకాలిక సానుకూల ప్రభావం చూపుతుందని కేంద్రం తెలిపింది. "ఈ గేమ్స్ పర్యాటకాన్ని పెంచుతాయి, కొత్త ఉద్యోగాలను సృష్టిస్తాయి, కోట్లాది యువ క్రీడాకారులకు ప్రేరణనిస్తాయి" అని ప్రభుత్వం పేర్కొంది. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ నిర్వహణ జాతీయ గౌరవాన్ని పెంపొందిస్తుందనీ, క్రీడల్లోకి మరింత మంది యువతను ఆకర్షిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది.
కేంద్ర కేబినెట్ ఆమోదంతో భారత్ 2030 కామన్వెల్త్ గేమ్స్ బిడ్‌ను సమర్పించడానికి సిద్ధమైంది. బిడ్ విజయవంతమైతే, ఇది 2010 తర్వాత భారత్‌లో జరిగే రెండో కామన్వెల్త్ గేమ్స్ కానుంది.