మేం మీకు బిర్యానీ పెడితే, మీరు మాకు చద్దన్నం పెడతారా... ఐసీసీ తీరుపై సెహ్వాగ్ కామెంట్...
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ కోసం ఆస్ట్రేలియాలో అడుగుపెట్టింది భారత క్రికెట్ జట్టు. వరల్డ్ రిచెస్ట్ క్రికెట్ బోర్డు బీసీసీఐ దగ్గర్నుంచి కోట్లల్లో కాంట్రాక్ట్ రుసుము అందుకునే భారత క్రికెటర్లు, ఆస్ట్రేలియాలో ఫుడ్ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది...
శత్రువు అయినా సరే, ఇంటికి వస్తే కడుపు నిండా భోజనం పెట్టి పంపడం భారతీయుల సంస్కృతి, సంప్రదాయం, ఆచార వ్యవహారాల్లో భాగం... ఐపీఎల్ ద్వారానే వేల కోట్ల ఆదాయం ఆర్జిస్తున్న బీసీసీఐ, ఆటగాళ్లకు వసతులు కల్పించే విషయంలో ఎక్కడా రాజీపడడం లేదు...
అలాంటి భారత జట్టుకి సిడ్నీలో చల్లబడిన సాండ్‌విచ్‌లు, పండ్లు, సలాడ్స్ అందించారనే విషయం తెలిసి భారత క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐసీసీ, క్రికెట్ ఆస్ట్రేలియా రెండూ కలిసి ఆతిథ్య దేశాల క్రికెటర్లకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నా... క్రికెటర్లకు నాణ్యాత ఉన్న ఆహారం అందివ్వడంలో విఫలం కావడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి...
‘సాధారణంగా వేరే దేశాల్లో పర్యటనకి వెళ్లినప్పుడు అక్కడ బోర్డులు, విదేశీ క్రికెటర్ల ఆహారపు అలవాట్లను బట్టి ఏర్పాట్లు చేశాయి. భారతీయుల కోసం వేడివేడిగా వంటకాలు రెఢీ అవుతాయి. అయితే ఐసీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టోర్నీ కావడంతో అన్ని దేశాల క్రికెటర్ల కోసం ఒకే రకమైన ఏర్పాట్లు చేశారు. భారత క్రికెటర్లకు చల్లబడిన అవకాడో, టొమాటో, కీరా దోశలు ఇవ్వడంతో వాళ్లు... వాటిని తినలేకపోతున్నారు... ’ అంటూ బీసీసీఐ అధికారులు, ఓ మీడియా ప్రతినిధికి తెలిపారు...
‘ఒకప్పుడు వెస్ట్రరన్ దేశాలు, అక్కడ పర్యటించేవాళ్లకి మంచి ఫుడ్ ఇచ్చేవాళ్లు. ఇప్పుడు ఆ పేరు పోయింది. మీరు ఇండియాకి వచ్చినప్పుడు మేం ఎలాంటి ఏర్పాట్లు చేశామో, ఎలా చూసుకున్నామో మీకు తెలుసు. ఇండియా ఎప్పుడూ ఆతిథ్యం విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు...’ అంటూ భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేశాడు...
భారత మాజీ క్రికెటర్, మాజీ సెలక్టర్ మదన్ లాల్ కూడా ఐసీసీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘ఐసీసీ, టీమ్స్‌కి వాళ్లకి నచ్చిన ఫుడ్ ఇవ్వకపోవడం సిగ్గు చేటు. ఈ ఈవెంట్ల ద్వారా వాళ్లకి కోట్లకు కోట్ల ఆదాయం వస్తోంది. కనీసం ప్లేయర్లకు సరైన తిండి ఇవ్వలేరా...’ అంటూ ట్వీట్ చేశాడు మదన్ లాల్..