భారత్ vs పాకిస్తాన్: సూర్యకుమార్-గౌతమ్ గంభీర్ బిగ్ మిస్టేక్.. రిజల్ట్ మారేనా?
India vs Pakistan Asia Cup 2025: ఆసియా కప్ 2025లో పాకిస్తాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో భారత్ ప్లేయింగ్-11లో మార్పులు చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. అర్షదీప్ సింత్ ను ఎందుకు తీసుకోలేదనే ప్రశ్నలు వస్తున్నాయి.

టాస్ గెలిచిన పాకిస్తాన్
ఆసియా కప్ 2025లో ఆదివారం భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన హై వోల్టేజ్ పోరులో టాస్ పాకిస్తాన్ గెలిచింది. కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నారు. భారత్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ ఓడిపోయారు. ఈ మ్యాచ్ లో భారత జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.
అర్షదీప్ సింగ్ ను ఎందుకు తీసుకోలేదు?
యూఏఈ మ్యాచ్‌లో ఆడిన అదే 11 మంది ప్లేయర్లను మళ్లీ పాకిస్తాన్ మ్యాచ్‌లో కూడా కొనసాగించారు. దీంతో అర్షదీప్ సింగ్‌కు మరోసారి అవకాశమే రాలేదు. ఈ నిర్ణయం కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తీసుకున్న కీలక తప్పిదంగా విశ్లేషకులు చెబుతున్నారు. పాక్ పై మంచి ప్రదర్శనలు ఇచ్చిన అర్షదీప్ ను ఎందుకు తీసుకోలేదని ప్రశ్నిస్తున్నారు.
పాక్ పై అర్షదీప్ సింగ్ గణాంకాలు
టీ20ల్లో పాకిస్తాన్‌పై అర్షదీప్ సింగ్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌ల్లో ఏడు వికెట్లు తీశాడు. ముఖ్యంగా 2022 టీ20 ప్రపంచకప్‌లో బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్‌ను ఔట్ చేసి భారత్ విజయానికి బాటలు వేశాడు. గత ఏడాది జరిగిన ప్రపంచకప్‌లోనూ అతని ఆఖరి ఓవర్ల బౌలింగ్ పాకిస్తాన్‌ను ఒత్తిడికి గురి చేసింది.
అర్షదీప్ సింగ్‌ను జట్టులోకి తీసుకోకపోవడం భారత్‌కు వ్యతిరేకంగా మారే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
IND vs PAK : ఇరు జట్ల ప్లేయింగ్ 11
భారత్ జట్టు ప్లేయింగ్ 11
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్ మన్ గిల్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రిత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.
పాకిస్తాన్ జట్టు ప్లేయింగ్ 11 వివరాలు
సల్మాన్ అలీ ఆఘా (కెప్టెన్), సహిబ్‌జాదా ఫర్హాన్, సామ్ అయూబ్, ఫఖర్ జమాన్, హసన్ నవాజ్, మహ్మద్ హారిస్ (వికెట్ కీపర్), మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ షా అఫ్రిదీ, సుఫియాన్ ముకీమ్, అబ్రార్ అహ్మద్.
భారత్, పాకిస్తాన్ జట్ల కెప్టెన్లు ఏమన్నారంటే?
పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘా టాస్ గెలిచిన తర్వాత మాట్లాడుతూ.. “మేము మంచి క్రికెట్ ఆడుతున్నాం. చాలా ఉత్సాహంగా ఉన్నాం. పిచ్ నెమ్మదిగా కనిపిస్తోంది. ముందుగా బ్యాటింగ్ చేసి బోర్డుపై పరుగులు పెట్టాలని అనుకుంటున్నాం. జట్టులో ఎటువంటి మార్పులు లేవు. ఇక్కడ 20 రోజులుగా ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి కండీషన్లకు అలవాటు పడ్డాం” అని వివరించారు.
భారత్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. “మేము మొదట బౌలింగ్ చేయాలనుకున్నాం. పక్కనే ఉన్న మరో పిచ్‌పై ఆడాం, అది చాలా మంచి వికెట్. రాత్రిపూట బ్యాటింగ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు తేమ ఎక్కువగా ఉంది, కాబట్టి తరువాత మంచు ప్రభావం ఉండవచ్చు. జట్టులో ఎటువంటి మార్పులు లేవు” అని తెలిపారు.