Tilak Varma : భరతమాత నుదిటన వీర'తిలకం'.. తెలుగోడి ఆటకు యావత్ భారతం ఫిదా..!
Tilak Varma : 'ఎప్పుడు వచ్చామన్నది కాదు… బుల్లెట్ దిగిందా లేదా' ఈ డైలాగ్ ఆసియా కప్ 2025 ఫైనల్లో తిలక్ వర్మ ఆటకు సరిగ్గా సరిపోతుంది. 'ఎప్పుడు ఆడామన్నది కాదు… ఆడితే విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాలి' అన్నట్లు సాగింది తిలక్ బ్యాటింగ్.

'తిలక్ భయ్యా...నువ్వు మామూలోడివి కాదు'
Tilak Varma : అది ఆసియా కప్ 2025 ఫైనల్.. అప్పటికే ఈ టోర్నీలో రెండుసార్లు టీమిండియా పాకిస్థాన్ ను చిత్తుచేసింది. ఈ ట్రాక్ రికార్డ్ చూసినవారు ఎవరైనా టీమిండియా సునాయాసంగా విజయం సాధిస్తుందని భావిస్తారు.. టీమిండియా ఫ్యాన్స్ కూడా ఇలాగే అనుకున్నారు. అనుకున్నట్లుగానే ఫస్ట్ హాఫ్ సాగింది... మొదట బ్యాటింగ్ చేసిన పాక్ ను భారత బౌలర్లు 146 పరుగులకే కట్టడిచేశారు. అయితే అసలు ఉత్కంఠ ఆ తర్వాతే ప్రారంభమయ్యింది. భారత్ 147 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించడంలో కాస్త తడబడింది... కానీ తెలుగు కుర్రాడు తిలక్ వర్మ క్రీజులోకి వచ్చాక కథ మొత్తం మారింది. అద్భుత బ్యాటింగ్ తో అదరగొట్టిన తిలక్ టీమిండియా తడబడుతున్న టీమిండియాను విజయతీరాలకు చేర్చి భరతమాత నుదిటన విజయతిలకం దిద్దాడు.
“Tum Namak nhi Chandan ho Varma! Tum Tilak Bharat ke mathe ka.” 🤌🇮🇳 pic.twitter.com/veebKzMK08
— Royal Challengers Bengaluru (@RCBTweets) September 28, 2025
తిలక్ వర్మ తిప్పేశాడు..
తిలక్ వర్మ క్రీజులోకి వచ్చే సమయానికి టీమిండియా కేవలం 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (5 పరుగులు), శుభ్ మన్ గిల్ (12 పరుగులు), కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (1 పరుగుకే) వికెట్లు కోల్పోయారు. ఇలా జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు సంజు శాంసన్, శివమ్ దూబేలతో కలిసి అద్భుత భాగస్వామ్యం నెలకొల్పి విజయానికి బాటలువేశాడు తిలక్ వర్మ. చివరివరకు క్రీజులో నిలిచిన తిలక్ అద్భుత హాఫ్ సెంచరీ (69 పరుగులు) సాధించిన టీమిండియాకు విజయాన్ని అందించాడు. అతడి ఇన్నింగ్స్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.
పాకిస్ధాన్ తో మ్యాచ్ అంటే ఆమాత్రం ఉంటుంది..
ఏ ఆటలో అయినా గెలుపోటములు సహజం... కానీ ఇండియాకు పాకిస్థాన్ తో అలాకాదు. ఆ దేశంతో యుద్దమైనా, క్రికెట్ మ్యాచ్ అయినా ఇండియా గెలిచి తీరాల్సిందేనని భారతీయులు భావిస్తారు. అందుకే ఆపరేషన్ సిందూర్ సమయంలో ఎంత ఉత్కంఠ నెలకొందో ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్ సమయంలోనూ ఆ స్థాయిలో ఉత్కంఠ నెలకొంది. ఇలాంటి మ్యాచ్ లో టీమిండియా గెలిపించి హీరోగా మారాడు తిలక్ వర్మ. ఈ తెలుగు కుర్రాడు ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలు గర్వపడేలా చేశాడు... ఇప్పుడు టీమిండియాను గెలింపించింది మావాడే అని తెలుగోళ్లు గొప్పగా చెప్పకుంటున్నారు.
Congratulations Team India on winning the Asia Cup by defeating Pakistan! 🏆🇮🇳 A proud moment for the nation. Kudos to Tilak Varma for his spectacular performance! #AsiaCup2025#TeamIndiapic.twitter.com/a8Yq0Grdx8
— Kavitha Kalvakuntla (@RaoKavitha) September 28, 2025
నీ ఆటకు ఫిదా సామీ.. తిలక్ తో సూర్య ఫోటో వైరల్
అయితే పాకిస్థాన్ ను చిత్తుగా ఓడించిన తర్వాత మైదానంలో టీమిండియా సెలబ్రేషన్స్ సమయంలో ఓ ఆసక్తికరమైన ఘటన కనిపించింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మన తెలుగబ్బాయి తిలక్ వర్మ వద్దకువెళ్లి నీ ఆటకు ఫిదా అయిపోయాం అనేలా ఓ ఫోజు ఇచ్చాడు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పాకిస్థాన్ తో కీలకమైన మ్యాచ్ లో టీమిండియాను గెలిపించిన తిలక్ వర్మ ఆటకు కెప్టెన్ ఒక్కరే కాదు మేము కూడా ఫిదా అయ్యామంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. తిలక్ పాకిస్థాన్ తిక్క కుదిర్చారు అని కొందరు... టీమిండియాకు వీరతిలకం దిద్దాడని మరికొందరు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. తిలక్ చేసిన పోరాటమే టీమిండియాను ఆసియా కప్ 2025 విజేతగా నిలిపింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
This picture sums up the night! What an innings... #TilakVarma is one of the next BIG thing in #IndianCricket. Loved the incredible composure, which led to a match winning innings! 🫡#INDvsPakpic.twitter.com/USBHObJD8S
— Appayya Ramarao (@AppayyaRamarao) September 28, 2025
సూపర్ సిక్స్ తో తిలక్ ఫినిషింగ్ టచ్
చివరి 6 బంతుల్లో టీమిండియా గెలుపుకు 10 పరుగులు అవసరం. ఈ సమయంలో తిలక్ వర్మ కొట్టిన భారీ సిక్సర్ మ్యాచ్ గతిని మార్చేసింది. 19వ ఓవర్లో రెండో బంతికే తిలక్ సిక్స్ బాదగా తర్వాత 4 బంతుల్లో భారత గెలుపుకు 2 పరుగులు అవసరమయ్యాయి. ఈ సమయంలో రింకూ సింగ్ బౌండరీతో భారత్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.
వివాదాలతోనే ముగిసిన ఆసియా కప్
పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడొద్దనే బిసిసిఐపై ఒత్తిడి, చివరి క్షణంలో కేంద్ర ప్రభుత్వం నుంచి పాక్ తో మ్యాచ్‌కు టీమిండియాకు గ్రీన్ సిగ్నల్, భారత్ 'నో హ్యాండ్ షేక్', అటు పాకిస్థాన్ భారత ప్రజెంటర్ రవిశాస్త్రితో మాట్లాడటానికి నిరాకరించడం, పాక్ ప్లేయర్ హరిస్ రౌఫ్ మైదానంలోనే జెట్ విమానం కూలినట్టు సిగ్నల్ ఇవ్వడం, అతడికి అర్ష్‌దీప్ సింగ్ ఇచ్చిన ఘాటైన జవాబు... ఇలా ఈ ఆసియా కప్ టోర్నీ కాస్త ఉత్కంఠగా, మరికొంత ఆందోళనకరంగా సాగింది. వివాదాలతో మొదలైన ఆసియా కప్ టోర్నీ రెట్టింపు వివాదాలతో ముగిసింది.