- Home
- Sports
- Cricket
- India vs Pakistan: ఆసియా గేమ్స్ 2026 హైవోల్టేజ్ ఫైనల్.. పాకిస్తాన్‌ను చిత్తు చేసి గోల్డ్ గెలిచిన భారత్
India vs Pakistan: ఆసియా గేమ్స్ 2026 హైవోల్టేజ్ ఫైనల్.. పాకిస్తాన్‌ను చిత్తు చేసి గోల్డ్ గెలిచిన భారత్
India vs Pakistan: ఆసియా గేమ్స్ 2026 పురుషుల క్రికెట్ మెగా పోరులో భారత్ చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఉత్కంఠ నడుమ జరిగిన హై-వోల్టేజ్ ఫైనల్ పోరులో పాకిస్తాన్‌ను 19 పరుగుల తేడాతో చిత్తు చేసిన టీమిండియా గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది.

ఆసియా గేమ్స్ 2026: పాక్‌పై భారత్ ఘనవిజయం
ఆసియా క్రీడలు 2026 పురుషుల క్రికెట్ పోటీల్లో భారత క్రికెట్ జట్టు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుని ఛాంపియన్ గా నిలిచింది. జపాన్‌లోని నిస్సిన్ మైదానంలో అక్టోబర్ 3న జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ పోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను 19 పరుగుల తేడాతో ఓడించి భారత్ బంగారు పతకాన్ని ముద్దాడింది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన టీమిండియా, ఆసియా క్రీడల్లో తన ఆధిపత్యాన్ని మరొకసారి చాటుకుంది.
అభిషేక్ శర్మ, తిలక్ వర్మ విధ్వంసం.. భారత్ భారీ స్కోరు
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 211 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత ఇన్నింగ్స్‌లో యువ బ్యాటర్ తిలక్ వర్మ తుఫాన్ హాఫ్ సెంచరీతో మెరిసాడు. కేవలం 21 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్న తిలక్, మొత్తంగా 22 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 51 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. చివరి ఓవర్లలో శివమ్ దూబే (15 బంతుల్లో 27) కూడా వేగంగా పరుగులు జోడించడంతో భారత్ పాకిస్తాన్ ముందు 212 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచగలిగింది. అలాగే, అభిషేక్ శర్మ తుపాన్ హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు. 61 పరుగుల తన ఇన్నింగ్స్ అభిషేక్ శర్మ.. 3 ఫోర్లు, 7 సిక్సర్లు బాదాడు. పాక్ బౌలర్లలో అహ్మద్ దానియాల్ 43 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు.
పాక్ పోరాటం
212 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌కు ప్రారంభంలోనే గట్టి షాక్‌లు తగిలాయి. జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ వరుసగా వికెట్లు తీసి పాక్‌ను ఒత్తిడిలోకి నెట్టారు. అయితే, ఒక వైపు వికెట్లు పడుతున్నా పాకిస్తాన్ బ్యాటర్ హసన్ నవాజ్ అద్భుతమైన పోరాటం కనబరిచాడు. కేవలం 51 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లతో 96 పరుగులు చేసి జట్టును గెలిపించేందుకు పోరాడాడు. అయితే, ఆఖరి ఓవర్లలో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాకిస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 192 పరుగులకే పరిమితమైంది.
భారత బౌలర్ల కట్టుదిట్టమైన దాడి
భారత బౌలర్లలో అక్షర్ పటేల్ (4-0-29-2), వాషింగ్టన్ సుందర్ (4-0-29-2), శివమ్ దూబే (3-0-33-2) చెరో రెండు వికెట్లు తీసి పాక్ పతనాన్ని శాసించారు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వికెట్ తీయనప్పటికీ, తన 4 ఓవర్లలో 33 పరుగులు మాత్రమే ఇచ్చి ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేశాడు. మ్యాచ్ ఆఖరి ఓవర్లో పాకిస్తాన్‌కు 33 పరుగులు అవసరం కాగా, శివమ్ దూబే మొదటి బంతికి సిక్స్ ఇచ్చినప్పటికీ, చివరి బంతికి సెంచరీకి చేరువలో ఉన్న హసన్ నవాజ్‌ను అవుట్ చేసి భారత విజయాన్ని ఖాయం చేశాడు.
రికార్డు స్థాయిలో వరుస విజయాలు
ఈ విజయంతో అంతర్జాతీయ టీ20ల్లో పాకిస్తాన్‌పై భారత్ వరుసగా 7వ విజయాన్ని నమోదు చేసింది. మహిళల క్రికెట్ జట్టు ఇప్పటికే ఈ ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించగా, ఇప్పుడు పురుషుల జట్టు కూడా పసిడి గెలిచి దేశానికి గర్వకారణంగా నిలిచింది. అంతర్జాతీయ క్రీడల్లో భారత క్రికెట్ జట్టు చూపుతున్న ఆధిపత్యానికి ఈ విజయం మరొక నిదర్శనంగా నిలిచింది.

