IND vs NZ: వాంఖడేలో జడేజా మ్యాజిక్.. ఇషాంత్-జహీర్ రికార్డులు బ్రేక్
IND vs NZ: వాంఖడేలో రవీంద్ర జడేజా మ్యాజిక్ చేశాడు. ఐదు వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు. అతనికి తోడుగా వాషింగ్టన్ సుందర్ కూడా నాలుగు వికెట్లు తీయడంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ లో 235/10 పరుగులకు ఆలౌట్ అయింది.
India vs New Zealand: ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య టెస్టు సిరీస్‌లో చివరి మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ జట్టు తొలిరోజు 235 పరుగులకే కుప్పకూలింది. ఇందులో భారత స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు కీలక పాత్ర పోషించాడు. అద్భుతమైన బౌలింగ్ తో అదరగొట్టాడు. కివీ బ్యాట్స్‌మెన్‌లను క్రీజులో ఎక్కువ సేపు నిలవనీయలేదు. ఈ ప్రదర్శనతో ఇషాంత్ శర్మ, జహీర్ ఖాన్ రికార్డులను జడేజా బద్దలు కొట్టి ప్రత్యేక క్లబ్‌లో చేరాడు.
Jadeja, Ravindra Jadeja
జడేజా స్పిన్ మ్యాజిక్ దెబ్బకు కుప్పకూలిన కీవీస్
న్యూజిలాండ్ తో జరిగిన చివరి టెస్టులో జడేజా అద్భుతమైన బౌలింగ్ తో అదరగొట్టాడు. అతని బౌలింగ్ దెబ్బకు న్యూజిలాండ్ టీమ్ తొలి రోజు 235 పరుగులకే తమ తొలి ఇన్నింగ్స్ ను ముగించింది. జడేజా ఈ ఇన్నింగ్స్‌లో తన మొదటి 11 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా తీసుకోలేదు. కానీ, తన 12వ ఓవర్‌లో ఈ స్టార్ ఆల్ రౌండర్ ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లకు ఒకరి తర్వాత ఒకరిని పెవిలియన్ పంపాడు.
హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని సెంచరీ చేసేలా కనిపించిన విల్ యంగ్ ను తన తొలి వికెట్ గా జడేజా పెవిలియన్ కు పంపాడు. ఆ తర్వాత టామ్ బ్లండెల్ ను ఔట్ చేశాడు. దీని తర్వాత ఇన్నింగ్స్ 61వ ఓవర్ వేసిన జడేజా మళ్లీ 2 వికెట్లు తీశాడు. ఇలా చేయడం ద్వారా అతను తన 22 ఓవర్లలో 65 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. టెస్టు క్రికెట్‌లో జడేజా దీంతో 14వ సారి 5 వికెట్లు సాధించాడు.
ఇషాంత్-జహీర్‌ల రికార్డును బ్రేక్ చేసిన జడేజా
ఈ మ్యాచ్ లో మూడో వికెట్ తీయడంతో భారత్ తరఫున అత్యధిక టెస్టు వికెట్లు తీసిన ఇషాంత్ శర్మ, జహీర్ ఖాన్ రికార్డును జడేజా బద్దలు కొట్టాడు. ఇషాంత్ శర్మ, జహీర్ ఖాన్ ఇద్దరూ టెస్టుల్లో 311 వికెట్లు తీశారు. జడేజా పేరిట 314 టెస్టు వికెట్లు ఉన్నాయి. దీంతో పాటు జడేజా టాప్-5 క్లబ్‌లోకి కూడా చేరాడు. భారత్ తరఫున అత్యధిక టెస్టు వికెట్లు తీసిన ఐదో బౌలర్‌గా నిలిచాడు.
భారత్ తరఫున అత్యధిక టెస్టు వికెట్లు తీసిన టాప్ 5 బౌలర్లు
అనిల్ కుంబ్లే - 619
రవిచంద్రన్ అశ్విన్ - 533
కపిల్ దేవ్ - 434
హర్భజన్ సింగ్ - 417
రవీంద్ర జడేజా - 414
3000 పరుగులు, 300 వికెట్లు.. రవీంద్ర జడేజా మరో ఘనత
జడేజా ప్రస్తుత సిరీస్‌లో పెద్ద ఘనత సాధించాడు. 3000 పరుగులు, 300 వికెట్లు సాధించిన మూడో భారత ఆటగాడిగా నిలిచాడు. ఈ ఘనతను గతంలో కపిల్ దేవ్, రవిచంద్రన్ అశ్విన్ సాధించారు. ఇంగ్లండ్ ఆటగాడు ఇయాన్ బోథమ్ తర్వాత అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడు రవీంద్ర జడేజా.
Ravindra Jadeja
భారత్ - న్యూజిలాండ్ మధ్య 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో మూడవ, చివరి మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతోంది. తొలి రోజు ఆట ముగిసే వరకు భారత్ స్కోరు 86/4 పరుగులు. అంతకుముందు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ 235 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఇన్నింగ్స్ తొలిరోజే తడబడింది.
ఒకానొక సమయంలో స్కోరు 78/1 కాగా, అజాజ్ పటేల్ వరుసగా రెండు వికెట్లు తీసి భారత్‌కు షాకిచ్చాడు. రోజు ఆట ముగిసేలోపు విరాట్ కోహ్లి కూడా రనౌట్ అయ్యి పెవిలియన్ బాట పట్టాడు. స్టంప్స్‌కి వచ్చేసరికి భారత్ నాలుగు వికెట్లు కోల్పోయింది. 31 పరుగులతో నాటౌట్‌గా ఉన్న గిల్, 1 పరుగుతో అజేయంగా ఉన్న రిషబ్ పంత్‌ల బ్యాటింగ్‌తో రెండో రోజు ఆట ప్రారంభమవుతుంది.