హైదరాబాద్‌లో శాంసన్-సూర్యల సునామీ ఇన్నింగ్స్ - బంగ్లాదేశ్ పై భారత్ గెలుపు
IND vs BAN : అంతర్జాతీయ క్రికెట్ లో చరిత్ర సృష్టిస్తూ ఒక మ్యాచ్ లో అత్యధిక పరుగులు చేసిన దేశంగా భారత్ నిలిచింది. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 297 పరుగులు చేసింది. అంతకుముందు 2019లో ఐర్లాండ్‌పై ఆఫ్ఘనిస్తాన్ 278/3 పరుగులు చేసింది.
IND vs BANచ Sanju Samson, Surya Kumar Yadav, Hyderabad,
IND vs BAN : ఇదివరకు టెస్టు సిరీస్ లో బంగ్లాదేశ్ ను చిత్తుగా ఓడించిన భారత్ ఇప్పుడు టీ20 సిరీస్ లో కూడా అదే రిపీట్ చేసింది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో బంగ్లాదేశ్ ను మూడు మ్యాచ్ లలో ఓడించింది. హైదరాబాద్ వేదికగా జరిగిన మూడో మ్యాచ్‌లో టీమిండియా 133 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత బ్యాటర్లు పరుగుల తుఫాను కాదు సునామీ తీసుకువచ్చారు.
భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 297 పరుగులు చేసింది. అంతర్జాతీయ టీ20 చరిత్రలో ఒక ఐసీసీ ఫుల్‌టైమ్ దేశం సాధించిన అత్యధిక స్కోరు ఇదే. అంతకుముందు 2019లో ఐర్లాండ్‌పై ఆఫ్ఘనిస్తాన్ 278/3 స్కోర్ చేసింది. ఓవరాల్ రికార్డును పరిశీలిస్తే 2023లో మంగోలియాపై నేపాల్ 314/3 పరుగులు చేసింది. అయితే, నేపాల్ ఐసీసీ పూర్తికాల సభ్య దేశం కాదు.
భారత్ హ్యాట్రిక్ గెలుపు
తొలుత బ్యాటింగ్ చేసి భారత్ నిర్దేశించిన 298 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 164 పరుగులు మాత్రమే చేయగలిగింది. అంతకుముందు గ్వాలియర్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అలాగే, ఢిల్లీలో జరిగిన రెండో టీ20లో 86 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇప్పుడు హైదరాబాద్ లో అద్భుత విజయం సాధించింది. దీంతో సిరీస్‌లో భారత్ హ్యాట్రిక్ విజయాలు సాధించింది. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ తో సిరీస్ ముగిసింది.
సంజూ శాంసన్, సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్ విధ్వంసం
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అభిషేక్ శర్మ ఫామ్ పేలవంగా ఉంది. 4 పరుగులు చేసిన తర్వాత అతను ఔటయ్యాడు. తంజిమ్ హసన్ వేసిన బంతికి మెహదీ హసన్ మిరాజ్ క్యాచ్ పట్టాడు. ఆ తర్వాత పరుగుల తుఫాను మొదలైంది. సంజూ శాంసన్, కెప్టెన్ సూర్య కుమార్ తో కలిసి బంగ్లాదేశ్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నారు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు 70 బంతుల్లో 173 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
40 బంతుల్లో సంజూ శాంసన్ సెంచరీ
సంజూ శాంసన్ తన ఇన్నింగ్స్‌లో ఫోర్లు, సిక్సర్లతో గ్రౌండ్ ను హోరెత్తించాడు. రెండో ఓవర్‌లో తస్కిన్ అహ్మద్ వేసిన బంతుల్లో వరుసగా 4 ఫోర్లు బాదాడు. 22 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీని తర్వాత సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. రిషద్ హుస్సేన్ వేసిన ఓవర్లో వరుసగా 5 సిక్సర్లు బాదాడు.
టీ20 ఇంటర్నేషనల్‌లో శాంసన్ కేవలం 40 బంతుల్లో తొలి సెంచరీ సాధించాడు. మొత్తం 47 బంతుల్లో 111 పరుగుల తన ఇన్నింగ్స్ లో 11 ఫోర్లు, 8 సిక్సర్లు బాదాడు. 236.17 స్ట్రైక్ రేట్ తో పరుగులు సాధించాడు.
సూర్య కుమార్, రియాన్ పరాగ్, హార్దిక్ పాండ్యా తుఫాను ఇన్నింగ్స్ లు
ఈ మ్యాచ్ లో సంజూ శాంసన్ తో పాటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అద్బుతమైన బ్యాటింగ్ తో అదరగొట్టాడు. సెంచరీ చేసేలా కనిపించాడు కానీ, 75 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. 35 బంతుల్లో 75 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్ లో సూర్యకుమార్ 8 ఫోర్లు, 5 సిక్సర్లు బాదాడు. సూర్య స్ట్రైక్ రేట్ 214.29గా ఉంది.
అలాగే, రియాన్ పరాగ్, హార్దిక్ పాండ్యా కూడా ధనాధన్ ఇన్నింగ్స్ ఆడారు. శాంసన్, సూర్యలా పేలుడు బ్యాటింగ్ చేశాడు. రియాన్ పరాగ్ 13 బంతుల్లో 34 పరుగుల తన ఇన్నింగ్స్ లో ఒక ఫోర్, నాలుగు సిక్సర్లు బాదాడు. అలాగే హర్ధిక్ పాండ్యా 18 బంతుల్లో 47 పరుగులు చేసి ఔటయ్యాడు. హార్దిక్ 4 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. రింకూ సింగ్ 4 బంతుల్లో 8 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
బంగ్లాదేశ్ బ్యాటర్లకు షాకిచ్చిన మయాంక్ యాదవ్-రవి బిష్ణోయ్
బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ ను గమనిస్తే ఆ జట్టుకు మంచి ఆరంభం లభించలేదు. భారత ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ ఇన్నింగ్స్ తొలి బంతికే పర్వేజ్ హుస్సేన్‌ను అవుట్ చేశాడు. 15 పరుగుల వద్ద తంజీద్ హసన్ ఔట్ కాగా, కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో 14 పరుగుల వద్ద ఔటయ్యాడు.
వికెట్ కీపర్ లిటన్ దాస్ 42 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. 8 పరుగుల వద్ద మహ్మదుల్లా, 3 పరుగుల వద్ద మెహదీ హసన్ ఔటయ్యారు. రిషాద్ హుస్సేన్ ఖాతా తెరవలేదు. తౌహీద్ అత్యధికంగా అజేయంగా 63 పరుగులు చేశాడు. భారత్ తరఫున రవి బిష్ణోయ్ అత్యధికంగా 3 వికెట్లు పడగొట్టాడు. మయాంక్ యాదవ్ 2 వికెట్లు తీసుకున్నాడు.