టీమిండియా కొంపముంచిన అంశాలు ఇవే
Team India: మెల్‌బోర్న్‌లో జరిగిన టెస్టులో అవసరమైన సమయంలో బౌలర్లు వికెట్లు తీయకపోవడం, బ్యాటర్లు పరుగులు రాబట్టకపోవడం, ఫీల్డింగ్ లోపాల కారణంగా ఆస్ట్రేలియా చేతిలో 184 పరుగుల తేడాతో భారత్ ఓడిపోయింది.
India vs Australia Test
Team India: ప్రస్తుతం భారత్-ఆస్ట్రేలియాలు ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ను ఆడుతున్నాయి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG)లో ఆస్ట్రేలియాతో జరిగిన బాక్సింగ్ డే టెస్ట్‌లో భారత జట్టు ఘోరంగా ఓడిపోయింది. అవసరమైన సమయంలో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో మంచి ప్రదర్శన చేయకపోవడంతో భారత జట్టు ఆసీస్ చేతిలో 184 పరుగులు తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
ఈ మ్యాచ్ లో 3వ, 4వ రోజు మంచి ప్రదర్శన ఇచ్చినా చివరి వరకు అదే జోరును కొనసాగించలేకపోవడంతో రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఇప్పుడు 1-2తో వెనుకబడి ఉండటమే కాకుండా, ఈ ఓటమితో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ ఆశలను కూడా తగ్గిస్తుంది. అయితే, మెల్‌బోర్న్‌లో టీమిండియా కొన్ని తప్పిదాలు చేసి ఓడిపోయింది. వాటి వివరాలు గమనిస్తే..
rohit virat
సీనియర్ ఆటగాళ్లు పరుగులు చేయలేకపోతున్నారు
మెల్‌బోర్న్ టెస్టులో ఐదో రోజు ఆస్ట్రేలియా ఛేజింగ్‌కు భారత్‌కు 340 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చింది. యశస్వి జైస్వాల్ (84), రిషబ్ పంత్ (30) మినహా ఎవరూ ఛేజింగ్‌లో పెద్దగా చెప్పుకునే విధంగా పరుగులు చేయలేదు. మరీ ముఖ్యంగా స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మలు కూడా మరోసారి నిరాశపరిచారు.
అంతకుముందు మ్యాచ్ లలో పెద్దగా పరుగులు చేయని కోహ్లీ, రోహిత్ లు బాక్సింగ్ డే టెస్టులో పెద్ద ఇన్నింగ్స్ లు ఆడతారని అందరూ భావించారు. కానీ, అది జరగలేదు. ఏ ఒక్కరు కూడా ఆస్ట్రేలియాతో జరిగిన నాల్గవ టెస్టులో రాణించలేకపోయారు. మరోసారి ఇద్దరు క్రీజులో ఎక్కువ సేపు నిలబడటానికి ప్రయత్నం చేశారు కానీ, అందులో సక్సెస్ కాలేకపోయారు. ఈ సిరీస్ మొత్తంగా ఇప్పటివరకు కోహ్లీ, రోహిత్ ల నుంచి ఆశించిన పరుగులు రాలేదు.
Rishabh Pant
రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ కూడా బ్యాటింగ్ లో విఫలమయ్యారు
భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ కేఎల్ రాహుల్ కూడా పెద్ద ఇన్నింగ్స్ లు ఆడలేదు. తొలి న్నింగ్స్ లో 24 పరుగులు చేసిన రాహుల్.. రెండో ఇన్నింగ్స్ లో ఒక్క పరుగు కూడా చేయకుండానే పెవిలియన్ కు చేరాడు. మొత్తంగా రెండో ఇన్నింగ్స్‌లో 11 మంది భారత క్రికెటర్లలో తొమ్మిది మంది పూర్తిగా విఫలమయ్యారు.
టెస్ట్ క్రికెట్‌లో చాలా దూకుడుగా ఆడే క్రమంలో వికెట్లు సమర్పించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భారత్ పరుగుల వేటలో రిషబ్ పంత్‌కి సరిగ్గా అదే జరిగింది. ట్రావిస్ హెడ్ బౌలింగ్ లో వెలుపల నుండి వచ్చిన షార్ట్ బాల్ తో పుల్ కోసం వెళ్ళాలని చూశాడు, కానీ అది దూరం వెళ్ళడంలో విఫలమైంది. వైడ్ లాంగ్ ఆన్‌లో మిచెల్ మార్ష్ అద్భుతమైన క్యాచ్‌తో భారత వికెట్ కీపర్‌ను ఔట్ చేశాడు. హెడ్ బౌలింగ్ తో పంత్ కొట్టిన ర్యాష్ షాట్ పై సునీల్ గవాస్కర్ తీవ్రంగా స్పందించారు. మ్యాచ్ పరిస్థితిని చూసుకోకుండా అలాంటి షాట్ ఆడటమేంటని 'స్టుపిడ్' అంటూ పంత్ పై ఫైర్ అయ్యాడు.
భారత్ ను దెబ్బకొట్టిన రన్-అవుట్
మెల్‌బోర్న్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ ను ప్రారంభించిన భారత్ తొలి ఇన్నింగ్స్ లో 369 పరుగులు చేసింది. అయితే, ఇక్కడ మరిన్ని పరుగులు వచ్చేవి. క్రీజులో విరాట్ కోహ్లి, యశస్వి జైస్వాల్ ఉన్నప్పుడు భారత్ 51/2 పరుగులతో ఉంది. ఇద్దరూ మూడో వికెట్‌కు 102 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పినప్పుడు నిర్లక్ష్యంగా పరుగు కోసం వచ్చి రనౌట్ కాకుంటే ఈ జోడీ మరిన్ని పరుగులు చేసేది.
యశస్వి జైస్వాల్ 82 పరుగుల వద్ద స్ట్రైక్‌లో ఉన్నాడు. అతను ప్రమాదకర సింగిల్ కోసం బయలుదేరాడు. మరో ఎండ్‌లో కోహ్లీ బంతిని చూస్తున్నాడు. పాట్ కమిన్స్ త్రో నుండి ఆస్ట్రేలియా అవకాశాన్ని కోల్పోయినప్పటికీ, అలెక్స్ కారీ తన ప్రయత్నాలను పూర్తిగా ఉపయోగించుకున్నాడు. బంతిని పట్టుకుని జైస్వాల్‌ను అవుట్ చేయడానికి స్టంప్‌లోకి పరుగెత్తడంతో వికెట్ పడింది. ఇది కూడా భారత జట్టు ఆటపై ప్రభావం చూపింది. ఆ తర్వాత కొద్ది సేపటికే విరాట్ కోహ్లీ కూడా ఔట్ అయ్యాడు.
Jasprit Bumrah
జస్ప్రీత్ బుమ్రాపై అతిగా ఆధారపడటం
భారత్ కు ఇటీవలి కాలంలో అద్భుతమైన, ఖచ్చితమైన ప్రదర్శనలు ఇస్తున్న బౌలర్ ఎవరైనా ఉన్నారంటే ముందుగా వినిపించే పేరు జస్ప్రీత్ బుమ్రా. అయితే, బౌలింగ్ విషయంలో ఏ ఆటగాడిపైనా అతిగా ఆధారపడడం జట్టుకు మంచిది కాదు. మెల్‌బోర్న్‌లో బుమ్రా రెండు ఇన్నింగ్స్‌లలో తొమ్మిది వికెట్లు సాధించాడు. అయితే, ఇక్కడ మొదటి ఇన్నింగ్స్‌లో మహ్మద్ సిరాజ్ నుండి పెద్దగా మద్దతు లేదు. రెండో ఇన్నింగ్స్‌లో సిరాజ్ 3 వికెట్లు తీసుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్‌లో సిరాజ్ మద్దతు లేకపోవడంతో ఆస్ట్రేలియా 474 పరుగులకు ఆలౌటైంది. ఆకాశ్ దీప్ తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు తీయగా, రెండో ఇన్నింగ్స్‌లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.
Yashasvi Jaiswal
ఫీల్డింగ్ లోపం.. మూడు క్యాచ్ లు మిస్ చేసిన జైస్వాల్
మెల్ బోర్న్ టెస్టులో చెత్త ఫీల్డింగ్ కూడా భారత జట్టును దెబ్బకొట్టింది. బాక్సింగ్ డే టెస్టులో యశస్వి జైస్వాల్ అద్భుతమైన బ్యాటింగ్ తో పరుగులు రాబట్టాడు. రెండు ఇన్నింగ్స్ లలో హాఫ్ సెంచరీలు కొట్టాడు. కానీ, ఫీల్డింగ్ సమయంలో అతను చేసిన తప్పిదాలు భారత్ ను పెద్ద దెబ్బకొట్టాయి. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో నాలుగో రోజు జైస్వాల్ మూడు క్యాచ్‌లను జారవిడిచాడు. ఇది గ్రౌండ్ లో కెప్టెన్ రోహిత్ శర్మకు కోపం తెప్పించింది.
బుమ్రా వరుసగా మూడు వికెట్లు తీశాడు. 40వ ఓవర్‌లో ఆకాష్ దీప్ బౌలింగ్ ను ఎదుర్కొన్న మార్నస్ లాబుస్‌చాగ్నే.. జైస్వాల్ వైపు ఒక బంతిని కొట్టాడు, కానీ దానిని పట్టుకోవడంలో విఫలమయ్యాడు. ఇది చాలా సులభమైన క్యాచ్ అయినప్పటికీ జైస్వాల్ ఆ అవకాశాన్ని వృధా చేశాడు. మళ్లీ 10 ఓవర్ల తర్వాత రవీంద్ర జడేజా వేసిన బంతికి పాట్ కమ్మిన్స్‌ను జైస్వాల్ ఔట్ చేస్తే చాన్స్ వచ్చింది కానీ, క్యాచ్ ను అందుకోలేకపోయాడు. మూడో ఓవర్‌లో ఉస్మాన్ ఖవాజా ఇచ్చిన క్యాచ్ ను కూడా జైస్వాల్ మిస్ చేశాడు. మొత్తంగా ఈ తప్పిదాలన్ని భారత్ జట్టు ఓటమికి కారణం అయ్యాయి.