- Home
- Sports
- Cricket
- మమ్మల్ని వాడుకుని వదిలేశారు.. 2011 వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ అంటే అంత అలుసా..?: బీసీసీఐపై భజ్జీ ఘాటు వ్యాఖ్యలు
మమ్మల్ని వాడుకుని వదిలేశారు.. 2011 వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ అంటే అంత అలుసా..?: బీసీసీఐపై భజ్జీ ఘాటు వ్యాఖ్యలు
Harbhajan Singh: 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్టులోని సభ్యులతో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) వ్యవహరించిన తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు.

1983 లో కపిల్ దేవ్ సారథ్యంలోని భారత జట్టు తర్వాత సుమారు మూడు దశాబ్దాల తర్వాత టీమిండియాకు ప్రపంచకప్ అందించింది 2011లో ధోని సేన. స్వదేశంలో జరిగిన ప్రపంచకప్ ఫైనల్ లో భారత్ జట్టు శ్రీలంక పై జయకేతనం ఎగురవేసి 28 ఏండ్ల తర్వాత ప్రపంచకప్ లో మళ్లీ మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించింది.
అయితే 2011 ప్రపంచకప్ గెలిచిన జట్టులోని సభ్యులతో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) వ్యవహరించిన తీరుపై అప్పటి విన్నింగ్ టీమ్ లో ఆటగాడుగా ఉన్న హర్భజన్ సింగ్ సంచలన ఆరోపణలు చేశాడు.
తమను బీసీసీఐ వాడుకుని వదిలేసిందని, ఆ తర్వాత ప్రపంచకప్ లో కూడా తమకు ఆడే సత్తా ఉన్నా ఆడనీయలేదని తీవ్రంగా ధ్వజమెత్తాడు.
భజ్జీ మాట్లాడుతూ.. ‘వాళ్లంతా (బీసీసీఐ అధికారులు) ఏం చేశారో మీ అందరికీ తెలుసు. 2011 లో ప్రపంచకప్ గెలిచిన జట్టుగా ఉన్న మేము ఆ తర్వాత కలిసి ఒక్క మ్యాచు కూడా ఎందుకు ఆడలేదు..?
అంటే మీ (బీసీసీఐ) దృష్టిలో మేము ప్రపంచకప్ గెలవగానే ఎందుకు పనికిరాకుండా అయిపోయామా..? 2011 వరల్డ్ కప్ ఫైనల్ ఆడుతున్నప్పుడు హర్భజన్ వయస్సు 31 ఏండ్లు. యువరాజ్ సింగ్ కు 30 ఏండ్లు. సెహ్వాగ్ కు 32 ఏండ్లు. గౌతం గంభీర్ కు 29 ఏండ్లు. వీళ్లంతా 2015 ప్రపంచకప్ లో ఆడటానికి పనికిరాలేదా..?
వాళ్లందరినీ ఒక్కొక్కరిగా ఎందుకు తొలగించారు..? వాళ్లంతా ‘యూజ్ అండ్ త్రో’ మెటీరియల్ గా ఎందుకు మారారు..? భారత క్రికెట్ లో ఇదో బాధాకరమైన విషయం. అక్కడ ఇప్పుడేం జరుగుతుందో నాకు తెలియదు గానీ 2011లో మాత్రం నన్ను జట్టు నుంచి తొలగించాలని చూశారు.
ఆ సమయంలో నాకు కొంత మంది సాయం అందించారు. కానీ 2012 తర్వాత వాళ్లు నన్ను జట్టులోంచి తప్పించారు. అప్పట్నుంచి నన్ను మళ్లీ జాతీయ జట్టుతో చేరనీయలేదు..’ అని తీవ్ర ఆరోపణలు చేశాడు భజ్జీ..
భజ్జీ చెప్పినట్టుగానే 2011 ప్రపంచకప్ గెలిచిన తర్వాత అప్పటి భారత జట్టులోని సీనియర్ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా జట్టును వీడారు. వ్యక్తిగత కారణాల రీత్యా అని చెప్పినా, శరీరం సహకరించడం లేదని చెప్పినా.. దీని వెనకాల ఏదో జరుగుతుంది..? అని టీమిండియా అభిమానుల్లో కూడా ఆందోళన ఉండేది. తాజాగా భజ్జీ వ్యాఖ్యలు చూస్తే అదే నిజమనిపించకమానదు.
ఇక 2011 ప్రపంచకప్ ఫైనల్ లో ఆడిన గంభీర్, సెహ్వాగ్, భజ్జీ, యువరాజ్ లు 2015లో ఆడలేదు. ఆ తర్వాత జట్టులో కోహ్లి, రోహిత్, రైనా వంటి అప్పటి యువ ఆటగాళ్లకు ప్రాధాన్యం పెరిగింది.