- Home
- Sports
- Cricket
- మొన్న ఐపీఎల్ ఆడటం మానేయమన్నాడు.. ఇప్పుడేమో అదే గ్రేట్ అంటున్నాడు.. రవిశాస్త్రి రూటే సెపరేటు
మొన్న ఐపీఎల్ ఆడటం మానేయమన్నాడు.. ఇప్పుడేమో అదే గ్రేట్ అంటున్నాడు.. రవిశాస్త్రి రూటే సెపరేటు
టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి పరిస్థితులకు తగ్గట్టుగా మాట మారుస్తున్నాడు. కొద్దిరోజుల క్రితమే ఐపీఎల్ ఆడటం మానేయమన్న అతడు.. ఇప్పుడేమో దానివల్లే భారత క్రికెట్ ఈ స్థాయిలో ఉందని అంటున్నాడు.

భారత్ - ఆస్ట్రేలియా మధ్య కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా కొద్దిరోజుల క్రితమే ముగిసిన డబ్ల్యూటీసీ ఫైనల్ లో భారత జట్టు ఓడటంతో ఎప్పటిలాగే చాలా మంది మాజీ క్రికెటర్లు ‘ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆడటం మానేయండి.. మీకు దేశం కంటే అదే ఎక్కువైందా..?’అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ఐపీఎల్ వల్లే భారత ఆటగాళ్లు టెస్టు క్రికెట్ ఆడటాన్ని మరిచిపోతున్నారని, టీమిండియాకు ఆడే క్రికెటర్లకు ఐపీఎల్ నుంచి మినహాయించాలన్న వాదనలూ వినిపించాయి. టీమిండియా ఆటగాళ్లు ఐపీఎల్ ఆడొద్దన్న వారిలో మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా ఉన్నాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్ లో ఓడిన తర్వాత రోహిత్ శర్మ మాట్లాడుతూ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ ను జూన్ లో నిర్వహించడం వల్ల తమకు తీవ్ర నష్టం జరుగుతుందని.. మే చివరి వరకూ ఐపీఎల్ ఆడి ఇక్కడికి వచ్చి టెస్టు క్రికెట్ లో అనుకున్న స్థాయిలో రాణించలేకపోతున్నామని కామెంట్స్ చేశాడు. ఈ వ్యాఖ్యలకు శాస్త్రి కౌంటర్ ఇచ్చాడు.
‘ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి ప్రిపేర్ అవ్వడానికి 25 రోజుల సమయం కావాలంటే, ఐపీఎల్ ఆడడం మానేయాలి. ఐపీఎల్ ఆడటం మానేస్తే రెండు నెలల సమయం దొరుకుతుంది. అయినా ఐసీసీ ట్రోఫీ గెలవడం అంత ఈజీ కాదు, మహేంద్ర సింగ్ ధోనీ అలా ఈజీగా కనిపించేలా చేశాడు.. ’ అంటూ స్పందించాడు శాస్త్రి..
తాజాగా శాస్త్రి మాట్లాడుతూ.. ‘ఈరోజు ఇండియా క్రికెట్ ఈ స్థాయిలో ఉందంటే దానికి కారణం ఐపీఎల్. మీరు ఐపీఎల్ కు థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఐపీఎల్ ఆడిన క్రికెటర్లు అవకాశాలను సద్వినియోగం చేసుకుని టీ20లు, వన్డేలే కాదు.. ఏకంగా టెస్టు క్రికెట్ కూడా ఆడుతున్నారు..
ఐపీఎల్ అనేది భారత క్రికెట్ కు బంగారు గుడ్లు పెట్టే బాతు వంటిది. ఇకనుంచి భారత జట్టు సరిగా ఆడకుంటే ఈ బంగారు బాతును నిందించడం మానండి. దానిని విస్మరిస్తే టీమిండియాకు సమస్యలు తప్పవు..’ అని వ్యాఖ్యానించాడు.
శాస్త్రి వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. ‘అవసరాలకు తగ్గట్టు మాట్లాడటంలో మన మాజీ హెడ్ కోచ్ ఆరితేరాడు’.. ‘ఒంటి మీద బట్టలు మార్చినట్టు ఎంత ఈజీగా నీ స్టేట్మెంట్ ను మార్చుకుంటున్నావ్..? కొంచెం గతంలో ఏం మాట్లాడావో చెక్ చేసుకో..’అని కామెంట్స్ చేస్తున్నారు. భారత జట్టు ఐపీఎల్ ప్రారంభం (2008) కాకముందే 2007లో టీ20 వరల్డ్ కప్ గెలిచింది. కానీ ఐపీఎల్ తర్వాత మళ్లీ ఒక్క పొట్టి ప్రపంచకప్ కూడా నెగ్గలేదు.