- Home
- Sports
- Cricket
- నేనే గనక కోహ్లీ సారథ్యంలో ఆడుంటే భారత్ మూడు ప్రపంచకప్పులు గెలిచేది.. మాజీ పేసర్ సంచలన వ్యాఖ్యలు
నేనే గనక కోహ్లీ సారథ్యంలో ఆడుంటే భారత్ మూడు ప్రపంచకప్పులు గెలిచేది.. మాజీ పేసర్ సంచలన వ్యాఖ్యలు
Virat Kohli: విరాట్ కోహ్లీ కెరీర్ లో తీరని లోటుగా మిగిలిపోయిన ఐసీసీ ట్రోఫీని తాను ఉంటే సాధించేవాడిని అంటున్నాడు కేరళ స్పీడ్ స్టార్.

టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ తన వ్యక్తిగత కెరీర్ లో ఎన్ని ఘనతలు సాధించినా తనఖాతాలో ఐసీసీ ట్రోఫీ లేని లోటు ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది.
Virat Kohli
2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ లో సభ్యుడిగా ఉన్నా అతడు సారథిగా మాత్రం ఆ అరుదైన ఘనతను సాధించలేకపోయాడు. 2019 వన్డే ప్రపంచకప్ లో భారత జట్టు సెమీస్ లోనే చతికిలపడింది.
ఇక కోహ్లీ సారథ్యంలో 2021 టీ20 ప్రపంచకప్ లో పాల్గొన్నా టీమిండియా గ్రూప్ దశలోనే ఇంటిబాట పట్టింది. అయితే తాను గనక విరాట్ కోహ్లీ సారథ్యంలో ఆడి ఉంటే భారత జట్టు మూడు ప్రపంచకప్పులు గెలిచేదని అంటున్నాడు టీమిండియా మాజీ పేసర్, కేరళ స్పీడ్ స్టార్ ఎస్. శ్రీశాంత్.
తాజాగా అతడు షేర్ చాట్ ఆడియో చాట్ రూట్ క్రిక్ చాట్ కార్యక్రమానికి అతిథిగా వచ్చిన శ్రీశాంత్ మాట్లాడాడు. భారత జట్టు 2011 వన్డే ప్రపంచకప్ తర్వాత మళ్లీ ప్రపంచకప్ (2015, 2019) ఎందుకు నెగ్గలేదన్న ప్రశ్నకు శ్రీశాంత్ సమాధానమిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
శ్రీశాంత్ స్పందిస్తూ.. ‘విరాట్ కోహ్లీ సారథ్యంలో నేను ఆడి ఉంటే ఇండియా 2015, 2019 వన్డే ప్రపంచకప్ లతో పాటు 2021 టీ20 ప్రపంచకప్ లో కూడా గెలిచి ఉండేది..’ అని అన్నాడు.
2007 టీ20 ప్రపంచకప్ లో భాగంగా ఫైనల్ లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా చివరి బంతికి మిస్బా ఉల్ హక్ ఇచ్చిన క్యాచ్ ను పట్టిన శ్రీశాంత్.. 2011 వన్డే ప్రపంచకప్ లో కూడా భాగమయ్యాడు. శ్రీశాంత్ ను లక్కీ బౌలర్ అని ధోని భావించేవాడని గతంలో వార్తలు వచ్చాయి. అయితే తర్వాత చోటు చేసుకున్న పరిణామాల కారణంగా శ్రీశాంత్ జాతీయ జట్టుకు ఆడలేకపోయాడు.
ఇక 2011 వన్డే ప్రపంచకప్ ను తాము సచిన్ కోసం నెగ్గామని శ్రీశాంత్ తెలిపాడు. ఆ టోర్నీ గెలిచాక తాను సచిన్ పక్కన నిల్చోవడం భావోద్వేగానికి గురిచేసిందని శ్రీశాంత్ చెప్పాడు. ‘మేము ప్రపంచకప్ గెలిచింది సచిన్ కోసం..’ అని తెలిపాడు.