- Home
- Sports
- Cricket
- ICC Women's World Cup: అరుదైన ఘనతను సాధించిన జులన్ గోస్వామి..మరో వికెట్ తీస్తే చరిత్రే..
ICC Women's World Cup: అరుదైన ఘనతను సాధించిన జులన్ గోస్వామి..మరో వికెట్ తీస్తే చరిత్రే..
ICC Women's World Cup 2022: భారత మహిళా క్రికెట్ జట్టు వెటరన్ బౌలర్ జులన్ గోస్వామి అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. రాబోయే మ్యాచులలో ఒక్క వికెట్ పడగొట్టినా ఆమె చరిత్ర సృష్టించనుంది.

టీమిండియా మహిళా క్రికెట్ జట్టులో సీనియర్ బౌలర్ జులన్ గోస్వామి అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఐసీసీ మహిళల ప్రపంచకప్ లో భాగంగా హమిల్టన్ వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచులో ఆమె ఈ ఘనత సాధించింది.
ఈ మ్యాచులో టాస్ గెలిచిన భారత జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ లో ఆఖరి ఓవర్లో ధాటిగా ఆడుతున్న వికెట్ కీపర్ కేటీ మార్టిన్ ను ఔట్ చేసిన అనంతరం ఆమె.. ప్రపంచకప్ లో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ గా ఉన్న ఆస్ట్రేలియా బౌలర్ లిన్ ఫుల్స్టన్ రికార్డును సమం చేసింది.
1982 నుంచి 1988 వరకు జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్ లలో భాగమైన లిన్.. ఈ టోర్నీలో మొత్తంగా 39 వికెట్లు తీసుకుని అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఇక మార్టిన్ ను ఔట్ చేయగానే గోస్వామి కూడా టోర్నీలో 39 వికెట్లు సాధించిన బౌలర్ గా అవతరించింది. భారత్ తరఫున ఆమె.. ఏకంగా ఐదు ప్రపంచకప్ లలో ప్రాతినిథ్యం వహిస్తున్నది.
2005 నుంచి ప్రపంచకప్ ఆడుతున్న గోస్వామికి ఇది ఐదో ప్రపంచకప్. ఇప్పటివరకు 39 వికెట్లు తీసిన గోస్వామి.. మరో వికెట్ తీస్తే ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన తొలి బౌలర్ గా చరిత్ర పుటల్లో నిలువనుంది.
మూడు రోజుల క్రితం పాకిస్థాన్ తో జరిగిన తొలి మ్యాచులో 2 వికెట్లు తీసుకున్న గోస్వామి.. న్యూజిలాండ్ తో మ్యాచులో 9 ఓవర్లు వేసి ఆఖరి ఓవర్లో వికెట్ దక్కించుకుని ఈ ఘనతను అందుకుంది.
ఇదిలాఉండగా.. గురువారం కివీస్ తో జరిగిన మ్యాచులో భారత్ కు ఘోరపరాజయం ఎదురైంది. టాస్ గెలిచిన మిథాలీ రాజ్ సేన.. తొలుత బౌలింగ్ ఎంచుకుంది. న్యూజిలాండ్ బ్యాటర్లు.. అమెలియా కెర్ (50), సట్టర్థ్వేట్ (75), కేటీ మార్టిన్ (41)లు రాణించడంతో ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది.
261 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ తడబడింది. పాక్ తో మ్యాచులో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న ఓపెనర్ స్మృతి మంధాన (5), దీప్తి శర్మ (5) లుు ఈ మ్యాచులో విఫలమయ్యారు. హర్మన్ ప్రీత్ కౌర్ (71), కెప్టెన్ మిథాలీ రాజ్ (31) పోరాడినా.. ఫలితం మాత్రం దక్కలేదు. 46.4 ఓవర్లలో భారత్ .. 198 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా కివీస్ 62 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.