- Home
- Sports
- Cricket
- T20 World Cup 2021: అంతా భారత్ కే అనుకూలంగా ఉంది.. కోహ్లితో జాగ్రత్త.. పాక్ మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు
T20 World Cup 2021: అంతా భారత్ కే అనుకూలంగా ఉంది.. కోహ్లితో జాగ్రత్త.. పాక్ మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు
India vs Pakistan: చిరకాల ప్రత్యర్థుల మధ్య పొట్టి ప్రపంచకప్ సమరానికి ఇరుదేశాల క్రికెట్ అభిమానులు వేయి కండ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ సంచలన వ్యాఖ్యలు చేసి ఆ జట్టు అభిమానులకు షాకిచ్చాడు.

ఈ నెల 24న దాయాదుల (India vs Pakistan) మధ్య పోరాటం కోసం ఇరుదేశాల క్రికెట్ అభిమానులతో పాటు క్రికెట్ అభిమానులు వేయి కండ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ కు ముందు పలువురు సీనియర్ క్రికెటర్లు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ (Inzamam-ul-haq) కూడా సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఈ మ్యాచ్ లో భారతే (India) ఫేవరేట్ అని ఇంజమామ్ కుండబద్దలు కొట్టాడు. పాకిస్తాన్ (Pakistan) తో పోలిస్తే ఇండియా అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉందని వ్యాఖ్యానిస్తూ ఆ దేశ అభిమానులకు షాక్ కు గురి చేశాడు.
రాబోయే మ్యాచ్ లో భారత్ తరఫున ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి (Virat Kohli) కీలక ఆటగాడు అని ఇంజమామ్ అభిప్రాయపడ్డాడు. అతడితో జాగ్రత్తగా ఉండాలని పాక్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్ (Babar azam) తో పాటు ఇతర ప్లేయర్లను హెచ్చరించాడు.
యూట్యూబ్ వేదికగా మాట్లాడిన ఇంజమామ్.. ‘ఈ మ్యాచ్ భారత్ కే అనుకూలంగా ఉంది. ఐపీఎల్ 2021 కారణంగా భారత జట్టుకు యూఏఈ పిచ్ లపై గ్రిప్ వచ్చింది’ అని అన్నాడు.
విరాట్ కోహ్లి గురించి స్పందిస్తూ.. ‘ఈ మ్యాచ్ లో భారత సారథి విరాట్ కోహ్లితో జాగ్రత్తగా ఉండాలి. ఏ క్షణంలోనైనా మ్యాచ్ ను తనవైపునకు తిప్పుకోవడంలో కోహ్లి సిద్ధహస్తుడు’ అని బాబర్ ఆజమ్ అండ్ కో ను హెచ్చరించాడు.
టీ20 ప్రపంచకప్ తర్వాత కోహ్లి భారత టీ20 కెప్టెన్ గా వైదొలగడంపై ఇంజమామ్ మాట్లాడాడు. ‘అతడు తన బ్యాటింగ్ ను ఆస్వాదించాలనుకుంటున్నాడు. ఇది మంచి నిర్ణయం. కెప్టెన్ గా అతడికి ఇదే చివరి వరల్డ్ కప్ కావడంతో ఇంకా కసిగా ఆడతాడు’ అని తెలిపాడు.
ఉపఖండంలో భారత్ అత్యంత ప్రమాదకర జట్టు అని ఇంజమామ్ ప్రశంసలు కురిపించాడు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ వంటి సీనియర్లతో పాటు శార్దుల్ ఠాకూర్ వంటి ఆల్ రౌండర్లు కూడా ఉండటం భారత్ కు కలిసొచ్చే అంశమని అభిప్రాయపడ్డాడు. బ్యాటింగ్ లో భారత్ కు ప్రపంచంలోనే తిరుగులేని లైనప్ ఉందని ఇంజమామ్ అన్నాడు.
ఇక పాకిస్తాన్ పై విరాట్ కోహ్లికి మంచి రికార్డే ఉంది. ఆ జట్టుపై 6 టీ20 మ్యాచ్ లు ఆడిన విరాట్.. 254 పరుగులు చేశాడు. రెండు హాఫ్ సెంచరీలతో అత్యధిక స్కోరు 78 కాగా సగటు 84గా ఉంది.
వన్డేలలో కూడా పాక్ పై విరాట్ కు గణమైన రికార్డే ఉంది. దాయాది జట్టుతో 13 మ్యాచ్ లు ఆడిన కోహ్లి.. 536 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోరు 183.