రషీద్ ఖాన్‌ను వెనక్కినెట్టిన రవి బిష్ణోయ్.. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ టాప్ లో మనోడే
Ravi Bishnoi: ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్‌ను భారత్ 4-1 తేడాతో గెలుచుకుంది. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ ఓటమికి కంగారులపై టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. ఈ సిరీస్ లో తన అద్భుతమైన బౌలింగ్ తో రవి బిష్ణోయ్ అదరగొట్టాడు.
ICC Rankings: ఐసీసీ క్రికెట్ ర్యాంకింగ్స్ టీమిండియా అధిపత్యం కొనసాగుతోంది. టాప్ ర్యాంకులలో భారత ఆటగాళ్లు ఉన్నారు. ఇటీవల ముగిసిన భారత్-ఆస్ట్రేలియా టీ20 సిరీస్ లో తన అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న రవి బిష్ణోయ్.. అఫ్గానిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ను వెనక్కినెట్టి ప్రపంచ నంబర్ వన్ టీ20 బౌలర్ గా అరుదైన ఘనత సాధించాడు.
ఐదు మ్యాచ్ ల సిరీస్ లో రవి బిష్ణోయ్ అద్భుత ప్రదర్శనతో పాటు ఇతర ఆటగాళ్లు రాణించడంతో టీమిండియా 4-1 తేడాతో కంగారులను మట్టికరిపించి, సిరీస్ ను కైవసం చేసుకుంది. ఈ సిరీస్ లో ఎక్కువ వికెట్లు తీసుకున్న ప్లేయర్ గా రవి నిలిచాడు.
ఐసీసీ టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్ లో బిష్ణోయ్ అగ్రస్థానానికి ఎగబాకడం అద్భుతం. గతంలో ఐదో స్థానంలో ఉన్న ఈ లెగ్ స్పిన్నర్ ఇప్పుడు 699 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ ర్యాంకింగ్స్ పెరుగుదల అతని అసాధారణ నైపుణ్యాలకు, ఆస్ట్రేలియాపై మ్యాచ్ విన్నింగ్ సేవలకు నిదర్శనంగా చెప్పవచ్చు.
ఇటీవల ముగిసిన ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో 9 వికెట్లు పడగొట్టిన రవి బిష్ణోయ్.. ఈ సిరీస్ లో అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్ గా నిలిచాడు. ఐసీసీ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ భారత మరో బౌలర్ గా రికార్డు సృష్టించాడు.
ప్రస్తుతం 699 పాయింట్లతో అఫ్గానిస్థాన్ స్పిన్ దిగ్గజం రషీద్ ఖాన్ (692)ను వెనక్కి నెట్టి బిష్ణోయ్ ఐదు స్థానాలు ఎగబాకాడు. ప్రస్తుతం ఐసీసీ టీ20 బౌలర్స్ ర్యాంకింగ్స్ లో టాప్-5 ప్లేయర్స్ లో రవి బిష్ణోయ్ తర్వాత రషీద్ ఖాన్ (అఫ్గానిస్థాన్), వానిందు హసరంగా (శ్రీలంక), ఆదిల్ రషీద్ (ఇంగ్లాండ్), మహేశ్ తీక్షణ (శ్రీలంక) లు ఉన్నారు.