సిరాజ్‌కి షాకిచ్చిన ఐసీసీ.. ట్రావిస్ హెడ్ తప్పించుకున్నాడా?
India vs Australia: బోర్డర్ గవాాస్కర్ ట్రోఫీ రెండో టెస్ట్ మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్, మహ్మద్ సిరాజ్ మధ్య వాగ్వాదం జరిగింది. ఈ మ్యాచ్ లో చోటుచేసుకున్న పలు ఘటనలు మరింత ఉత్కంఠను రేపాయి.
ఇండియా vs ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్
ఆస్ట్రేలియాతో 5 టెస్ట్‌ల సిరీస్‌లో భారత్ ఆడుతోంది. దీనిలో భాగంగా పెర్త్‌లో జరిగిన తొలి టెస్ట్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఇదే జోరును సిరీస్ మొత్తం కొనసాగించాలని భావించింది. అయితే, అడిలైడ్ వేదికగా జరిగిన రెండో పింక్ బాల్ టెస్ట్‌లో 10 వికెట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో భారత జట్టు అన్ని విభాగాల్లో విఫలం కావడంతో ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది.
ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ బ్యాట్స్‌మన్ ట్రావిస్ హెడ్ దూకుడుగా ఆడుతూ సెంచరీ కొట్టాడు. 141 బంతుల్లో 140 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే, ఈ మ్యాచ్ లో ట్రావిస్ హెడ్, మహ్మద్ సిరాజ్‌కి మధ్య జరిగిన వాగ్వాదం చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.
హెడ్ vs సిరాజ్
దూకుడుగా ఆడుతున్న ట్రావిస్ హెడ్.. సిరాజ్ వేసిన ఒక ఓవర్లో ఒక ఫోర్, సిక్స్ కొట్టాడు. ఆ తర్వాతి బంతికే సిరాజ్ యార్కర్‌కి బోల్డ్ అయ్యాడు. ఔటైన తర్వాత సిరాజ్‌తో అతను ఏదో అన్నాడు. సిరాజ్ కోపంగా 'వెళ్లిపో' అన్నట్టు సైగ చేశాడు. హెడ్ కూడా కోపంగా సిరాజ్‌తో ఏదో అంటూ వెళ్లిపోయాడు. ఇదే విషయం గురించి ట్రావిస్ హెడ్ తర్వాత 'నేను ఔటైనప్పుడు సిరాజ్‌తో బాగా బౌలింగ్ చేశావ్ అన్నాను. అతను దాన్ని తప్పుగా అర్థం చేసుకుని కోపగించుకున్నాడని' అని చెప్పాడు.
సిరాజ్‌కి ఐసీసీ జరిమానా
భారత పేసర్ మహ్మద్ సిరాజ్ దీని గురించి మాట్లాడుతూ.. 'నేను వికెట్ తీసిన ఆనందంలో సంబరాలు చేసుకున్నాను. హెడ్‌తో ఏమీ మాట్లాడలేదు. కానీ అతనే నన్ను తిట్టాడు. బాగా బౌలింగ్ చేశావ్ అన్నాడని అబద్ధం చెబుతున్నాడు. హెడ్ ఏమన్నాడో అందరికీ తెలుసు. నేను అందరినీ గౌరవిస్తాను. ఎవరినీ అవమానించడం నా పని కాదు. కానీ హెడ్ చేసింది నాకు నచ్చలేదు' అని పేర్కొన్నాడు. ఈ వాగ్వాదం పై ఐసీసీ చర్యలు తీసుకుంది. భారత పేసర్ సిరాజ్ కు షాకిచ్చింది. ఐసీసీ సిరాజ్ మ్యాచ్ ఫీజులో 20% జరిమానా విధించింది. ఇదే సమయంలో ట్రావిస్ హెడ్‌కి మాత్రం వార్నింగ్ తో సరిపెట్టింది.
మహ్మద్ సిరాజ్ బౌలింగ్
అలాగే, ఇద్దరికీ డిమెరిట్ పాయింట్ ఇచ్చింది. కానీ, ఇద్దరు ప్లేయర్లు ఈ వాగ్వాదంలో పాలుపంచుకున్నారు. ఇద్దరూ తప్పు ఒప్పుకున్నారు. అయినా ట్రావిస్ హెడ్‌కి జరిమానా ఎందుకు విధించలేదని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. మహ్మద్ సిరాజ్ విషయంలో ఐసీసీ తప్పుడు నిర్ణయం తీసుకుందని పలువురు క్రికెట్ లవర్స్ కామెంట్స్ చేస్తున్నారు.