నేటితో పూర్తి కానున్న తుది గడవు.. బుమ్రా స్థానంలో ఆడేది ఎవరు..?
T20I World Cup 2022: టీ20 ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన జట్టులో మార్పులు చేర్పులు చేయడానికి బోర్డులకు నేడే ఆఖరు తేది. దీంతో టీమిండియలో బుమ్రా స్థానంలో ఎంపికయ్యేది ఎవరు..? అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

ఈనెల మూడో వారం నుంచి ఆస్ట్రేలియా వేదికగా ప్రారంభం కాబోయే టీ20 ప్రపంచకప్ లో పాల్గొనబోయే జట్లు ఇప్పటికే 15 మంది రెగ్యులర్ ఆటగాళ్లు, స్టాండ్ బై లతో కూడిన జట్లను ఎంపిక చేశాయి. అయితే ఆయా జట్లలో గాయపడిన ఆటగాళ్ల స్థానంలో కొత్త ఆటగాళ్లను ఎంపిక చేసుకోవడానికి, జట్టులో మార్పులు చేర్పులు చేసుకోవడానికి బోర్డులకు నేడే ఆఖరి రోజు.
Image credit: Getty
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిబంధనల ప్రకారం అక్టోబర్ 9 వరకు బోర్డులకు తమ జట్టులో మార్పులు చేర్పులు చేసుకోవడానికి నేడే ఆఖరు తేది. దీంతో కొత్త ఆటగాళ్లు ఎవరు చేరనున్నారనే ఆసక్తి అన్ని దేశాల క్రికెట్ అభిమానుల్లోనూ నెలకొంది.
ముఖ్యంగా టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా గాయపడి టీ20 ప్రపంచకప్ కు దూరమైన నేపథ్యంలో ఆ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడి కోసం బీసీసీఐ కసరత్తులు మొదలుపెట్టింది. ఇప్పటికే స్టాండ్ బైగా ఎంపిక చేసిన మహ్మద్ షమీ, దీపక్ చాహర్ లలో ఎవరికో ఒకరికి ఆ అవకాశం వరించనుంది.
Image credit: Getty
కోవిడ్ నుంచి కోలుకున్న షమీ ప్రస్తుతం ఎన్సీఏలో ఉన్నాడు. అలాగే దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కు ఎంపికైన దీపక్ చాహర్ కూడా వెన్నునొప్పి తిరగబెట్టడంతో అతడు కూడా ఎన్సీఏలోనే ఉన్నాడు. అయితే చాహర్ కు అయిన గాయమేమీ ఆందోళన చెందాల్సినది కాదని ఎన్సీఏ వర్గాలు చెబుతున్నాయి. నేడు ఈ ఇద్దరికీ ఫిట్నెస్ టెస్టును నిర్వహించి ఇద్దర్లో ఎవరో ఒకరిని బుమ్రా రిప్లేస్మెంట్ గా ప్రకటించే అవకాశమున్నట్టు తెలుస్తున్నది.
మార్పులు చేర్పుల గురించి నేడు ఐసీసీకి నేరుగా చెబితే సరిపోతుంది. అలా కాకుంటే అక్టోబర్ 15 వరకు కూడా ఛాన్స్ ఉంది గానీ అప్పటికీ ఐసీసీ అనుమతులు, పలు నిబంధనల ప్రకారం జట్టులో మార్పులు చేయాల్సి ఉంటుంది. ఆ తంటాలు ఉండొద్దనుకుంటే జట్లు నేడే తమ జట్లలో మార్పులు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ప్రస్తుతం బుమ్రా స్థానాన్ని భర్తీ చేసేది మహ్మద్ షమీయేనని తెలుస్తున్నది. షమీతో పోల్చితే అతడికున్న అనుభవం చాహర్ కు లేదు. అదీగాక ఆసీస్ లో బౌన్సీ పిచ్ లపై ఆడిన అనుభవం కూడా షమీకి ఉంది. అది కూడా అతడికి కలిసొచ్చేదే. మరి సెలక్టర్లు షమీని ఎంపిక చేస్తారా..? లేక చాహర్ కు అవకాశమిస్తారా..? అనేది కొద్దిగంటల్లో తేలనుంది.