ICC అవార్డ్స్ ఆఫ్ ది డికేడ్... దశాబ్ది అవార్డుల నామినేషన్లలో ఎవరెవరు ఉన్నారంటే...
ఐసీసీ ర్యాంకింగ్‌లో టాప్‌లో నిలవడం ఓ గొప్ప ఖ్యాతిగా భావిస్తారు క్రికెటర్లు. ఏటా అందించే ఐసీసీ అవార్డులు కూడా ఎంతో ప్రతిష్టాత్మకమైనవి. అలాంటిది ఈసారి దశాబ్దానికి సంబంధించి అవార్డులను ఇవ్వబోతున్నట్టు ప్రకటించింది అంతర్జాతీయ క్రికెట్ మండలి. 2011 నుంచి 2020 మధ్య దశాబ్ద కాలంలో అంతర్జాతీయ క్రికెట్‌లో సత్తా చాటిక పురుషుల, మహిళల క్రికెటర్లకు ఈ అవార్డులు దక్కబోతున్నాయి. ఈ నామినేషన్లలో ఎవరెవరు ఉన్నారంటే...
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది డికేడ్ (మెన్స్): దశాబ్ద కాలంలో 20వేలకు పైగా పరుగులు చేసిన ఏకైక క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు భారత సారథి విరాట్ కోహ్లీ. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది డికేడ్ నామినేషన్లలో విరాట్ కోహ్లీతో పాటు టీమిండియా తరుపు నుంచి రవిచంద్రన్ అశ్విన్ కూడా నిలిచాడు. ఇంగ్లాండ్ నుంచి జో రూట్, న్యూజిలాండ్ నుంచి కేన్ విలియంసన్, సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిల్లియర్స్, ఆస్ట్రేలియా ప్లేయర్ స్టీవ్ స్మిత్‌తో పాటు శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగర్కర కూడా ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది డికేడ్ నామినేషన్స్‌లో ఉన్నారు.
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది డికేడ్ (వుమెన్స్): టీమిండియా తరుపున అత్యధిక పరుగులు చేసిన వన్డే, టెస్టు టీమ్ కెప్టెన్ మిథాలీరాజ్ ఐసీసీ వుమెన్ ప్లేయర్ ఆఫ్ ది డికేడ్ నామినేషన్లలో నిలిచింది. ఆమెతో పాటు ఆసీస్ ప్లేయర్లు ఎల్లీసీ పెర్రీ, మెగ్ లానింగ్, న్యూజిలాండ్ ప్లేయర్ సుజీ బేట్స్, విండీస్ ప్లేయర్ స్టాఫనీ టేలర్, ఇంగ్లాండ్ మాజీ ప్లేయర్ సారా టేలర్ ఈ నామినేషన్స్‌లో పోటీపడబోతున్నారు.
టెస్టు ప్లేయర్ ఆఫ్ ది డికేడ్ (మెన్స్): భారత సారథి విరాట్ కోహ్లీతో పాటు అతనితో పోటీపడుతున్న ఆసీస్ ప్లేయర్ స్టీవ్ స్మిత్, జో రూట్, ఇంగ్లాండ్ ప్లేయర్ జేమ్స్ అండర్‌సన్, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్, శ్రీలంక ప్లేయర్ రంగనా హేరాత్, పాకిస్థాన్ ప్లేయర్ యాసిర్ షా... దశాబ్ది టెస్టు ప్లేయర్ అవార్డు నామినేషన్స్‌లో ఉన్నారు.
వన్డే ప్లేయర్ ఆఫ్ ది డికేడ్ (మెన్స్): టెస్టులతో పాటు వన్డే ప్లేయర్ ఆఫ్ ది డికేడ్ జాబితాలో నిలిచిన ఒకే ఒక్క ప్లేయర్ విరాట్ కోహ్లీ. విరాట్‌తో పాటు మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మ కూడా వన్డే ప్లేయర్ ఆఫ్ ది డికేడ్ నామినేషన్స్‌లో ఉన్నారు. వీరితో పాటు శ్రీలంక నుంచి లసిత్ మలింగ, కుమార సంగార్కర, ఆస్ట్రేలియా నుంచి మిచెల్ స్టార్క్, సౌతాఫ్రికా నుంచి ఏబీ డివిల్లియర్స్ ఈ నామినేషన్స్‌లో పోటీపడబోతున్నారు.
వన్డే ప్లేయర్ ఆఫ్ ది డికేడ్ (వుమెన్స్): భారత కెప్టెన్ మిథాలీరాజ్‌తో పాటు సీనియర్ బౌలర్ జులన్ గోస్వామి కూడా వన్డే ప్లేయర్ ఆఫ్ ది డికేడ్ నామినేషన్లలో ఉంది. ఆమెతో పాటు ఆసీస్ ప్లేయర్లు మెగ్ లానింగ్, ఎల్లీసీ పెర్రీ, న్యూజిలాండ్ ప్లేయర్ సుజీ బేట్స్, విండీస్ ప్లేయర్ స్టఫెనీ టేలర్ వన్డే వుమెన్ ప్లేయర్ ఆఫ్ ది డికేడ్ అవార్డు కోసం పోటీపడబోతున్నారు.
టీ20 ప్లేయర్ ఆఫ్ ది డికేడ్ (మెన్స్): టెస్టు, వన్డే, టీ20 ఫార్మాట్‌లో కూడా విరాట్ కోహ్లీ నామినేషన్లలో నిలిచాడు. టీ20 ప్లేయర్ ఆఫ్ ది డికేడ్ అవార్డు కోసం విరాట్, రోహిత్ శర్మ, ఆఫ్ఘాన్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్, సౌతాఫ్రికా సీనియర్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్, ఆస్ట్రేలియా వన్డే కెప్టెన్ ఆరోన్ ఫించ్, శ్రీలంక నుంచి లసిత్ మలింగ, వెస్టిండీస్ నుంచి యూనివర్సల్ బాస్ క్రిస్‌గేల్ పోటీపడుతున్నారు.
ఐసీసీ వుమెన్స్ టీ20 ప్లేయర్ ఆఫ్ ది డికేడ్: ఈ జాబితాలో ఒక్క భారత ప్లేయర్ కూడా లేకపోవడం విశేషం. ఆస్ట్రేలియా నుంచి మెగ్ లానింగ్, అలీసా హేలీ, ఎల్లీసీ పెర్రీ, న్యూజిలాండ్ నుంచి సోఫీ డివైన్, విండీస్ ప్లేయర్ డియాండ్రా డాటిన్, ఇంగ్లాండ్ ప్లేయర్ అన్యా శుబ్‌సోల్ పోటీపడుతున్నారు.
ఐసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డ్ ఆఫ్ ది డికేడ్: తమ ఆటతో యువ ఆటగాళ్లలో స్ఫూర్తినింపిన క్రికెటర్‌కి ఈ అవార్డు దక్కనుంది. ఈ జాబితాలో కూడా భారత ‘రన్ మెషిన్’ విరాట్ కోహ్లీ ఉన్నాడు. భారత మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ, పాక్ మాజీ సారథి మిస్భా వుల్ హక్, న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెక్‌కల్లమ్, న్యూజిలాండ్ ప్రస్తుత కెప్టెన్ కేన్ విలియంసన్, కివీస్ మరో మాజీ కెప్టెన్ డానియల్ విటోరి, శ్రీలంక మాజీ సారథి మహేల జయవర్థనే, ఇంగ్లాండ్ వుమెన్ ప్లేయర్ క్యాథిరిన్ ఈ నామినేషన్స్‌లో ఉన్నారు.
ఐసీసీ అసోసియేట్ ప్లేయర్ ఆఫ్ ది డికేడ్ (మెన్ అండ్ వుమెన్): క్రికెట్‌లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న దేశాలైన నేపాల్, స్కాట్లాండ్, నేదర్లాండ్, నేపాల్, పపువా న్యూ జెనీవా, థాయిలాండ్ దేశాలకు చెందిన ప్లేయర్లకు ఈ అవార్డు దక్కనుంది.