Ibrahim Zadran: ఇంగ్లాండ్‌ను మట్టికరిపించిన హీరో.. ఎవరీ ఇబ్రహీం జద్రాన్?
Champions Trophy 2025: 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లాండ్‌పై రికార్డు స్థాయిలో 177 పరుగులు చేసి ఇబ్రహీం జద్రాన్ చరిత్ర సృష్టించాడు. దీంతో ఇంగ్లాండ్ పై అఫ్గానిస్తాన్ థ్రిల్లింగ్ విక్టరీ అందుకుంది. అసలు ఎవరీ ఇబ్రహీం జద్రాన్? జట్టులోకి ఎలా వచ్చాడు?

Who is Ibrahim Zadran: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్‌లో కీలక మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఇంగ్లాండ్‌ను ఓడించి అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు 325 పరుగులు చేసింది. ఆ తర్వాత ఆడిన ఇంగ్లాండ్ జట్టు 317 పరుగులు చేసి 8 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ థ్రిల్లింగ్ విక్టరీలో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు ఇబ్రహీం జద్రాన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ధనాధన్ ఇన్నింగ్స్ లో 146 బంతుల్లో 177 పరుగులతో దుమ్మురేపాడు. అతని ఇన్నింగ్స్ లో 12 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. ఈ ఇన్నింగ్స్ తో ఇబ్రహీం జద్రాన్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో సెంచరీ చేసిన తొలి ఆఫ్ఘన్ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అలాగే, అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ప్లేయర్ గా ఘనత సాధించాడు.
ఎవరీ ఇబ్రహీం జద్రాన్? జట్టులోకి ఎలా వచ్చాడు?
ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో హాట్ టాపిక్‌గా మారిన 23 ఏళ్ల ఇబ్రహీం జద్రాన్ 2001 డిసెంబర్ 12న ఆఫ్ఘనిస్తాన్‌లోని కాబూల్‌లో జన్మించాడు. దేశంలోనే అత్యంత నమ్మకమైన బ్యాట్స్‌మెన్‌లలో ఒకడిగా ఇబ్రహీం ఎదిగిన తీరు ప్రశంసనీయం. జద్రాన్‌కు క్రికెట్‌పై ఉన్న ప్రేమ చిన్నతనంలోనే మొదలైంది. అతను కాబూల్ వీధుల్లో క్రికెట్ ఆడుకోవడం నేర్చుకున్నాడు. లోకల్ క్రికెట్‌లో బాగా ఆడటంతో కోచ్‌లు, సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు.
ఆఫ్ఘనిస్తాన్ జట్టు
ఈ క్రమంలోనే ఇబ్రహీం జద్రాన్ ఆఫ్ఘనిస్తాన్ జట్టులో అడుగు పెట్టాడు. 2017లో ఆఫ్ఘనిస్తాన్ అండర్-19 జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అద్భుతమైన బ్యాటింగ్ నైపుణ్యంతో చాలా త్వరగా మంచి పేరు తెచ్చుకున్నాడు. తన అద్భుతమైన ఆటతీరుతో 2019లో ఆఫ్ఘనిస్తాన్ సీనియర్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. జద్రాన్ కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ 2021లో జింబాబ్వేతో జరిగిన వన్డే మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీ సాధించడం.
ఈ ఇన్నింగ్స్ అతని క్రికెట్ జీవితంలో ఒక మైలురాయిగా నిలిచింది. ఆ తర్వాత అతను ఆఫ్ఘనిస్తాన్ జట్టులో శాశ్వత స్థానం సంపాదించాడు. 2022లో జద్రాన్‌ను ఐసీసీ ఎమర్జింగ్ క్రికెటర్‌గా ప్రకటించింది. ఇది అతని వేగవంతమైన ఆటతీరుకు ఇది నిదర్శనం. అతని ఆటలో ప్రత్యేక నైపుణ్యాలు, మనోబలం, ఒత్తిడిలో ఆడే సామర్థ్యంతో చాలా సార్లు ప్రశంసలు అందుకున్నాడు.
ఇబ్రహీం జద్రాన్ ఒక రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్. అతను దూకుడుగా క్రికెట్ ఆడటంతో ప్రత్యేక గుర్తింపు సాధించాడు. సరైన ఫుట్‌వర్క్‌తో కవర్ డ్రైవ్, పుల్ షాట్, లాఫ్టెడ్ డ్రైవ్ వంటి షాట్‌లను చక్కగా ఆడగలడు. జద్రాన్ గొప్ప బలం ఏమిటంటే, మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా తన ఆట తీరును మార్చుకుంటాడు. జట్టు ఎంత ఒత్తిడిలో ఉన్నా రాణించడం అతని గొప్ప బలం. పరిస్థితిని బట్టి వికెట్ కాపాడుకుంటేనే దూకుడుగా బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్న ప్లేయర్. చాలా సార్లు ఇది నిరూపించాడు.
7 టెస్టు మ్యాచ్‌లు ఆడిన ఇబ్రహీం జద్రాన్ ఒక సెంచరీ, 4 హాఫ్ సెంచరీలతో 541 పరుగులు చేశాడు. 35 వన్డేల్లో 6 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలతో 51.06 సగటుతో 1,634 పరుగులు చేశాడు. 44 టీ20 మ్యాచ్‌ల్లో 1105 పరుగులు చేశాడు. తన అద్భుతమైన బ్యాటింగ్ నైపుణ్యం, దూకుడు ఆటతీరు, వివిధ పరిస్థితులకు అనుగుణంగా మారే సామర్థ్యంతో జద్రాన్ క్రికెట్ ప్రపంచంలో తప్పక చూడవలసిన ఆటగాడిగా మారాడు.