- Home
- Sports
- Cricket
- ఆ ముచ్చట అందరి ముందు బయటపెట్టేది కాదు.. విరాట్ కోహ్లీ తో సంభాషణపై పాకిస్థాన్ సారథి వ్యాఖ్యలు
ఆ ముచ్చట అందరి ముందు బయటపెట్టేది కాదు.. విరాట్ కోహ్లీ తో సంభాషణపై పాకిస్థాన్ సారథి వ్యాఖ్యలు
India Vs Pakistan: టీ20 ప్రపంచకప్ లో భాగంగా ఇండియా-పాకిస్థాన్ ల మధ్య జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ఓటమిపాలైంది. కానీ మ్యాచ్ తర్వాత రెండు జట్ల కెప్లెన్లు మాట్లాడుకుంటున్న ఫోటోలు, ఆత్మీయ అలింగనాలు ప్రేక్షకుల మనసు గెలిచాయి.

ఇటీవలే యూఏఈ వేదికగా ముగిసిన టీ20 ప్రపంచకప్ లో భాగంగా ఇండియా-పాకిస్థాన్ లు అక్టోబర్ 24న తొలి మ్యాచ్ లో తలపడిన విషయం తెలిసిందే. అప్పటిదాకా ప్రపంచకప్ లలో ఒక్క మ్యాచ్ కూడా నెగ్గని పాక్.. ఈ మ్యాచ్ లో భారీ విజయం సాధించింది.
బ్యాటింగ్ తో పాటు అన్ని విభాగాల్లో పేలవ ప్రదర్శన చేసిన టీమిండియా.. పాక్ చేతిలో చిత్తుగా ఓడింది. ఛేదనలో పాక్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా గెలుపొందిన విషయం తెలిసిందే.
అయితే దాయాదుల పోరుకు టాస్ ముందు టీమిండియా సారథి విరాట్ కోహ్లీ, పాక్ సారథి బాబర్ ఆజమ్ లు కొద్దిసేపు ముచ్చటించుకున్నారు. తాజాగా పాకిస్థాన్ కు చెందిన ఓ టీవీ ఛానెల్.. బాబర్ ను ఆ ముచ్చట గురించి ఆరాతీయడానికి ప్రయత్నించింది.
కానీ బాబర్ ఆజమ్ మాత్రం దాని గురించి చెప్పడానికి ఇష్టపడలేదు. ఆజమ్ మాట్లాడుతూ.. ‘మేమేం చర్చించుకున్నామో దాని గురించి ఎప్పటికీ బయటపెట్టను. అందరిముందు బహిరంగంగా ఆ విషయం గురించి అస్సలు మాట్లాడను..’ అని చెప్పాడు.
టాస్ కు ముందే ఆజమ్ తో పాటు పలువురు పాక్ ఆటగాళ్లు టీ20 ప్రపంచకప్ లో భారత జట్టు మెంటార్ గా పనిచేసిన మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని తో మాట్లాడారు. పాక్ ఆటగాళ్లు ఇమాద్ వాసీం, బాబర్ ఆజమ్, మాలిక్ లు జార్ఖండ్ డైనమైట్ తో ముచ్చిటించారు. ఇందుకు సంబంధించిన చిత్రాలు మ్యాచ్ అనంతంరం వైరల్ గా మారాయి.
ఇదిలాఉండగా... బాబర్ ఆజమ్ వ్యాఖ్యలపై పాక్ అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా స్పందించిన అభిమానులు.. ‘ఆ ముచ్చట చెప్పకపోతే చెప్పకపోయావ్ గానీ .. కప్ గెలవలేకపోయారు. ఇప్పుడవన్నీ తవ్వుకుని ఏం ఫాయిదా లే..’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
టీ20 ప్రపంచకప్ లో టీమిండియా లీగ్ దశలోనే ఇంటి బాట పట్టగా సెమీస్ చేరిన పాకిస్థాన్ మాత్రం.. సెమీఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో పోరాడి ఓడింది. ఆ మ్యాచ్ లో చివరిదాకా ఆధిపత్యం చెలాయించిన పాక్.. ఆఖర్లో షహీన్ షా అఫ్రిది వేసిన ఓవర్లో ఆసీస్ వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ సూపర్ బ్యాటింగ్ తో ఖంగుతింది. వేడ్ ఇచ్చిన క్యాచ్ ను హసన్ అలీ వదిలేయడంతో మ్యాచ్ ఆసీస్ వైపు తిరిగింది. పాక్ ఆశలు అడియాసలయ్యాయి.