Kapil Dev: వాళ్లే లేకుంటే ప్రపంచకప్ లో నేను సగం కూడా సాధించేవాడిని కాదు : కపిల్ దేవ్
83 Movie: భారతదేశానికి తొలి క్రికెట్ ప్రపంచకప్ అందించిన లెజెండరీ ఆటగాడు కపిల్ దేవ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన 83.. నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సందర్భంగా కపిల్.. పలు విషయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ జీవిత చరిత్ర ఆధారంగా బాలీవుడ్ లో రణ్వీర్ సింగ్ తీసిన 83 సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. రణ్వీర్ సింగ్, దీపికా పదుకోన్ నటీనటులుగా.. కబీర్ ఖాన్ దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా కపిల్ దేవ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా కపిల్ మాట్లాడుతూ.. తన సీనియర్లు లేకుంటే నేను సాధించిన దాంట్లో సగం కూడా చేసి ఉండేవాడినికాదు అని అన్నారు. అంతేగాక 1983 వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్టులోని ప్రతి సభ్యుడికి ఒక క్యారెక్టర్ ఉన్నదని అదే టోర్నీ ఆసాంతం తమను నడిపించిందని చెప్పుకొచ్చాడు.
కపిల్ దేవ్ స్పందిస్తూ... ‘మనిషికి అన్నింటికంటే క్యారెక్టర్ చాలా ముఖ్యమైనది. ఆ (1983 ప్రపంచకప్) జట్టులో పద్నాలుగు మందికి ఒక్కొక్కరికి ఒక్కో క్యారెక్టర్ ఉంది. మీరు ఏదైనా పెద్దదాన్ని సాధించాలనుకున్నప్పుడు ప్రతిఒక్కరికి ఒక క్యారెక్టర్ ఉండాలి.
మేమందరం క్రికెట్ ఆడాం. ఒకసారి నేను వెనక్కి తిరిగి చూసుకుంటే.. ఆ జర్నీలో ప్రతి ఒక్కరికి ఒక్కో పాత్ర ఉంది. ఒకరికి ఒకరం గౌరవించుకున్నాం. కెప్టెన్ గానీ, జట్టు యాజమాన్యం గానీ ఏదైనా చెబితే.. ‘యెస్’ అని మాత్రమే అనకుండా చివరినిమిషం వరకు పోరాడాం.
ఆట కోసం ఎంతవరకైనా వెళ్లాం. వారిలో ప్రతి ఒక్కరిమీద మీరు సినిమా తీయొచ్చు. నేను కెప్టెన్. కానీ సీనియర్లు, ఇతర జట్టు సభ్యుల మద్దతు లేకుండా నేను సగం కూడా సాధించలేకపోయేవాడినేమో...’ అని అన్నారు.
1983 ప్రపంచకప్ టోర్నీలో లీగ్ దశ నుంచి అద్భుతంగా ఆడిన టీమిండియా.. ఫైనల్లో రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్ వెస్టిండీస్ ను ఓడించింది. భీకరమైన పేస్ బౌలింగ్ దళం, వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్లున్న జట్టును ఓడించి భారత్ కు తొలి ప్రపంచకప్ ను అందించిది కపిల్ సేన.
ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా.. 54.4 ఓవర్లలో 183 పరుగులే చేసింది. కానీ కరేబియన్ జట్టును 52 ఓవర్లలో 140 పరుగులకే కట్టడి చేసింది టీమిండియా. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ లో 26 రన్స్ చేసిన మోహిందర్ అమర్నాథ్.. తర్వాత బౌలింగ్ లో కూడా విజృంభించాడు.
విండీస్ లో కీలక ఆటగాళ్లైన మాల్కమ్ మార్షల్, జెఫ్ డుజన్, మైకెల్ హోల్డింగ్ లను ఔట్ చేసి భారత్ కు చిరస్మరణీయ విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు.
ఇక ఈ టోర్నీ మొత్తంలో కపిల్ దేవ్.. బ్యాటింగ్ లో 303 పరుగులు చేయడమే కాకుండా బౌలింగ్ లో 12 వికెట్లు తీశాడు. జింబాబ్వే మీద కపిల్ బ్యాటింగ్, అదే మ్యాచ్లో వెనక్కి పరిగెత్తుతూ అతడు పట్టిన క్యాచ్.. భారత అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేదు.