స్పిన్ బాగా ఆడగలడన్నారు.. ఇదేనా అయ్యర్ ఆట..? శ్రేయాస్ పై చాపెల్ విమర్శలు
INDvsAUS: టీమిండియా యువ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ ఢిల్లీ టెస్టుతో పాటు ఇండోర్ లో కూడా విఫలమయ్యాడు. ఇండోర్ లో రెండో ఇన్నింగ్స్ లో కుదురుకున్నట్టే కనిపించినా చివరికి స్టార్క్ బౌలింగ్ లో వెనుదిరిగాడు.

బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా గాయం కారణంగా నాగ్‌పూర్ టెస్టు ఆడలేకపోయిన టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్.. ఢిల్లీతో టెస్టులో జట్టులోకి వచ్చాడు. కానీ రెండో టెస్టుతో పాటు ఇండోర్ లో కూడా దారుణంగా విఫలమయ్యాడు.
ఇండోర్ టెస్టులో అయ్యర్.. తొలి ఇన్నింగ్స్ లో డకౌట్ అవ్వగా రెండో ఇన్నింగ్స్ లో 27 బంతులాడి 26 పరుగులు చేశాడు. తొలి ఇన్నింగ్స్ లో అయ్యర్ కున్హేమన్ బౌలింగ్ లో ఔటవగా రెండో ఇన్నింగ్స్ లో స్టార్క్ బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు. రెండో టెస్టులో శ్రేయాస్.. తొలి ఇన్నింగ్స్ లో 6 పరుగులే చేసి లియాన్ బౌలింగ్ లో ఔటవగా రెండో ఇన్నింగ్స్ లో కూడా అతడి బౌలింగ్ లోనే ఔటయ్యాడు.
ఆడిన నాలుగు ఇన్నింగ్స్ లలో అయ్యర్ మూడు సార్లు స్పిన్నర్ల బౌలింగ్ లోనే వెనుదిరిగాడు. అదీగాక ఇండోర్ లో అయితే స్పిన్నర్లను ఆడేందుకు నానా తంటాలు పడ్డాడు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు ఇయాన్ చాపెల్ విమర్శలు గుప్పించాడు. అయ్యర్ స్పిన్ ను బాగా ఆడగలడని అందరూ అన్నారని కానీ అతడి ఆట చూస్తే అలా అనిపించలేదని విమర్శించాడు.
చాపెల్ స్పందిస్తూ.. ‘నాతో చాలామంది శ్రేయాస్ స్పిన్ బాగా ఆడగలడు అని చెప్పారు. ఇప్పటివరకైతే నేను అది చూడలేదు. తాను స్పిన్ బాగా ఆడగలనన్న నమ్మకం కూడా అయ్యర్ లో కనిపించలేదు. నేనైతే అతడి ఆటతో అస్సలు కన్విన్స్ కాలేకపోయా. అయ్యర్ బ్యాటింగ్ చూస్తే పిరికపందలా అనిపించింది...’అని ఘాటు కామెంట్స్ చేశాడు.
అంతేగాక.. ‘అయ్యర్ తో పాటు మరికొందరు భారత ఆటగాళ్లు స్పిన్ బాగా ఆడగలరని చెప్పారు. కానీ ఈ సిరీస్ లో మాత్రం అంత గొప్పగా ఆడినట్టు నాకైతే కనిపించలేదు. తొలి రెండు టెస్టులలో ఆస్ట్రేలియా బ్యాటర్లు ఎలా తడబడ్డారో ఈ మ్యాచ్ లో కూడా భారత బ్యాటింగ్ లైనప్ అలాగే విఫలమైంది..’అని తెలిపాడు.
పిచ్ గురించి పక్కనబెడితే ఈ మ్యాచ్ లో ఆసీస్ స్పిన్నర్లు బాగా బౌలింగ్ చేశారని చాపెల్ అన్నాడు. తమకు అందుబాటులో ఉన్న అవకాశాలను వాళ్లు వినియోగించుకున్న తీరు అద్భుతమని, భారత బ్యాటర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆసీస్ కు తిరుగులేని ఆధిక్యం కట్టబెట్టారని చాపెల్ కొనియాడాడు.