డబ్ల్యూటీసీ ఫైనల్ ముందుంది.. గిల్ సూపర్ ఫామ్ కొనసాగించాలి : టీమిండియా కెప్టెన్
IPL 2023 Finals: టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఐపీఎల్ - 16 లో మూడో సెంచరీతో మెరిశాడు. ఈ శతకంతో గుజరాత్ భారీ విజయాన్ని అందుకుని వరుసగా రెండోసారి ఫైనల్స్ కు అర్హత సాధించింది.
Image credit: PTI
ఐపీఎల్ - 16 లో భీకర ఫామ్ లో ఉన్న గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్.. నిన్న అహ్మదాబాద్ వేదికగా ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో 49 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. ఈ సీజన్ లో అతడికి ఇది మూడో సెంచరీ. గిల్ విధ్వంసంతో గుజరాత్ టైటాన్స్.. రెండో క్వాలిఫయర్ లో ముంబై ఇండియన్స్‌ను చిత్తుగా ఓడించింది.
Image credit: PTI
కాగా మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ.. శుభ్‌మన్ గిల్ పై ప్రశంసలు కురిపించాడు. గిల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడని, ఇదే ఫామ్ ను కూడా రాబోయే రోజుల్లో కొనసాగించాలని హిట్‌మ్యాన్ ఆకాంక్షించాడు. ఈ సందర్భంగా రోహిత్.. ముంబై ఓటమికి గల కారణాలను కూడా విశ్లేషించాడు.
Image credit: PTI
మ్యాచ్ ముగిశాక రోహిత్, కామెంటేటర్స్‌తో మాట్లాడుతూ.. ‘ఈ గ్రౌండ్ పై ఇది గ్రేట్ టోటల్. శుభ్‌మన్ చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. గిల్ మాదిరిగానే మా టీమ్ లో కూడా ఎవరైనా ఒక్కరు అలా ఆడి ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేది. గిల్ తన ఫామ్ ను కొనసాగించాలి.. అదే జరుగుతుందని ఆశిస్తున్నాం..’అని చెప్పుకొచ్చాడు.
ఈ ఏడాది టీ20, టెస్టు, వన్డేలలో సెంచరీలు చేసిన గిల్.. ఐపీఎల్ లో కూడా మంచినీళ్లు తాగినంత ఈజీగా సెంచరీలు బాదుతున్నాడు. టీమిండియా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది శుభపరిణామమే. వచ్చే నెల ఆస్ట్రేలియాతో జరుగబోయే ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ లో గిల్ రాణించడం భారత్ కు ఎంతో ముఖ్యం.
ఇక ఈ మ్యాచ్ లో ముంబై ఓడటానికి గల కారణాలను రోహిత్ వివరిస్తూ... ‘మేం బౌలింగ్ లో 20 - 25 పరుగులు అదనంగా ఇచ్చుకున్నాం. కానీ మా బ్యాటింగ్ లైనప్ చూసి ఇదేం పెద్ద విషయం కాదని మేం భావించాం. బ్యాటింగ్ కు వెళ్లేప్పుడు కూడా ఇదే సానుకూల దృక్పథంతో వెళ్లాం..
సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కామెరూన్ గ్రీన్ చాలా బాగా ఆడారు. ఇషాన్ కు గాయం అవడం మమ్మల్ని దెబ్బతీసేదే. మొత్తంగా గుజరాత్ బాగా ఆడింది. విజయానికి వాళ్లు అర్హులు. ఈ సీజన్ లో మా బ్యాటింగే మాకు పెద్ద బలం...’అని తెలిపాడు.