- Home
- Sports
- Cricket
- Sreesanth: ఇదే నా లాస్ట్ మ్యాచ్ అని చెప్పాను.. దానికి కూడా నేను అర్హుడిని కాదా..? శ్రీశాంత్ ఆవేదన
Sreesanth: ఇదే నా లాస్ట్ మ్యాచ్ అని చెప్పాను.. దానికి కూడా నేను అర్హుడిని కాదా..? శ్రీశాంత్ ఆవేదన
Sreesanth Retirement: భారత జట్టు గతంలో గెలిచిన టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ లో సభ్యుడైన శ్రీశాంత్.. ఇటీవలే తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు వీడ్కోలు చెప్పాడు..

టీమిండియా మాజీ పేసర్ శ్రీశాంత్ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తొమ్మిదేండ్ల సుదీర్ఘ విరామం అనంతరం ఇటీవలే బంతిని అందుకున్న అతడు.. రెండ్రోజుల (మార్చి 9న) క్రితమే క్రికెట్ నుంచి రిటైరవుతున్నట్టు ప్రకటించాడు.
అయితే భారత్ తరఫున ఎన్నో మ్యాచులాడిన తనకు కనీసం తన ఆఖరి మ్యాచులో అయినా వీడ్కోలు దక్కుతుందని ఆశించానని, కానీ దానికి కూడా తాను నోచుకోలేనదని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇదే విషయమై స్థానిక టీవీ ఛానెల్ తో మాట్లాడుతూ.. ‘గుజరాత్ తో మ్యాచుకు ముందే నేను టీమ్ మీటింగ్ లో విషయం చెప్పాను. ఇదే నా ఆఖరు మ్యాచ్ అని వాళ్లకు వివరించాను. అందుకు వాళ్లు సరేనని అన్నారు.
అయితే నన్ను మాత్రం గుజరాత్ తో మ్యాచ్ ఆడించలేదు. బెంచ్ కే పరిమితం చేశారు. కనీసం నేను రిటైర్మెంట్ విషయం చెప్పినప్పుడైనా నాకు వీడ్కోలు మ్యాచుకోసం అవకాశం ఇస్తారని భావించాను. కానీ వాళ్లు (టీమ్ మేనెజ్మెంట్) మాత్రం అలా చేయలేదు..’ అని ఆవేదన వ్యక్తం చేశాడు.
రంజీ సీజన్ లో భాగంగా మార్చి 9న కేరళ.. గుజరాత్ తో ఆడింది. ఆ మ్యాచులో శ్రీశాంత్ ని ఆడించలేదు. దీంతో తన ఆఖరు మ్యాచులో బెంచ్ కే పరిమితమయ్యాడు శ్రీశాంత్. ఇది తనను బాధించిందని చెప్పుకొచ్చాడు.
ఈ రంజీ సీజన్ లో ఒక్కటంటే ఒక్కటే మ్యాచ్ ఆడిన శ్రీశాంత్.. రెండు వికెట్లు పడగొట్టాడు. మేఘాలయాతో జరిగిన ఆ మ్యాచులో శ్రీశాంత్ బాగానే బౌలింగ్ చేసినా తర్వాత మ్యాచులలో మాత్రం అతడికి అవకాశం దక్కలేదు. దీంతో శ్రీశాంత్ రిటైర్మెంట్ ప్రకటించాడు.
భారత్ తరఫున 27 టెస్టులాడిన శ్రీశాంత్.. 87 వికెట్లు పడగొట్టాడు. ఇక 53 వన్డేలలో 75 వికెట్లు తీశాడు. అంతేగాక 10 టీ20లలో 7 వికెట్లు తీసుకున్నాడు. భారత జట్టు 2007 టీ20 ప్రపంచకప్ తో పాటు 2011 లో గెలిచిన వన్డే ప్రపంచకప్ లో శ్రీశాంత్ సభ్యుడు.