WI vs IND:విండీస్‌కు మరో షాక్.. స్టార్ ఆల్రౌండర్‌కు కరోనా.. సిరీస్‌కు దూరం..!
WI vs IND ODI: భారత్ తో జరుగుతున్న వన్డే సిరీస్ లో ఉత్కంఠభరితంగా సాగిన తొలి వన్డేలో మూడు పరుగుల తేడాతో ఓడిన వెస్టిండీస్ కు మరో షాక్ తగిలింది.

ఇండియాతో వన్డే సిరీస్ ఆడుతున్న వెస్టిండీస్ కు తొలి వన్డేలో అదృష్టం కలిసిరాలేదు. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన తొల వన్డేలో 3 పరుగుల తేడాతో ఓడిన ఆ జట్టుకు మరో షాక్ తగిలింది.
భారత్ తో సిరీస్ కు ఆ జట్టు ఏరికోరి తెచ్చుకున్న వెస్టిండీస్ స్టార్ ఆల్ రౌండర్ జేసన్ హోల్డర్ కరోనా బారిన పడ్డాడు. తొలి వన్డేకు ముందు అతడికి కరోనా నిర్ధారణ కావడంతో హోల్డర్ ఈ మ్యాచ్ ఆడలేదు. ఈ విషయాన్ని స్వయంగా ఆ జట్టు సారథి నికోలస్ పూరన్ టాస్ సందర్భంగా వెల్లడించాడు.
ఇదిలాఉండగా.. అతడు తొలి వన్డేతో పాటు పూర్తి సిరీస్ కు అందుబాటులో అనుమానమే. నిబంధనల ప్రకారం కరోనా సోకినవారు ఐదు రోజుల పాటు క్వారంటైన్ లో గడపాలి. ఆ ప్రకారం చూసుకున్నా అతడు వన్డే సిరీస్ కు అందుబాటులో ఉండేది డౌటే.
వెస్టిండీస్ తో తొలి వన్డే ముగియగా.. రెండో వన్డే ఆదివారం జరుగుతుంది. ఇక మూడో వన్డే బుధవారం (జులై 27) జరగాల్సి ఉంది. నిబంధనల ప్రకారం హోల్డర్ 27నే క్వారంటైన్ పూర్తి చేసుకుంటాడు. మరి ఆ వన్డేలో హోల్డర్ ను ఆడిస్తారా..? లేదా..? అనేది అనుమానమే అని విండీస్ క్రికెట్ వర్గాలు తెలిపాయి. దీంతో అతడు మిగిలిన రెండు వన్డేలకు కూడా దూరమైనట్టేనని సమాచారం.
భారత్ తో సిరీస్ కు ముందు బంగ్లాదేశ్ తో జరిగిన టెస్టు, వన్డే, టీ20లకు హోల్డర్ కు రెస్ట్ ఇచ్చారు. కీలక భారత్ తో సిరీస్ లో అతడిని ఆడించాలని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు భావించింది. కానీ తీరా తొలి వన్డేకు ముందు అతడు కరోనా కారణంగా దూరమవడంతో ఆ జట్టుకు షాక్ తగిలినట్టైంది.
ఇక తొలి వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది. కెప్టెన్ శిఖర్ ధావన్ (97) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. ఓపెనర్ శుభమన్ గిల్ (64), శ్రేయాస్ అయ్యర్ (54) లు కీలక ఇన్నింగ్స్ ఆడారు.
లక్ష్య ఛేదనలో వెస్టిండీస్.. 50 ఓవర్లూ బ్యాటింగ్ చేసి 6 వికెట్ల నష్టానికి 305 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ కైల్ మేయర్స్ (75), బ్రాండన్ కింగ్ (54), షమ్రా బ్రూక్స్ (46) లు రాణించారు. చివర్లో అఖీల్ హోసెన్ (32 నాటౌట్), రొమారియా షెపర్డ్ (39 నాటౌట్) లు విజయం కోసం ప్రయత్నించినా 4 పరుగుల దూరంలోనే ఆగిపోయారు.