కీలక ఆటగాళ్లంతా లేరు.. కానీ సఫారీ సిరీస్ లో అతడు కీ రోల్ పోషిస్తాడు : జహీర్ ఖాన్
IND vs SA: దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచుల టీ20 సిరీస్ లో భాగంగా గురువారం నుంచి ఢిల్లీ వేదికగా ప్రారంభం కాబోయే తొలి మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్ కు సీనియర్లంతా పలు కారణాలతో దూరమయ్యారు.

సఫారీలపై బదులు తీర్చుకోవడంతో పాటు ఈ ఏడాది అక్టోబర్ లో ఆస్ట్రేలియా వేదికగా జరుగబోయే టీ20 ప్రపంచకప్ కు ఆటగాళ్లను సిద్ధం చేసేందుకు గాను భారత్ గురువారం నుంచి కీలక మ్యాచులు ఆడనున్నది.
దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచుల టీ20 సిరీస్ లో రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ సారథి విరాట్ కోహ్లి తో పాటు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ లు విశ్రాంతి తీసుకున్నారు. రోహిత్ స్థానంలో తాత్కాలిక సారథిగా నియమితుడైన కెఎల్ రాహుల్ తో పాటు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా గాయపడటంతో.. ఈ సిరీస్ లో యువ భారత జట్టు బరిలోకి దిగుతున్నది.
అయితే సుమారు 7 నెలల తర్వాత భారత జట్టులోకి పునరాగమనం చేస్తున్న గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా.. సఫారీ సిరీస్ లో కీలకంగా మారతాడని టీమిండియా మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ అంటున్నాడు. కీలక ఆటగాళ్లు ఈ సిరీస్ కు దూరమవడంతో భారత జట్టుకు అతడు ముఖ్యపాత్ర పోషించనున్నాడని చెప్పాడు.
జహీర్ మాట్లాడుతూ.. ‘ఈ సిరీస్ లో హార్థిక్ కీలక ఆటగాడు అవుతాడనంలో సందేహమే లేదు. చివరిసారి అతడు టీ20 ప్రపంచకప్ లో భాగంగా భారత్ తరఫున ఆడాడు. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ లో అతడి అద్భుత ప్రదర్శనలు మనమంతా చూశాం.
ఆటగాడిగానే గాక సారథిగా కూడా హార్ధిక్ చాలా పరిణితి సాధించాడు. ఈ ఏడాది చివర్లో జరిగే ప్రపంచకప్ అతడి తర్వాత లక్ష్యమనడంలో సందేహం లేదు. ఇక సఫారీ సిరీస్ లో అతడి మీద చాలా అంచనాలున్నాయి..’ అని జహీర్ తెలిపాడు.
Image credit: PTI
ఐపీఎల్ లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ కు సారథిగా వ్యవహరించిన హార్ధిక్ ఆ జట్టును ఫైనల్ కు చేర్చడమే గాక ఏకంగా తొలి ప్రయత్నంలోనే ట్రోఫీ కూడా అందించాడు. ఈ సీజన్ లో హార్ధిక్ బ్యాటర్ గా 15 మ్యాచులలో 487 పరుగులు కూడా చేశాడు.
ఇక సఫారీలతో సిరీస్ లో కోహ్లి, రోహిత్, కెఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ లు లేకపోవడంతో బ్యాటింగ్ బాధ్యతలు శ్రేయస్ అయ్యర్, హార్ధిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, రిషభ్ పంత్ ల మీద పడనున్నాయి. మరి పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న సౌతాఫ్రికా బౌలింగ్ ను ఎలా ఎదుర్కుంటారనేది ఆసక్తికరంగా మారింది.