- Home
- Sports
- Cricket
- అతడు పెద్ద టార్చర్.. మమ్మల్ని చంపుకుతినేవాడు : వరుణ్ చక్రవర్తిపై సీఎస్కే హెడ్‌కోచ్ సంచలన వ్యాఖ్యలు
అతడు పెద్ద టార్చర్.. మమ్మల్ని చంపుకుతినేవాడు : వరుణ్ చక్రవర్తిపై సీఎస్కే హెడ్‌కోచ్ సంచలన వ్యాఖ్యలు
IPL 2023: ఐపీఎల్ లో కోల్కతా నైట్ రైడర్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న వరుణ్ చక్రవర్తిపై చెన్నై సూపర్ కింగ్స్ హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ఐపీఎల్- 16 లో కేకేఆర్ విజయాలలో కీలక పాత్ర పోషిస్తున్నాడు ఆ జట్టు స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి. 2021 టీ20 ప్రపంచకప్ లో మిస్టరీ స్పిన్నర్ అని జట్టులో చోటు దక్కించుకున్న వరుణ్ ఏమాత్రం ప్రభావం చూపకపోగా క్లబ్ స్థాయి బౌలర్ల కంటే దారుణ ప్రదర్శనలు చేశాడు.
ఆ తర్వాత జాతీయ జట్టులో సెలక్టర్లు అతడిని పట్టించుకోలేదు. దీనికి తోడు గత సీజన్ లో అతడి ప్రదర్శన కూడా ఏమంత గొప్పగా లేకపోవడంతో ఇక వరుణ్ పని అయిపోయింనే అనుకున్నారంతా. కానీ అనూహ్యంగా ఈ సీజన్ లో వరుణ్ తన స్పిన్ మాయాజాలంతో అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాడు.
ఈ సీజన్ లో ఇప్పటివరకు 13 మ్యాచ్ లు ఆడిన వరుణ్.. 19 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు. ఆదివారం చెన్నైతో జరిగిన మ్యాచ్ లో కూడా వరుణ్ రెండు వికెట్లు తీసి చెన్నై బ్యాటర్లను ఇబ్బందిపెట్టాడు. కాగా మ్యాచ్ ముగిశాక చెన్నై హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్.. వరుణ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Image credit: PTI
చెన్నై - కోల్కతా మ్యాచ్ ముగిసిన తర్వాత ఫ్లెమింగ్ మాట్లాడుతూ.. ‘వరుణ్ మా (చెన్నై టీమ్) తో చాలాకాలం ఉన్నాడు. నెట్స్ లో మమ్మల్ని టార్చర్ పెట్టేవాడు. అతడిని మా టీమ్ లోకి తీసుకోనందుకు మేం ఇప్పటికీ చాలా బాధపడుతుంటాం. వరుణ్ చాలా టాలెంటెడ్ స్పిన్నర్. కానీ దేశవాళీల కారణంగా మేం అతడిని సీక్రెట్ గా ఉంచలేకపోయాం.
వాస్తవానికి మేం వేలంలో అతడిని దక్కించుకోవాలని చూశాం. కానీ వరుణ్ ఫస్ట్ సీజన్ లోనే భారీ ధరకు అమ్ముడుపోయాడు. మా యాక్షన్ స్ట్రాటజీకి అది కాస్త భిన్నంగా సాగింది. మధ్యలో కొన్నాళ్లు ఫామ్ కోల్పోయినా ఇప్పుడు మళ్లీ ఫామ్ ను అందుకుని రాణిస్తున్నాడు. నేటి మ్యాచ్ లో కూడా అతడు చాలా బాగా బౌలింగ్ చేశాడు. నరైన్ అండగా వరుణ్ మరింత రెచ్చిపోతున్నాడు. స్పిన్ పిచ్ లలో వరుణ్ అద్భుతంగా రాణిస్తాడు..’అని చెప్పాడు.
కాగా.. 2019లో పంజాబ్ కింగ్స్ జట్టు వరుణ్ ను రూ. 8.4 కోట్లకు కొనుగోలు చేసింది. అంతకుముందు వరుణ్.. సీఎస్కే క్యాంప్ లో నెట్ బౌలర్ గా ఉండేవాడు. 2020లో కేకేఆర్ వేలంలో వరుణ్ చక్రవర్తిని దక్కించుకుంది. మూడేండ్లుగా వరుణ్ అదే టీమ్ తో కొనసాగుతున్నాడు.