- Home
- Sports
- Cricket
- అతడు వికెట్ కీపర్లలో బ్రియాన్ లారా.. టీమిండియా కీపర్ పై పాక్ మాజీ కెప్టెన్ ప్రశంసలు
అతడు వికెట్ కీపర్లలో బ్రియాన్ లారా.. టీమిండియా కీపర్ పై పాక్ మాజీ కెప్టెన్ ప్రశంసలు
ENG vs IND: ఎడ్జబాస్టన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో కీలక సమయంలో భారత్ ను ఆదుకుని పటిష్ట స్థితికి నిలిపిన టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ పై పాకిస్తాన్ మాజీ సారథి రషీద్ లతీఫ్ ప్రశంసలు కురిపించాడు.

ఇంగ్లాండ్ తో రీషెడ్యూల్డ్ టెస్టులో భారత టాపార్డర్ పేకమేడలా కూలిపోతున్న దిశలో బ్యాటింగ్ కు వచ్చిన టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్.. రవీంద్ర జడేజా తో కలిసి 222 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత్ ను పటిష్ట స్థితిలో నిలిపాడు.
111 బంతుల్లోనే 146 పరుగులతో మెరిసిన పంత్ ను వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారాతో పోలుస్తున్నాడు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్. ఇంగ్లాండ్ తో టెస్టు లో పంత్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని కొనియాడాడు.
తన యూట్యూబ్ ఛానెల్ లో లతీఫ్ మాట్లాడుతూ... ‘రిషభ్ పంత్.. వికెట్ కీపర్లలో బ్రియాన్ లారా వంటి వాడు. ప్రస్తుతం ఇండియా-ఇంగ్లాండ్ మ్యాచ్ బర్మింగ్హోమ్ (ఎడ్జబాస్టన్) లో జరుగుతున్నది. గతంలో ఇదే బర్మింగ్హోమ్ లో లారా.. కౌంటీలలో భాగంగా వార్విక్ షైర్ తో మ్యాచ్ ఆడుతూ 501 పరుగులు చేశాడు.
తాజాగా పంత్ ఆట చూస్తే నాకు లారా ఇన్నింగ్సే గుర్తొచ్చింది. పంత్ హైట్ తక్కువగా ఉన్నా బంతిని అతడు బాదే విధానం బాగుంటుంది. బాల్ తన దగ్గరికి వచ్చేదాకా అతడు వేయిట్ చేస్తాడు. ఇక అతడి ఇన్నింగ్స్ లో కొన్ని షాట్లైతే చూసి తీరాల్సిందే. ముఖ్యంగా మిడ్ వికెట్ దిశగా ఆడిన షాట్లు అద్భుతం.
పంత్ పై ఒత్తిడి పెంచాలనే ఉద్దేశంతో ఇంగ్లాండ్.. నలుగురు ఫిల్డర్లను స్లిప్స్ లో ఒక ఫీల్డర్ ను గల్లీలో ఉంచింది. అంటే ఔట్ సైడ్ లో ఫీల్డర్లు లేరనేగా అర్థం. అటువంటి ఛాన్స్ దొరికినప్పుడు పంత్ ఆ అవకాశాన్ని అస్సలు వదులుకోలేదు..’అని తెలిపాడు.
ఈ మ్యాచ్ లో 89 బంతుల్లోనే సెంచరీ చేసిన పంత్.. మొత్తంగా 111 బంతుల్లో 146 పరుగులు చేశాడు. సెంచరీ తర్వాత మరింత రెచ్చిపోయిన పంత్ ఇన్నింగ్స్ లో మొత్తంగా 20 ఫోర్లు, నాలుగు సిక్సర్లున్నాయి. స్ట్రైక్ రేట్ కూడా 131.53 గా నమోదైంది.
పంత్-జడేజాలు కలిపి ఆరో వికెట్ కు ఏకంగా 222 పరుగులు జోడించారు. దీంతో భారత్.. 98-5 నుంచి 416 పరుగులకు చేరగలిగింది. అనంతరం ఇంగ్లాండ్ ను తొలి ఇన్నింగ్స్ లో త్వరగా దెబ్బకొట్టింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్.. 27 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. టీమిండియా తాత్కాలిక సారథి బుమ్రా 3, షమీ, సిరాజ్ లు తలో వికెట్ తీశారు.