కోహ్లీ ప్రస్తుతం బీస్ట్ మోడ్‌లో ఉన్నాడు.. అతడిని ఆపడం కష్టమే.. ఆసీస్ దిగ్గజ ఆల్ రౌండర్ ప్రశంసలు
T20 World Cup 2022: టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో అదరగొడుతున్నాడు. ఈ టోర్నీలో ఆడిన నాలుగు మ్యాచ్ లలో మూడు హాఫ్ సెంచరీలు చేశాడు.
పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ మునపటి ఫామ్ అందుకున్నాక పట్టపగ్గాల్లేకుండా చెలరేగుతున్నాడు. ముఖ్యంగా టీ20 ప్రపంచకప్ లో కోహ్లీ.. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్ లు ఆడి 220 పరుగులు చేశాడు. కోహ్లీ సగటు కూడా 220 గా ఉండటం గమనార్హం. పాకిస్తాన్, నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ తో మ్యాచ్ లు ఆడిన కోహ్లీ.. ఒక్క సఫారీల మీద తప్ప మిగిలిన మూడు జట్ల మీద హాఫ్ సెంచరీలు బాదాడు.
Image credit: Getty
టీ20 ప్రపంచకప్ లో రికార్డుల బూజు దులుపుతున్న విరాట్ కోహ్లీ.. బంగ్లాదేశ్ తో మ్యాచ్ ద్వారా పలు కీలక మైలురాళ్లను దాటాడు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ కోహ్లీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ ప్రస్తుతం బీస్ట్ మోడ్ లో ఉన్నాడని వ్యాఖ్యానించాడు.
బంగ్లాదేశ్ తో మ్యాచ్ తర్వాత షేన్ వాట్సన్ మాట్లాడుతూ.. ‘టీ20 ప్రపంచకప్ లలో వెయ్యికి పైగా పరుగులు.. అది కూడా 80కి పైగా సగటుతో అంటే మూములు విషయం కాదు. ఈ గణాంకాలను చూస్తే నేను కోహ్లీ నుంచి తప్ప నా చూపు తిప్పుకోలేకపోతున్నా.
టీ20 గేమ్ అనేది హై రిస్క్ గేమ్. బ్యాటింగ్ చేసేప్పుడు బ్యాటర్లు అత్యంత ఒత్తిడికి గురవుతారు. మరీ ముఖ్యంగా టీ20 ప్రపంచకప్ వంటి మెగా టోర్నీలో ఒత్తిడి ఇంకా ఎక్కువుంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా కోహ్లీ అత్యద్బుత ప్రదర్శనలు చేస్తూ తన దేశాన్ని గెలిపిస్తున్నాడు.
కోహ్లీ ఒక అద్భుతం.. అతడి గణాంకాలు అత్యద్భుతంగా ఉన్నాయి. హై రిస్క్ ఫార్మాట్ లో బ్యాటింగ్ చేస్తూ నిలకడగా రాణించడమనేది సాధారణ విషయం కాదు..’ అని తెలిపాడు. ఈ టోర్నీలో కోహ్లీ.. బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా టీ20 ప్రపంచకప్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో శ్రలంక ఆటగాడు మహేళ జయవర్దెనే (1,016) ను అధిగమించి నెంబర్ వన్ స్థానానికి చేరాడు.
ఇక ఈ మెగా టోర్నీలో కోహ్లీ స్కోర్లను ఒకసారి పరిశీలిస్తే.. పాకిస్తాన్ పై 82 నాటౌట్, నెదర్లాండ్స్ పై 62 నాటౌట్, సౌతాఫ్రికాపై 12, బంగ్లాదేశ్ పై 64 నాటౌట్ గా ఉన్నాయి. మొత్తంగా నాలుగు మ్యాచ్ లలో 220 సగటుతో 220 పరుగులు చేశాడు. ప్రపంచకప్ లో అతడి డామినేషన్ ఎలా సాగుతుందో చెప్పడానికి ఇదే నిదర్శనం..