- Home
- Sports
- Cricket
- ఓవర్ కాన్ఫిడెన్స్! ఒకటి కాదు, రెండు జట్లుగా ఆడినా ఏ టీమ్‌నైనా ఓడిస్తామన్న హార్ధిక్ పాండ్యా పొగరుకి...
ఓవర్ కాన్ఫిడెన్స్! ఒకటి కాదు, రెండు జట్లుగా ఆడినా ఏ టీమ్‌నైనా ఓడిస్తామన్న హార్ధిక్ పాండ్యా పొగరుకి...
ఒకటి కాదు, రెండు జట్లతో రెండు వేర్వేరు సిరీస్‌లు ఆడినా.. ఈజీగా గెలుస్తామని వెస్టిండీస్ టూర్ ఆరంభానికి ముందు హార్ధిక్ పాండ్యా ధీమా వ్యక్తం చేశాడు... ఈ అతి నమ్మకానికి, వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ గట్టి సమాధానమే చెప్పింది... రెండు జట్లతో గెలవడం కాదు కదా, రోహిత్, విరాట్ వంటి ఇద్దరు సీనియర్లు లేకుంటే.. టీమిండియా ఉత్తిదేనని తేల్చేసింది.

ప్రతీ ఏటా ఐపీఎల్ ద్వారా ఎంతో మంది యంగ్ టాలెంటెడ్ ప్లేయర్లు సత్తా చాటుకుంటున్నారు. టీమిండియాలో తుది జట్టులో చోటు దక్కించుకోవడానికి దాదాపు 50 మంది ప్లేయర్లు పోటీపడుతున్నారు.
Hardik Pandya
2021 ఏడాదిలో రెండు జట్లతో రెండు వేర్వేరు సిరీసులు ఆడి, గెలిచింది టీమిండియా. ఓ జట్టు, శ్రీలంకలో పర్యటిస్తే, మరో జట్టు.. ఇంగ్లాండ్ టూర్‌లో ఆడింది. ఈ ఏడాది రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో ఓ జట్టు, ఆసియా క్రీడల్లో పాల్గొనబోతుంటే మరో జట్టు వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో ఆడనుంది..
ఐర్లాండ్ టూర్, ఆసియా కప్, ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ... ఇలా వచ్చే నాలుగు నెలలు, యమా బిజీగా గడపనుంది భారత జట్టు. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌లో ఆసీస్ చేతుల్లో చిత్తుగా ఓడిన భారత జట్టు, వెస్టిండీస్, ఐర్లాండ్ జట్లతో సిరీస్‌లు ఆడనుంది..
కీలక టోర్నీల్లో చేతులు ఎత్తేసిన తర్వాత వెస్టిండీస్, శ్రీలంక వంటి టీమ్స్‌తో సిరీస్‌లు ఆడి... దంచి కొట్టి, దుమ్ముదులిపి ఆ ఫ్రస్టేషన్‌ని తీర్చుకోవడం టీమిండియాకి అలవాటు. అయితే ఇది ఈసారి అది కూడా తేడా కొట్టేసింది..
తొలి వన్డేలో బౌలర్లు దుమ్మురేపినా 115 పరుగుల లక్ష్యఛేదనలో 5 వికెట్లు కోల్పోయిన టీమిండియా, రెండో వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని 181 పరుగులు మాత్రమే చేయగలిగింది. వన్డే వరల్డ్ కప్ 2023 క్వాలిఫైయర్స్‌లో స్కాట్లాండ్, నెదర్లాండ్స్, జింబాబ్వే వంటి టీమ్స్ కూడా విండీస్ బౌలర్లను ఓ ఆటాడుకున్నాయి...
అందుకే వెస్టిండీస్‌ని చాలా లైట్‌గా తీసుకున్న భారత జట్టు, బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రయోగాలు చేయడానికి ఇదే సరైన సమయమని భావించింది. రిజల్ట్ మాత్రం తేడా కొట్టేసింది. వెస్టిండీస్ బౌలర్ల దెబ్బకు టీమిండియా బ్యాటర్లు చేతులు ఎత్తేశారు...
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ తర్వాత టీమిండియా టీ20 కెప్టెన్‌గా కొనసాగుతూ వచ్చిన హార్ధిక్ పాండ్యా, కొన్ని టీ20 సిరీసుల్లో గెలిచాడు. స్వదేశంలో వచ్చిన ఆ విజయాలతో హార్ధిక్ అండ్ కో, టీమ్ సత్తా విషయంలో చాలా అంచనాలే పెంచుకుంది..
స్వదేశంలో ద్వైపాక్షిక సిరీస్‌లు గెలుస్తూ, తొడలు కొట్టుకుంటూ మీసాలు తిప్పుకునే భారత జట్టుకి వెస్టిండీస్ సిరీస్ ఓ చెంపపెట్టులాంటి సమాధానమే ఇచ్చింది. ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలకు ముందు ఇలాంటి పరాభవం, టీమిండియాకి ఓ రకంగా మంచిదే..
ఈ సిరీస్ అనుభవంతో మున్నుందు టీమిండియా అనవసర ప్రయోగాలు చేసేందుకు ఒకటికి రెండుసార్లు ఆలోచించొచ్చు. బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రయోగాలు చేసేందుకు, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేకుండా కీ మ్యాచులు ఆడేందుకు భయపడొచ్చు. మరీ ముఖ్యంగా ఈ సిరీస్‌లో ఎదురైన అనుభవాలతో తప్పులను సరిదిద్దుకునేందుకు టీమిండియాకి అవకాశం దొరికింది..
వెస్టిండీస్ టూర్ అనుభవం నుంచి టీమిండియా నేర్చుకునే పాఠాలు, ఆసియా కప్ 2023, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో భారత జట్టు ఎలా ఆడనుందో డిసైడ్ చేయనుంది. ఈ పరాభవం తర్వాత కూడా భారత జట్టు గుణపాఠాలు నేర్చుకోకపోతే, మరోసారి నిరాశ తప్పదు...