- Home
- Sports
- Cricket
- ఉన్న ఒక్కడూ పోతున్నాడు! మధ్య ప్రదేశ్ టీమ్‌కి మారుతున్న హనుమ విహారి, కారణం ఏంటంటే..
ఉన్న ఒక్కడూ పోతున్నాడు! మధ్య ప్రదేశ్ టీమ్‌కి మారుతున్న హనుమ విహారి, కారణం ఏంటంటే..
తెలుగువాళ్లు, టీమిండియాకి ఆడడమే చాలా తక్కువ. హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్, వెస్టిండీస్ టూర్‌లో టీమిండియాకి ప్రధాన పేసర్‌గా ఉన్నాడు. వైజాగ్ కుర్రాడు కెఎస్ భరత్, టెస్టు టీమ్‌లో వరుసగా అవకాశాలు దక్కించుకుంటుంటే పక్కా ఫస్ట్ క్లాస్ టాలెంట్ హనుమ విహారిని మాత్రం పట్టించుకోవడం మానేసింది టీమిండియా...

సిడ్నీ టెస్టులో రవిచంద్రన్ అశ్విన్‌తో కలిసి ఆరో వికెట్‌కి అజేయ భాగస్వామ్యం నెలకొల్పి, గాయాలను కూడా లెక్క చేయకుండా 36 ఓవర్లకు పైగా వికెట్లకు అడ్డుగా నిలబడిపోయాడు హనుమ విహారి.
గాయంతో ఆ మ్యాచ్ తర్వాత టీమ్‌కి దూరమైన విహారి, ఇంగ్లాండ్ పర్యటనలో టాపార్డర్‌లో బ్యాటింగ్‌కి వచ్చాడు. రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ గాయపడడంతో వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కి వచ్చిన విహారి, తొలి ఇన్నింగ్స్‌లో 20, రెండో ఇన్నింగ్స్‌లో 11 పరుగులు చేశాడు..
ఈ మ్యాచ్ తర్వాత హనుమ విహారిని పూర్తిగా పక్కనబెట్టేశారు సెలక్టర్లు. ఇప్పటిదాకా టీమిండియా తరుపున 16 టెస్టులు ఆడి 33.56 సగటుతో 839 పరుగులు చేసిన హనుమ విహారి, ఈ ఏడాది ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్ల లిస్టులో కూడా చోటు దక్కించుకోలేకపోయాడు..
దులీప్ ట్రోఫీ 2023 టోర్నీలో సౌత్ జోన్ టీమ్‌కి కెప్టెన్సీ చేస్తున్న హనుమ విహారి, ఆంధ్రా టీమ్ నుంచి బయటికి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడట. అన్నీ కుదిరితే వచ్చే సీజన్‌లో మధ్య ప్రదేశ్ టీమ్ తరుపున దేశవాళీ టోర్నీలు ఆడబోతున్నాడు ఈ కాకినాడ కుర్రాడు..
ఇప్పటికే మధ్యప్రదేశ్ టీమ్‌కి మిడిల్ ఆర్డర్‌లో రజత్ పటిదార్, వెంకటేశ్ అయ్యర్, శుభం శర్మ వంటి యంగ్ ప్లేయర్లు ఉన్నారు. వీరితో పాటు హనుమ విహారి కూడా మధ్యప్రదేశ్‌కి ఆడబోతున్నాడు..
Hanuma Vihari
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ నుంచి ఎన్‌ఓసీ కూడా తెచ్చుకున్న హనుమ విహారి, మధ్యప్రదేశ్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్‌లో రాటుతేలాలని అనుకుంటున్నాడట. ఆంధ్రాలో సరైన కోచింగ్ లేకనే టీమిండియా తరుపున వరుస అవకాశాలు దక్కించుకోలేకపోతున్నానని ఫీల్ అవుతున్నాడట హనుమ విహారి..
ఇంతకుముందు ముంబై, విదర్భ, మధ్య ప్రదేశ్ టీమ్స్‌కి రంజీ ట్రోఫీ గెలిపించిన చంద్రకాంత్ పండిత్, టీమిండియాలో చోటు కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న సర్ఫరాజ్ ఖాన్‌కి కూడా కోచ్‌గా ఉన్నాడు...
29 ఏళ్ల హనుమ విహారి, 113 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 53.41 సగటుతో 8600 పరుగులు చేశాడు. ఇందులో 23 సెంచరీలు, 45 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2022-23 రంజీ ట్రోఫీలో 14 ఇన్నింగ్స్‌ల్లో 490 పరుగులు చేశాడు హనుమ విహారి..
మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో హనుమ విహారి చేతికి గాయమైనా ఎడమ చేత్తో బ్యాటింగ్ చేసి, అందర్నీ ఆశ్చర్యపరిచాడు... ఆంధ్రా టీమ్‌ని గెలిపించడం కోసం తన క్రికెట్ కెరీర్‌నే రిస్క్ చేసి, బ్యాటింగ్ చేసిన విహారి... ఇప్పుడు వేరే టీమ్‌కి మారాలని నిర్ణయం తీసుకోవడం అందర్నీ ఆశ్చర్యానికి కలిగిస్తోంది...