Rohit Sharma : రోహిత్ శర్మ కెప్టెన్సీకి రాజీనామా చేశాడా? లేక తొలగించారా?
Rohit Sharma : భారత వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. అతని స్థానంలో కొత్త కెప్టెన్ గా శుభ్‌మన్ గిల్ భారత జట్టును నడిపించనున్నారు. రోహిత్ శర్మ కెప్టెన్సీకి రాజీనామా చేశారా? లేక అతన్ని తొలగించారా?

భారత వన్డే జట్టుకు కొత్త నాయకుడు.. రోహిత్ శర్మకు బిగ్ షాక్.. ఏం జరిగింది?
భారత క్రికెట్‌లో ఇప్పుడు మార్పుల కాలం ప్రారంభమైంది. ఎవరూ ఊహించని విధంగా భారత వన్డే జట్టుకు విజయవంతమైన కెప్టెన్ గా రికార్డులు సాధించిన రోహిత్ శర్మ కెప్టెన్సీ నుంచి అవుట్ అయ్యారు. గత ఏడాది టీ20 ప్రపంచకప్ తర్వాత సూర్యకుమార్ యాదవ్ పొట్టి ఫార్మాట్ భారత జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇప్పుడు శుభ్‌మన్ గిల్ టెస్ట్‌ల తరువాత వన్డే జట్టుకు కూడా కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించాడు.
అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఆస్ట్రేలియా పర్యటన కోసం వన్డే, టీ20 జట్లను ప్రకటించింది. ఇందులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డే జట్టులో ఉన్నప్పటికీ రోహిత్ ఇకపై స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌గా మాత్రమే ఆడనున్నాడు. కెప్టెన్ గా గిల్ వచ్చాడు.
రోహిత్ ను కెప్టెన్సీ నుంచి తప్పించారా లేక స్వయంగా తప్పుకున్నాడా?
వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను అవుట్ చేయడం అందిరిని షాక్ కు గురిచేసింది. రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించారా లేదా ఆయన స్వయంగా వదిలేశారా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం లేదు కానీ, ప్రధాన సెలెక్టర్ అజిత్ అగర్‌కర్ వ్యాఖ్యలు చూస్తే, ఇది బోర్డు నిర్ణయం అని తెలుస్తోంది. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. “మూడు ఫార్మాట్‌లకు ముగ్గురు కెప్టెన్లను ఉంచడం సాధ్యం కాదు. వన్డే ఇప్పుడు తక్కువగా ఆడే ఫార్మాట్. గిల్‌కు సరైన సమయం ఇవ్వాలనుకుంటున్నాం” అని చెప్పారు. అంటే రోహిత్ ను కెప్టెన్సీ నుంచి తప్పించారనే అభిప్రాయన్ని వ్యక్తం చేశారు.
రోహిత్, విరాట్ ఇద్దరూ ఫిట్
అజిత్ అగార్కర్ ఇంకా మాట్లాడుతూ.. “విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ పూర్తిగా ఫిట్ గా ఉన్నారు. వారు జట్టులో చోటు పొందేందుకు అవసరమైన అన్ని ఫిట్నెస్ ప్రక్రియలు పూర్తిచేశారు. మేము సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కి ఆటగాళ్ల పేర్లు పంపి ధృవీకరణ తీసుకుంటాము” అన్నారు. అయితే, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ 2027 ప్రపంచకప్‌లో ఆడతారా లేదా? అనే విషయం పై స్పష్టమైన కామెంట్స్ చేయలేదు.
అంటే మరో వరల్డ్ కప్ లో ఈ ఇద్దరు స్టార్లను చూడటం కష్టమే అనే చర్చ మొదలైంది. జట్టు ఫ్యూచర్ ప్లాన్ ను పరిగణలోకి తీసుకుని గిల్ ను కెప్టెన్ గా తగినంత సమయం ఇవ్వడం బీసీసీఐ ఆలోచనగా ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే, రోహిత్ శర్మ వయస్సు, ఫిట్ నెస్ ను కూడా పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారనే చర్చ సాగుతోంది.
రోహిత్ శర్మ కెప్టెన్సీ రికార్డులు ఇవే
రోహిత్ శర్మ కెప్టెన్‌గా మొత్తం 56 వన్డేలు ఆడాడు. అందులో భారత్ 42 విజయాలు సాధించింది. 12 మ్యాచ్‌లు ఓడింది. ఒకటి టైగా, ఒకటి ఫలితం లేకుండా ముగిసింది. వన్డే కెప్టెన్ గా రోహిత్ శర్మ గెలుపు శాతం 77.27గా ఉంది.
రోహిత్ నాయకత్వంలో భారత్ 2023 ప్రపంచకప్ ఫైనల్‌కు చేరింది. అలాగే 2018, 2023 ఆసియా కప్‌లను కూడా గెలిచింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో విజేతగా నిలిచిన తర్వాత కూడా రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించడం అభిమానులను షాక్ కు గురిచేస్తోంది.
𝙏𝙝𝙚 𝙍𝙤-𝙃𝙞𝙩 𝙀𝙛𝙛𝙚𝙘𝙩 🔥
Asia Cup 2023 🏆
ICC Champions Trophy 2025 🏆
A salute to the ODI Captaincy tenure of Rohit Sharma 🫡#TeamIndia | @ImRo45pic.twitter.com/hdj8I3zrQT— BCCI (@BCCI) October 4, 2025
గౌతమ్ గంభీర్ కామెంట్స్ వైరల్
ప్రస్తుతం భారత జట్టు హెడ్ కోచ్‌గా ఉన్న గౌతమ్ గంభీర్, గతంలో ఆటగాళ్లకు ఘనమైన ఫేర్‌వెల్ ఇవ్వాలనే వాదనలు చేశారు. ఇప్పుడు ఆయన దృక్కోణం మారినట్టుంది. ఈ ఏడాది ఆగస్టులో “ఫేర్‌వెల్ అవసరం లేదు, ఆటగాళ్లు చేసిన కృషి గుర్తుండాలి” అన్నారు.
రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించడంతో క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు బీసీసీఐ నిర్ణయంపై ప్రశ్నలు ఎదురవుతున్నాయి. కొందరు ఈ మార్పు భవిష్యత్తు దృష్ట్యా జరిగిందని అంటున్నారు. శుభ్‌మన్ గిల్ వంటి యువ ఆటగాళ్లను ప్రోత్సహించాలనే ఆలోచన బోర్డుకు ఉన్నట్లు పేర్కొంటున్నారు.
అయితే, భారత్ కు ఎన్నో విజయాలు అందించిన రోహిత్ శర్మను ఇలా కెప్టెన్సీ నుంచి తప్పించడం సరైంది కాదని మరికొందరు వాదనలు చేస్తున్నారు. రోహిత్ మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్ కు గౌరవప్రదంగా కెప్టెన్సీ వీడ్కోలు అవకాశం ఇవ్వలేదనే వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఆస్ట్రేలియా పర్యటన కోసం భారత జట్లు
వన్డే జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నీతిష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ధ్రువ్ జురేల్ (వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్.
టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, నితీష్ రెడ్డి, శివం దుబే, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్.
భారత్ vs ఆస్ట్రేలియా సిరీస్ షెడ్యూల్
• అక్టోబర్ 19: మొదటి వన్డే, పెర్త్
• అక్టోబర్ 23: రెండో వన్డే, అడిలైడ్
• అక్టోబర్ 25: మూడో వన్డే, సిడ్నీ
• అక్టోబర్ 29: మొదటి టీ20, కాన్‌బెర్రా
• అక్టోబర్ 31: రెండో టీ20, మెల్‌బోర్న్
• నవంబర్ 2: మూడో టీ20, హోబార్ట్
• నవంబర్ 6: నాల్గో టీ20, గోల్డ్ కోస్ట్
• నవంబర్ 8: ఐదో టీ20, బ్రిస్బేన్
🚨 India’s squad for Tour of Australia announced
Shubman Gill named #TeamIndia Captain for ODIs
The #AUSvIND bilateral series comprises three ODIs and five T20Is against Australia in October-November pic.twitter.com/l3I2LA1dBJ— BCCI (@BCCI) October 4, 2025