ఆడది కనబడితే ఆగడు.. అరెస్టు చేయండి : షమీపై తీవ్ర ఆరోపణలు చేసిన మాజీ భార్య
IPL 2023: ఐపీఎల్ -16లో గుజరాత్ టైటాన్స్ తరఫున రాణిస్తున్న టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీపై ఆయన మాజీ భార్య సంచలన ఆరోపణలు చేసింది.

ఐపీఎల్-16లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతున్న టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీ అదరగొడుతున్నాడు. ఈ సీజన్ లో 9 మ్యాచ్ లు ఆడిన షమీ.. 17 వికెట్లతో పర్పుల్ క్యాప్ దక్కించుకున్నాడు. మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో కూడా నాలుగు వికెట్లు తీసి జోరుమీదున్న షమీకి అతడి మాజీ భార్య షాకిచ్చింది.
షమీతో కొన్నాళ్లుగా దూరంగా ఉంటున్న మాజీ భార్య హసీన్ జహాన్ తాజాగా.. అతడిని అరెస్టు చేయాలని సుప్రీం కోర్టును ఆశ్రయించింది. షమీ స్త్రీ లోలుడని, అతడికి చాలామందితో అక్రమ సంబంధాలున్నాయని ఆరోపించింది. ఈ మేరకు సుప్రీకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ ను దాఖలు చేసింది.
చాలాకాలంగా తన భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటున్న జహన్ కు నెలవారీ భరణంగా రూ. 10 లక్షలు చెల్లించాలని గతంలో ఆమె కోల్కతా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కానీ కోల్కతా కోర్టు మాత్రం.. ప్రతీనెలా లక్షా 30 వేలు చెల్లిస్తే చాలని ఆదేశించింది. షమీ అరెస్టుపై కూడా స్టే విధించింది
దీనిపై ఇప్పుడు హసీన్ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అతడి దగ్గర రెండో మొబైల్ ఫోన్ ఉండేదని , దాని ద్వారా అతడు వివాహేతర సంబంధాలు కొనసాగించేవాడని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొంది. పడుపు వృత్తి చేసుకునే వారితో కూడా షమీకి సంబంధాలున్నాయని తీవ్ర ఆరోపణలు చేసింది.
విదేశీ టూర్లకు వెళ్తే అక్కడ కూడా షమీ లైంగిక అవసరాల కోసం అడ్డదారులు తొక్కుతాడని జహన్ ఆరోపించింది. నాలుగేండ్లుగా షమీ తప్పించుకుని తిరుగుతున్నాడని అతడిని అరెస్ట్ చేసేందుకు ఆదేశాలు జారీ చేయాలని న్యాయస్థానాన్ని కోరింది.
టీమిండియా విదేశీ టూర్లలో బీసీసీఐ కేటాయించిన హోటల్ రూమ్స్ లోనే అక్కడి మహిళలతో లైంగిక అవసరాలు తీర్చుకునేవాడని జహన్ ఆరోపణలు చేయడం సంచలనం సృష్టిస్తున్నది. మరి దీనిపై షమీ ఎలా స్పందిస్తాడనేది ఆసక్తికరం.