- Home
- Sports
- Cricket
- IPL Auction: కెప్టెన్లు కావలెను.. సమర్థ సారథుల కోసం వెతుకుతున్న ఫ్రాంచైజీలు.. వేలంలో గాలమేసేందుకు సిద్ధం
IPL Auction: కెప్టెన్లు కావలెను.. సమర్థ సారథుల కోసం వెతుకుతున్న ఫ్రాంచైజీలు.. వేలంలో గాలమేసేందుకు సిద్ధం
IPL Teams hunting for captains: వచ్చే నెల 12,13 తేదీలలో బెంగళూరు వేదికగా ఐపీఎల్ మెగా వేలం ప్రారంభం కానున్న నేపథ్యంలో పలు ఫ్రాంచైజీలు సమర్థ సారథుల కోసం వెతుకుతున్నాయి.

మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ మెగా వేలానికి తెరలేవబోతున్నది. వచ్చే నెల 12,13 తేదీలలో బెంగళూరు వేదికగా ఐపీఎల్ మెగా వేలం జరుగనున్నది. ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఏ ఆటగాడిని కొనుక్కోవాలి..? ఎవరిని తీసుకుంటే తమకు లాభం జరుగుతుందని లెక్కలేసుకుంటున్నాయి. గతంతో పోలిస్తే ఈసారి ఐపీఎల్ లో రెండు కొత్త జట్లు కూడా వచ్చాయి.
లక్నో (కెఎల్ రాహుల్) , అహ్మదాబాద్ (హర్దిక్ పాండ్యా) లకు కొత్త కెప్టెన్లు కూడా వచ్చారు. ఇక ఢిల్లీ (రిషభ్ పంత్), ముంబై (రోహిత్ శర్మ), రాజస్థాన్ రాయల్స్ (సంజూ శాంసన్) లకు కూడా పాత నాయకులే కొనసాగుతున్నారు. మిగిలిన ఐదు ఫ్రాంచైజీలు సమర్థమైన నాయకుడి కోసం వెతుకుతున్నాయి.
ఈ జాబితాలో రాయల్ ఛాలెంజర్స్, కోల్కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ ముందు వరుసలో ఉన్నాయి. కెప్టెన్లు ఉన్నా చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ లదీ కూడా సారథుల కోసం వేచి చూడాల్సిన పరిస్థితే..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : సుదీర్ఘకాలం జట్టును నడిపించిన విరాట్ కోహ్లి.. గత సీజన్ ముగిసిన వెంటనే సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఈ ఫ్రాంచైజీకి ఇప్పుడు కెప్టెన్ కావాలి. ఆ జాబితాలో డేవిడ్ వార్నర్, శ్రేయస్ అయ్యర్ ల పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది.
పంజాబ్ కింగ్స్ : గత రెండు సీజన్లలో పంజాబ్ ను నడిపించిన కెఎల్ రాహుల్ ఈ సీజన్ లో ఆ జట్టు నుంచి వైదొలిగాడు. అతడు లక్నోకు సారథిగా వ్యవహరించనున్నాడు. దీంతో పంజాబ్ కు కొత్త సారథిని వెతుక్కోవాల్సిన అవసరమొచ్చింది. ఈ జట్టు కూడా శ్రేయస్ అయ్యర్ ను వేలంలో దక్కించుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తున్నది. మయాంక్ అగర్వాల్ ఉన్నా అతడిని నాయకుడిగా నియమించేందుకు ఫ్రాంచైజీ యాజమన్యం సుముఖంగా లేదు.
కోల్కతా నైట్ రైడర్స్ : బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ యజమానిగా ఉన్న ఈ జట్టుకి కూడా సారథి లేడు. గత సీజన్ లో నడిపించిన ఇయాన్ మోర్గాన్ ను ఆ జట్టు రిటైన్ చేసుకోలేదు. ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్, వెంకటేశ్ అయ్యర్ లను రిటైన్ చేసుకుంది. కానీ వీరికి సారథ్య బాధ్యతలు అప్పజెప్పేందుకు కోల్కతా సిద్ధంగా లేదు. కోల్కతా కూడా అయ్యర్ వైపే చూస్తున్నట్టు సమాచారం.
చెన్నై సూపర్ కింగ్స్ : ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరున్న చెన్నైకి ఎంఎస్ ధోని సారథిగా ఉన్నా ఈ సీజన్ మొత్తం అతడు ఆడతాడా...? అనేది అనుమానమే. ఈ సీజన్ ప్రారంభం కాగానే ఒకటో రెండో మ్యాచులు ఆడి కెప్టెన్ గా తప్పుకుని వెనకుండి నడపాలని ధోని భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలో జట్టులో ఉన్న రవీంద్ర జడేజా ను గానీ లేదంటే మరో సమర్థవంతమైన సారథిని తయారుచేసుకోవాలని చెన్నై భావిస్తున్నది.
సన్ రైజర్స్ హైదరాబాద్ : ఈ సీజన్ కు గాను సన్ రైజర్స్ కేన్ విలియమ్సన్ ను రూ .14 కోట్లతో రిటైన్ చేసుకుంది. అతడే కెప్టెన్ గా ఉంటాడని భావిస్తున్నా.. హైదరాబాద్ ఖాతాలో ఇంకా రూ. 68 కోట్లున్నాయి. దీంతో ఓ సమర్థ సారథిని ఐపీఎల్ వేలంలో దక్కించుకోవాలని ఆ ఫ్రాంచైజీ భావిస్తున్నది.