21వ శతాబ్దం అతడిదే.. బాబర్ ఆజమ్ పై పాకిస్థాన్ మాజీ సారథి ఆసక్తికర కామెంట్స్
Wasim Akram On Babar Azam: ఫార్మాట్లతో సంబంధం లేకుండా అదరగొడుతున్న పాకిస్థాన్ బ్యాటర్, ఆ జట్టు సారథి బాబర్ ఆజమ్ పై ఆ దేశినికి చెందిన మాజీ స్పీడ్ బౌలర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

పాకిస్థాన్ సారథి బాబర్ ఆజమ్.. ఇటీవలి కాలంలో బ్యాట్ తో అదరగొడుతున్నాడు. ముఖ్యంగా గడిచిన రెండేండ్లుగా టీ20లతో పాటు అన్ని ఫార్మాట్లలో అతడు అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. ఈ ఏడాది పాక్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ తో కలిసి అతడు రికార్డు భాగస్వామ్యాలు నెలకొల్పాడు.
మెరుగైన ప్రదర్శన చేస్తున్న ఈ లాహోర్ కుర్రాడిపై పాకిస్థాన్ మాజీ సారథి వసీం అక్రమ్ ప్రశంసలు కురిపించాడు. అతడు తనకు చిన్నప్పట్నుంచి తెలుసని, 21 వ శతాబ్దంలో ఆజమ్ ఉత్తమ బ్యాటర్ అని ప్రశంసించాడు.
అక్రమ్ మాట్లాడుతూ.. ‘పాకిస్థాన్ నుంచి వచ్చిన అత్యద్భుత బ్యాటర్లలో స్థానం దక్కించుకోదగ్గ ఆటగాడు బాబర్ ఆజమ్. ఒకవేళ మీరు పాక్ బ్యాటింగ్ గురించి మాట్లాడాల్సి వస్తే.. జహీర్ అబ్బాస్, జావేద్ మియాందాద్, సలీమ్ మాలిక్, ఇంజమామ్ ఉల్ హక్, యూనిస్ ఖాన్, మహ్మద్ యూసుఫ్ లను ముందు వరుసలో చెప్పుకుంటాం.
ఆ తర్వాత స్థానాన్ని భర్తీ చేసేది బాబర్ ఆజమ్. 21వ శతాబ్దం అతడిదే.. ఆజమ్ కు ఇప్పుడు 27 ఏండ్లే. అతడు ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది.
నేను అతడిని 2010 నుంచి చూస్తున్నాను. కరాచీ కింగ్స్ నేను మెంటార్ గా ఉన్నప్పుడు కూడా ఆజమ్ తో పనిచేశాను. చిన్నప్పట్నుంచి చాలా మెరుగ్గా ఆడుతూ నిలకడగా బ్యాటింగ్ చేయడమే గాక పాక్ సారథిగా కూడా ఎదిగాడు.
ఆజమ్ లో గొప్ప ప్రతిభ దాగుంది. ఈ నిలకడను అతడు దీర్ఘకాలం కొనసాగిస్తాడని ఆశిస్తున్నాను..’ అని అక్రమ్ తెలిపాడు. ఈ సందర్భంగా అక్రమ్.. పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) లో ఆజమ్ తో పనిచేసినప్పటి పలు సంఘటనలు గుర్తు చేసుకున్నాడు.
పాకిస్థాన్ కు అన్ని ఫార్మాట్లకు సారథ్యం వహిస్తున్న ఆజమ్.. తన కెరీర్ లోనే భీకర ఫామ్ లో కొనసాగుతున్నాడు. ఐసీసీ ర్యాంకింగ్స్ లో అన్ని ఫార్మాట్లలో కూడా ఆజమ్ టాప్-10లో కొనసాగుతున్నాడు. ఈ ఏడాది టీ20లలో 1600 పైచిలుకు పరుగులు చేశాడు.