- Home
- Sports
- Cricket
- Ashwin: అశ్వినా.. ఆల్ టైం గ్రేటా..? రోహిత్ శర్మ నోరుజారాడు : పాకిస్థాన్ మాజీ సారథి షాకింగ్ కామెంట్స్
Ashwin: అశ్వినా.. ఆల్ టైం గ్రేటా..? రోహిత్ శర్మ నోరుజారాడు : పాకిస్థాన్ మాజీ సారథి షాకింగ్ కామెంట్స్
Rashid Latif Comments on Ashwin: టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పై ప్రశంసల జల్లు కురిపించిన రోహిత్ శర్మ నోరు జారాడని పాకిస్థాన్ మాజీ సారథి లతీఫ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

ఇటీవలే శ్రీలంకతో ముగిసిన తొలి టెస్టులో లంకను తన స్పిన్ మాయాజాలంతో పడగొట్టిన టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. ఈ క్రమంలో భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ రికార్డును బ్రేక్ చేశాడు.
టెస్టులలో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లలో రెండో స్థానంలో నిలిచిన కపిల్ దేవ్ (434) రికార్డును అశ్విన్ బద్దలు కొట్టాడు. లంకతో మ్యాచు లో ఆ జట్టు రెండో ఇన్నింగ్స్ లో చరిత్ అసలంకను ఔట్ చేయడం ద్వారా ఈ రికార్డును సాధించాడు.
ఈ నేపథ్యంలో టీమిండియా సారథి రోహిత్ శర్మ అతడిపై చేసిన వ్యాఖ్యలపై పాకిస్థాన్ మాజీ సారథి రషీద్ లతీఫ్ విమర్శలు కురిపించాడు. అశ్విన్ కు అంత సీన్ లేదని చెప్పకనే చెప్పాడు.
లంకతో మ్యాచ్ ముగిశాక రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘నాకు సంబంధించినంతవరకు అశ్విన్ ఆల్ టైం గ్రేట్ క్రికెటర్. ఎన్నో మ్యాచులలో అతడు దేశానికి విజయాలు అందించాడు. ఎన్నో మ్యాచ్ విన్నింగ్ ఫర్ఫార్మెన్స్ లు అతడి కెరీర్ లో ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కో రకంగా చూస్తారు.. కానీ నాకు మాత్రం అశ్విన్ ఆల్ టైం గ్రేట్..’అని చెప్పాడు.
ఈ వ్యాఖ్యలపై రషీద్ లతీఫ్ స్పందించాడు. అతడు తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడుతూ... ‘నిస్సందేహంగా అశ్విన్ గొప్ప బౌలరే.. అతడి బౌలింగ్ లో వైవిధ్యం ఉంది. స్వదేశంలో అయితే అతడు చెలరేగిపోతాడు.
ఇండియాలో అతడు ఉత్తమ స్పిన్నర్ అనడానికి ఏమాత్రం సందేహం లేదు. కానీ విదేశాల్లో మాత్రం అతడు తేలిపోతాడు. పెద్దగా ప్రభావితం చేసింది కూడా తక్కువే. ఈ విషయంలో నేను రోహిత్ శర్మతో ఏకీభవించను.
విదేశాల్లో అనిల్ కుంబ్లే చాలా మంచి ప్రదర్శనలు చేశాడు. అలాగే బిషన్ సింగ్ బేడి కూడా రాణించాడు. జడేజా కూడా కొన్ని మంచి ప్రదర్శనలతో అలరించాడు. కానీ అశ్విన్ మాత్రం తేలిపోతాడు.
అతడు ఆల్ టైం గ్రేట్ ఎంత మాత్రమూ కాదు. అశ్విన్ గొప్ప బౌలరే కావచ్చు గానీ ఆల్ టైం గ్రేట్ అయితే కాదు.. ఇండియాకు సంబంధించినంతవరకు అతడు గొప్ప బౌలరే. దానిని ఎవరూ కాదనరు.
R Ashwin
ఈ విషయంలో (అశ్విన్ ను ఆల్ టైం గ్రేట్ అని పిలవడంలో) రోహిత్ శర్మ నోరు జారి ఉంటాడు. లేదా ఆటగాళ్లను మోటివేట్ చేయడంలో భాగంగా ఏమైనా చెప్పి ఉంటాడేమో గానీ అశ్విన్ ఆల్ టైం గ్రేట్ అయితే కాదు..’ అని చెప్పాడు.