అఫ్రిది వేగానికి కళ్లెం.. షాకిచ్చిన పాకిస్తాన్ ట్రాఫిక్ పోలీసులు
Shahid Afridi: పాకిస్తాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది కి ఆ దేశ ట్రాఫిక్ పోలీసులు షాకిచ్చారు. అఫ్రిది వేగానికి వాళ్లు కళ్లెం వేశారు.

ఇటీవల కాలంలో తరుచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్న పాకిస్తాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిదికి ఆ దేశ పోలీసులు షాకిచ్చారు. రోడ్డుపై నిర్దేశించిన వేగం కంటే స్పీడ్ గా వెళ్తున్నందుకు గాను అతడికి జరిమానా విధించారు.
హైవే మీద ఓవర్ స్పీడ్ గా వాహనాన్ని నడిపినందుకు గాను అఫ్రిదికి జరిమానా విధించారు పాకిస్తాన్ మోటార్వే పోలీసులు. అతడు సెలబ్రిటీనా మరోకటా అనేది చూడకుండా వ్యవహరించి శబాష్ అనిపించుకున్నారు.
వివరాల్లోకెళ్తే.. అఫ్రిది రెండ్రోజుల క్రితం కరాచీ నుంచి లాహోర్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ రోడ్డులో నిర్దేశించిన వేగం కంటే ఓవర్ స్పీడ్ తో వెళ్తున్నందుకు గాను మోటార్వే పోలీసులు అప్రిది కార్ ఆపారు.
నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను అతడికి రూ. 1,500 జరిమానా విధించారు. అఫ్రిది అప్పటికప్పుడే రూ. 1,500 చెల్లించాడు. అనంతరం.. మోటార్వే పోలీసులపై అతడు ప్రశంసలు కురిపించాడు.
తాను ఓ సెలబ్రిటీని, పేరు మోసిన క్రికెటర్ అయినప్పటికీ పక్షపాతం చూపించకుండా నిజాయితీగా జరిమానా విధించినందుకు గాను పోలీసులను అతడు ప్రశంసించాడు.
చట్టం ఎవరికీ చుట్టం కాదని.. అందరికీ సమానమని వర్తించేవిధంగా మోటార్వే పోలీసులు వ్యవహరించారని కొనియాడాడు. జరిమానా చెల్లించిన తర్వాత అఫ్రిది తో కలిసి పోలీసులు సెల్ఫీలు దిగారు.
ఇటీవలి కాలంలో భారత క్రికెట్, ఐపీఎల్ పై అఫ్రిది అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. వారం రోజుల క్రితం.. ఐపీఎల్ రెండున్నర నెలల షెడ్యూల్ గురించి స్పందిస్తూ.. ‘ప్రపంచ క్రికెట్ లో బీసీసీఐ ఎంత చెబితే అంత.. ఎందుకంటే ఇండియాలో క్రికెట్ కు మంచి మార్కెట్ ఉంది. ఇప్పుడు క్రికెట్ అంటేనే మార్కెట్, ఎకానమీ అనే స్థితికి వచ్చింది..’ అని కామెంట్ చేసిన విషయం విదితమే.
పాకిస్తాన్ తరఫున 27 టెస్టులు, 398 వన్డేలు, 99 టీ20లు ఆడాడు అఫ్రిది. మూడు ఫార్మాట్లలో కలిపి సుమారు 11 వేల పరుగులు సాధించాడు. అంతేగాక వన్డేలలో 395 వికెట్లు, టెస్టుల్లో 45, టీ20లలో 54 వికెట్లు పడగొట్టాడు. ఆల్ రౌండర్ గా సేవలందించిన అఫ్రిది.. 2018 లో ఆట నుంచి పూర్తిగా తప్పుకున్నాడు.