- Home
- Sports
- Cricket
- అరెరే..! ఇలాంటి ఆటగాళ్లు మాకు లేరని భారతీయులు బాధపడతారు..!! పాకిస్థాన్ మాజీ సారథి సంచలన వ్యాఖ్యలు
అరెరే..! ఇలాంటి ఆటగాళ్లు మాకు లేరని భారతీయులు బాధపడతారు..!! పాకిస్థాన్ మాజీ సారథి సంచలన వ్యాఖ్యలు
Rashid Latif: సందు దొరికితే భారత క్రికెట్ తో పాటు దేశం మీద కూడా బురద చల్లటానికి రెడీగా ఉండే పాక్ క్రికెటర్లు.. మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. ఆ జట్టు మాజీ సారథి రషీద్ లతీఫ్ చేసిన వ్యాఖ్యలపై భారత క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు.

పాకిస్థాన్ మాజీ సారథి రషీద్ లతీఫ్ భారత్ పై మరోసారి విషం వెల్లగక్కాడు. ఆ జట్టు ఓపెనర్ల జోడీని సాకుగా చూపి పరోక్షంగా భారత అభిమానులను కించపరిచే విధంగా సంచలన వ్యాఖ్యలు చేశాడు.
పాకిస్థాన్ జట్టులోని అత్యంత విజయవంతమైన జోడీగా గుర్తింపు పొందిన మహ్మద్ రిజ్వాన్-బాబర్ ఆజమ్ ల అత్యుత్తమ ప్రదర్శన ను చూసి భారత అభిమానులు చాలా బాధపడతారని వ్యాఖ్యానించాడు.
ఓ టీవీ ఛానెల్ లో లతీఫ్ మాట్లాడుతూ.. ‘ఏడాది క్రితం పాకిస్థాన్ జట్టులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ వంటి ఆటగాళ్లు లేరని అనుకునేవాళ్లం. కానీ కొన్ని రోజుల్లో పాకిస్థాన్ సారథి బాబర్ ఆజమ్, వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ వంటి ఆటగాళ్లు లేరని భారతీయులు చాలా బాధపడతారు..’ అని అన్నాడు.
అంతేగాక.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలలో కూడా మునపటి పదును లేదని వ్యాఖ్యానించాడు. రిజ్వాన్, ఆజమ్ ల జోడీ రాబోయే కాలంలో అద్భుతాలు సృష్టిస్తుందని అంచనా వేశాడు.
లతీఫ్ వ్యాఖ్యలపై భారత క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. ఆయన వ్యాఖ్యలపై వాళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలాఉండగా.. లతీఫ్ వ్యాఖ్యలను పక్కనబెడితే ఈ ఏడాది రిజ్వాన్-ఆజమ్ జోడీ పరుగుల వరద పారిస్తున్నది. ఈ ఏడాది టీ20లలో అత్యధిక పరుగులు చేసిన జోడీగా రికార్డులకెక్కింది. అంతేగాక రోహిత్ శర్మ- కెఎల్ రాహుల్ ల పేరిట ఉన్న అత్యధిక టీ20 శతక భాగస్వామాల (6) ను అధిగమించింది.
ఇక మహ్మద్ రిజ్వాన్ ఈ క్యాలెండర్ ఇయర్ లో 2 వేల పరుగులు చేయగా.. బాబర్ 1600 కు పైచిలుకు రన్స్ సాధించాడు. దీంతో వీరిద్దరూ ఇప్పుడు ప్రపంచంలోనే మేటి ఓపెనర్లుగా గుర్తింపు పొందుతున్నారు.