సెమీస్‌కు చేరే జట్లు అవే.. బీసీసీఐ మాజీ అధ్యక్షుడి కామెంట్స్.. మాజీ సెమీఫైనలిస్టులకు చాన్స్ ఇవ్వని దాదా
T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ లో సెమీఫైనల్ కు చేరే నాలుగు జట్లు ఏవనే విషయంపై మాజీ క్రికెటర్లు, క్రికెట్ విశ్లేషకులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా చేరాడు.
ఆస్ట్రేలియా వేదికగా ప్రారంభమైన టీ20 ప్రపంచకప్ లో ఆరంభమే అదిరింది. తొలి రోజు న్యూజిలాండ్ - ఆస్ట్రేలియా మధ్య హై స్కోరింగ్ గేమ్ లో ఆసీస్ ఓడింది. ఇంగ్లాండ్-అఫ్గాన్ మధ్య ముగిసిన లో స్కోరింగ్ గేమ్ లో ఇంగ్లాండ్ ఘన విజయం సాధించింది.
మరి ఈ మెగా టోర్నీలో సెమీస్ కు చేరే నాలుగు జట్లు ఏవి..? అనే విషయంపై మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు ఎవరి అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా చేరాడు. తాజాగా గంగూలీ.. ఈ మెగా టోర్నీలో సెమీస్ చేరే నాలుగు జట్లను తేల్చేశాడు.
దాదా మాట్లాడుతూ.. ‘నా దృష్టిలో టీ20 ప్రపంచకప్ - 2022లో సెమీస్ చేరే జట్లు ఇండియా, సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా.. సౌతాఫ్రికాకు బౌలింగ్ బలంగా ఉంది. ఆస్ట్రేలియాలో అదే అత్యంత కీలకం..’ అని తెలిపాడు.
ఇక భారత జట్టు గతేడాదితో పాటు అంతకుముందు టీ20 ప్రపంచకప్ లలో అనుకున్న స్థాయిలో రాణించకపోయినా ఈసారి మాత్రం ఫేవరేట్లలో ఒకటిగా ఉంటుందని దాదా చెప్పాడు. గతం గురించి చర్చించాల్సిన అవసరం లేదని.. ఇప్పుడు జట్టు బలంగా ఉందని అన్నాడు.
‘గతంలో ఏం జరిగిందనేదానిమీద ఇప్పుడు చర్చ జరపడం సరికాదు. ఈ టోర్నీలో భారత జట్టు కచ్చితంగా ఫేవరేట్. ఇతర మ్యాచ్ లతో పోలిస్తే ప్రపంచకప్ ఆడటం భిన్నంగా ఉంటుంది. ఆ రెండు, మూడు వారాలు సరైన ప్రదర్శనలు చేసిన జట్టే విజేతగా నిలుస్తుంది.
అయితే ఈ టోర్నీలో ఫైనల్ చేరే జట్టు ఏది..? విజేతగా నిలిచేది ఎవరు అనేది చెప్పడం కష్టం. టీ20 అనేది మ్యాచ్ జరిగిన నాలుగు గంటలు ఫామ్ కీలకం. అలా చూసుకుంటే మన జట్టులో మంచి హిట్టర్లు, అనుభవం కలిగిన ఆటగాళ్లతో జట్టు సమతూకంగా ఉంది..’ అని దాదా తెలిపాడు.
అయితే సెమీస్ లో నాలుగు జట్లను ఎంపిక చేసిన దాదా కామెంట్స్ పై పాకిస్తాన్, న్యూజిలాండ్ క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం పెదవి విరుస్తున్నారు. ఈ రెండు జట్లు గతేడాది ప్రపంచకప్ లో సెమీస్ చేరినవే. న్యూజిలాండ్ అయితే ఫైనల్ కూడా ఆడింది. కానీ ఈ రెండు జట్లు దాదా అంచనా వేసిన సెమీఫైనలిస్టుల జాబితాలో లేవు.