- Home
- Sports
- Cricket
- బరువు, అటిట్యూడ్ కాదు.. సర్ఫరాజ్‌ను తీసుకోకపోవడానికి అదే కారణం.. ఆసీస్ మాజీ ఆటగాడి కామెంట్స్
బరువు, అటిట్యూడ్ కాదు.. సర్ఫరాజ్‌ను తీసుకోకపోవడానికి అదే కారణం.. ఆసీస్ మాజీ ఆటగాడి కామెంట్స్
Sarfaraz Khan: ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ ను వెస్టిండీస్ తో సిరీస్ లో ఎంపిక చేయకపోవడంపై బీసీసీఐ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే.

దేశవాళీలో పరుగుల వరద పారిస్తున్న ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ ను త్వరలో జరుగబోయే వెస్టిండీస్ పర్యటనకు ఎంపిక చేయకపోవడంతో బీసీసీఐ, సెలక్టర్లపై తీవ్ర విమర్శలు వస్తున్న విషయ తెలిసిందే. టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్ కూడా సర్ఫరాజ్ ను ఎందుకు తీసుకోవడం లేదని సెలక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
Image credit: PTI
తాజాగా సర్ఫరాజ్ ను ఎంపిక చేయకపోవడం గురించి ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన యూట్యూబ్ ఛానెల్ లో హాగ్ మాట్లాడుతూ.. ‘సర్ఫరాజ్ ఖాన్ రంజీ ట్రోఫీలో సంచలనాలు నమోదు చేస్తున్నాడు. అయినా అతడిని జాతీయ జట్టులోకి తీసుకోవడానికి సెలక్టర్లు తటపటాయిస్తున్నారు.
దీనికి కారణమేంటో తెలుసా..? అతడు తన స్టేట్ టీమ్ లో ఐదు లేదా ఆరో స్థానంలో బ్యాటింగ్ కు వస్తాడు. ఐపీఎల్ లో కూడా ఢిల్లీ క్యాపిటల్స్ కు ఆడుతూ ఇలాగే వచ్చాడు. కానీ ఐపీఎల్ లో క్వాలిటీ, పేస్ బౌలర్లను ఎదుర్కునే క్రమంలో అతడు విఫలమయ్యాడు. అంతర్జాతీయ స్థాయిలో ఆడేప్పుడు ఈ ఆట సరిపోదు.
సెలక్టర్లు కూడా ఇదే చూశారు. అతడు రంజీ లలో ఎలా ఆడినా ఐపీఎల్ లో అతడు విఫలమవడం చూసిన సెలక్లర్లు ఇతడింకా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ను అందుకోలేదని భావించారు. అందుకే వెస్టిండీస్ సిరీస్ కు ఎంపిక చేయలేదు. ఒకవేళ వచ్చే ఐపీఎల్ సీజన్ లో గనక అతడు గొప్పగా రాణించగలిగితే అప్పుడు ఇక అతడి ప్లేస్ కు ఢోకా ఉండకపోవచ్చు. టీమిండియా టెస్టు జట్టులో అతడు సుదీర్ఘకాలం కొనసాగుతాడు..’అని తెలిపాడు.
Image credit: PTI
కాగా సర్ఫరాజ్ ను తీసుకోకపోవడంపై బీసీసీఐ ప్రతినిధి ఒకరు స్పందిస్తూ.. ‘దేశవాళీలో నిలకడగా ఆడుతూ మూడు సీజన్లుగా 900 కు పైగా పరుగులు చేసిన ఆటగాడిని జాతీయ జట్టులోకి ఎంపిక చేయకపోవడానికి సెలక్టర్లు ఏమైనా పిచ్చోళ్లా..? అతడి (సర్ఫరాజ్)ని ఎంపిక చేయకపోవడానికి ప్రధాన కారణం ఫిట్నెస్ ఒకటి. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అతడి ఫిట్నెస్ లేదు. దానిమీద అతడు దృష్టి పెట్టాలి. బరువు తగ్గి ఫిట్నెస్ మెరుగుపరుచుకోవాలి..
రెండోది.. సర్ఫరాజ్ ఖాన్ ఆఫ్ ఫీల్డ్ వ్యవహారాలు. సెంచరీ చేశాక తొడ కొట్టడాలు, బిగ్గరగా అరవడాలు.. చిత్ర విచిత్ర విన్యాసాలు.. ఇవన్నీ ఎవరికి..? ఆటగాళ్లకు క్రమశిక్షణ ముఖ్యం. అతడిలో ప్రస్తుతం అదే కొరవడింది. సర్ఫరాజ్ ను సెలక్టర్లు ప్రతీసారి ఇగ్నోర్ చేయడానికి కూడా అదే ప్రధాన కారణం. సర్ఫరాజ్ ను తీసుకోకపోవడానికి అతడి ఆట ఒక్కటే కాదు. ఆటేతర విషయాలు కూడా ఉన్నాయి..’ అని కుండబద్దలు కొట్టాడు.