- Home
- Sports
- Cricket
- ఒక్క ఇన్నింగ్స్ చాలు.. గాడిన పడతారు.. టీమిండియా తాజా మాజీ సారథులకు మద్దతుగా గవాస్కర్
ఒక్క ఇన్నింగ్స్ చాలు.. గాడిన పడతారు.. టీమిండియా తాజా మాజీ సారథులకు మద్దతుగా గవాస్కర్
TATA IPL 2022: ఐపీఎల్ అంటేనే పూనకం వచ్చినవారిలా ఆడే ఇద్దరు ఆటగాళ్లు ఇప్పుడు దారుణంగా విఫలమవుతున్నారు. ఈ సీజన్ లో వరుస వైఫల్యాలతో విమర్శలు ఎదుర్కుంటున్న రోహిత్-కోహ్లి లకు భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ మద్దతుగా నిలిచాడు.

ఈ సీజన్ లో భారత తాజా మాజీ సారథులు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ల ఆటతీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. త్వరలో టీ20 ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో ఈ ఇద్దరు వెటరన్స్ ఇలా ఆడితే టీమిండియా పరిస్థితి ఏంటని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సీజన్ లో రోహిత్.. ఇప్పటివరకు 7 మ్యాచులాడి 114 పరుగులే చేశాడు. అతడి వైఫల్యం ముంబై జట్టు మీద తీవ్రంగా పడుతోంది. ఇక కోహ్లి కూడా అదే బాటలో ఉన్నాడు. ఆడిన 7 ఇన్నింగ్స్ లలో 119 పరుగులు సాధించాడు. ఈ ఇద్దరూ తాము ఆడిన గత మ్యాచులలో డకౌట్ అయ్యారు.
వీళ్ల ఫామ్ పై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ వీరికి మద్దతుగా నిలిచాడు. ఏదైనా ఒక్క మ్యాచ్ లో భారీ స్కోరు సాధిస్తే ఈ ఇద్దరూ తిరిగి ఫామ్ లోకి వస్తారాని అన్నాడు.
సన్నీ మాట్లాడుతూ.. ‘ఈ ఇద్దరికీ ఫామ్ అనేది ఒక ఇన్నింగ్స్ దూరంలో మాత్రమే నిలిచింది. రోహిత్ ఈ సీజన్ లో ఏడు ఇన్నింగ్స్ ఆడాడు. ఇందులో ఒక్క భారీ ఇన్నింగ్స్ కూడా లేదు. కానీ అతడు ఒక్క మంచి ఇన్నింగ్స్ తో ఫామ్ లోకి వస్తాడని నేను భావిస్తున్నాను.
రోహిత్ ఫామ్ లోకి వస్తే అది ముంబై జట్టు విజయాలపై కూడా ప్రభావం చూపుతుంది. అతడు అద్భుత ఇన్నింగ్స్ ఆడితే ముంబై ఆటోమేటిక్ గా మంచి స్కోర్లు సాధిస్తుంది. అయితే హిట్ మ్యాన్ ఫామ్ లోకి రావడమనేది ముఖ్యం. వస్తే అతడు 80, 90 పరుగులు అవలీలగా సాధించగలడు’ అని అన్నాడు.
ఇక కోహ్లి గురించి సన్నీ స్పందిస్తూ... ‘అతడికి అదృష్టం కలిసిరావడం లేదు. చిన్న తప్పులతో కోహ్లి వికెట్ పారేసుకుంటున్నాడు. అతడి మొదటి తప్పే ఆఖరి తప్పు గా మారుతున్నది. కోహ్లికి కూడా మంచి ఇన్నింగ్స్ పడితే అతడిని ఆపడం కూడా కష్టమే. 30 పరుగులు చేశాక కోహ్లి సానుకూలంగా ఆడాలి. అప్పుడు భారీ స్కోరు చేస్తే అతడు తర్వాత భారీ స్కోర్లు చేస్తాడు..’అని అన్నాడు.
మరి లిటిల్ మాస్టర్ ఆశించినట్టు ఈ ఇద్దరు వెటరన్స్ రాణిస్తారా..? అనేది రాబోయే మ్యాచులలో తేలనుంది. ఐపీఎల్ సంగతి పక్కనబెడితే రాబోయే టీ20 ప్రపంచకప్, వచ్చే ఏడాది భారత్ లో జరిగే వన్డే వరల్డ్ కప్ లో ఈ జంట రాణిస్తేనే టీమిండియా విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి.