- Home
- Sports
- Cricket
- టీమిండియా సంగతి దేవుడెరుగు.. ముందైతే చెన్నైకి బాగా ఆడు.. : సీఎస్కే ఓపెనర్ కు బ్రాడ్ హాగ్ స్వీట్ వార్నింగ్
టీమిండియా సంగతి దేవుడెరుగు.. ముందైతే చెన్నైకి బాగా ఆడు.. : సీఎస్కే ఓపెనర్ కు బ్రాడ్ హాగ్ స్వీట్ వార్నింగ్
TATA IPL 2022: గతేడాది ఐపీఎల్ సీజన్ లో అత్యధిక పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్.. ఈసారి మాత్రం దారుణంగా విఫలమవుతున్నాడు.

ఐపీఎల్-2021 సీజన్ లో 635 పరుగులు చేసిన సీఎస్కే ఓపెనర్ ఈ సీజన్ లో ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్నాడు. వరుసగా నాలుగు మ్యాచులలో కలిపి 20 పరుగులు కూడా చేయలేకపోయిన రుతురాజ్ పై సొంత అభిమానులతో పాటు ఫ్రాంచైజీ కూడా గుర్రుగా ఉంది.
ఈ నేపథ్యంలో అతడు టీమిండియాకు ఆడాలనే ఆశను పక్కనబెట్టి ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ కు ఎలా ఆడాలో దానిపై దృష్టి పెట్టాలని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు బ్రాడ్ హాగ్ తెలిపాడు.
తన యూట్యూబ్ ఛానెల్ లో హాగ్ మాట్లాడుతూ... ‘ఒకవేళ గైక్వాడ్ తాను భవిష్యత్ లో టీమిండియాకు ఆడాలనే ఆలోచనతో ఈ సీజన్ ఆడుతుంటే అతడు వెంటనే వాటికి అడ్డుకట్ట వేయాలి. ఎందుకంటే నీవు (రుతురాజ్) అలా ఆలోచిస్తే ప్రస్తుతం నీ ఫ్రాంచైజీ (సీఎస్కే) కి న్యాయం చేయలేవు.
ముందు నువ్వు నీ ఫ్రాంచైజీ మీద ఫోకస్ పెట్టు. ఆ జట్టు కోసం ఆడు. టీమిండియా సంగతి తర్వాత ఆలోచించొచ్చు.. నువ్వు భాగా ఆడితే అవకాశాలు వాటంతట అవే వస్తాయి...’ అని అతడికి సూచించాడు.
గత సీజన్ లో 635 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్న రుతురాజ్.. ఈ సీజన్ లో గత నాలుగు మ్యాచులలో చేసిన స్కోర్లు 0, 1, 1, 16 గా ఉంది. అంటే మొత్తం 4 మ్యాచులలో 18 పరుగులు.
గతేడాది ఐపీఎల్ లో అద్భుతంగా రాణించడంతో పాటు దేశవాళీలోనూ పరుగుల వరద పారించడంతో గైక్వాడ్ కు టీమిండియాలో ఆడే ఛాన్స్ వచ్చింది. దక్షిణాఫ్రికా తో పాటు వెస్టిండీస్ లతో పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడే జట్టు సభ్యుడిగా ఎంపికయ్యాడు.
భారత్ తరఫున 3 టీ20లు ఆడి 39 పరుగులు చేసిన గైక్వాడ్.. వరుస అవకాశాలు పొందలేకపోతున్నాడు. ఇప్పటికీ ఎవరైనా ఆటగాళ్లు అందుబాటులో లేకుంటే రుతురాజ్ ను జట్టులోకి పిలుస్తున్నారే తప్ప రెగ్యులర్ ఆటగాడైతే కాదు.
ఇక చెన్నై వరుస ఓటములపై బ్రాడ్ హాగ్ స్పందిస్తూ ఆ జట్టు అన్ని విభాగాల్లో దారుణంగా విఫలమవుతున్నదని చెప్పుకొచ్చాడు. ‘వాళ్లు (సీఎస్కే) బ్యాటింగ్ సరిగా చేయడం లేదు. బౌలర్లు చేతులెత్తేస్తున్నారు. ఫీల్డింగ్ అయితే మరీ అధ్వాన్నంగా ఉంది.. ఈ మూడు విభాగాల్లోనూ వాళ్లు విఫలమవుతున్నారు.
ఇందులో అన్నిటికంటే ముఖ్యమైనది బ్యాటింగ్. ముంబైలోని బౌన్సీ పిచ్ లపై రుతురాజ్ క్రీజులో నిలదొక్కుకోవడానికే తంటాలు పడుతున్నాడు. అతడికి కట్ షాట్, బ్యాక్ ఫుట్ డ్రైవ్ ఆడటం ఎలాగో తెలియడం లేదు. ప్రతిసారి ఆఫ్ సైడ్ ఆఫ్ స్టంప్ వెళ్లే బంతులను ఆడుతూ వికెట్లు పారేసుకుంటున్నాడు..’ అని హాగ్ తెలిపాడు.