సూర్య ప్రతాపం, విరాట్ వీరోచితం.. భారత క్రికెట్‌లో ఈ ఏడాది టాప్ - 5 ఘనతలు ఇవే..
2022 Year In Review: 2022 ముగింపుదశకు చేరింది. మరికొద్దిగంటల్లో కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పేందుకు ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. ఈ ఏడాదిలో భారత క్రికెట్ కు కొంచెం తీపి, కొంచె చేదుగా గడిచిపోయింది. 2022లో భారత క్రికెటర్లు సాధించిన ఘనతల మీద ఓ లుక్కేస్తే..

కొత్త కెప్టెన్, కొత్త హెడ్ కోచ్ లతో కలిసి ఈ ఏడాది ఆస్ట్రేలియాలో ముగిసిన టీ20 ప్రపంచకప్ లో టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగిన టీమిండియా ఆ ప్రయత్నంలో సెమీస్ లోనే ఇంటిబాట పట్టాల్సి వచ్చింది. ఇది భారత అభిమానులకు మింగుడుపడలేదు. కానీ ద్వైపాక్షిక సిరీస్ లలో మాత్రం భారత్ అదరగొట్టింది. ఈ క్రమంలో టీమిండియా ఆటగాళ్లు పలు మ్యాచ్ లలో కీలక ఇన్నింగ్స్ లు ఆడి అరుదైన ఘనతలు సాధించారు. అలా టాప్ - 5 మైలురాళ్ల జాబితాను ఓ సారి పరిశీలిస్తే..
జస్ప్రీత్ బుమ్రా : ఇంగ్లాండ్ తో బర్మింగ్‌హామ్ టెస్టులో బుమ్రా సారథిగా నియమితుడయ్యాడు. ఈ టెస్టులో స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఓ ఓవర్లో బుమ్రా.. 29 పరుగులు బాదాడు. టెస్టు క్రికెట్ లో ఒక ఓవర్ లో అత్యధిక పరుగులు బాదిన ఆటగాడిగా ఇది ప్రపంచ రికార్డు. గతంలో ఈ రికార్డు లారా (28) పేరిట ఉండేది. మొత్తంగా ఈ ఓవర్లో బ్రాడ్.. 35 పరుగులిచ్చాడు.
ఇషాన్ కిషన్ : బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్ లో భాగంగా రోహిత్ గాయపడటంతో జట్టులోకి వచ్చిన కిషన్ బ్యాట్ తో దుమ్మరేపాడు. మూడో వన్డేలో 126 బంతుల్లోనే డబుల్ సెంచరీ బాదాడు. గతంలో రోహిత్, సచిన్, సెహ్వాగ్, గేల్ లు డబుల్ సెంచరీలు చేసినా ఇంత తక్కువ బంతులలో మాత్రం ద్విశతకం బాదింది కిషన్ మాత్రమే. అంతేగాక భారత్ తరఫున డబుల్ సెంచరీ బాదిన తొలి లెఫ్ట్ హ్యాండర్ కూడా.
సూర్యకుమార్ యాదవ్ : ఈ ఏడాది కచ్చితంగా సూర్యకుమార్ యాదవ్ దే. ముఖ్యంగా వన్డేలలో సూర్య వీరవిహారం చేశాడు. ప్రత్యర్థి ఎవరన్నది సంబంధం లేకుండా రెచ్చిపోయాడు. ఈ ఏడాది మొత్తంగా 1,164 పరుగులు చేశాడు. సగటు 187.43గా ఉంది. అంతర్జాతీయ టీ20లలో పాక్ బ్యాటర్ రిజ్వాన్ ఒక్కడే వెయ్యి పరుగులు చేసిన క్లబ్ లో ఉన్నాడు. కాగా, ఈ ఏడాది టీ20లలో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్ గా సూర్య రికార్డు సృష్టించాడు. 2022లో సూర్య.. 31 మ్యాచ్ లలో 68 సిక్సర్లు కొట్టాడు. ప్రపంచంలో మరే బ్యాటర్ కూడా ఇన్ని కొట్టలేదు.
విరాట్ కోహ్లీ : మూడేండ్లుగా సెంచరీ కోసం తహతహలాడుతున్న విరాట్ కోహ్లీ ఎట్టకేలకు ఈ ఏడాది శతకం కరువు తీర్చుకున్నాడు. ఆసియా కప్ లో భాగంగా ఆఫ్గాన్ పై సెంచరీ చేశాడు. వన్డేలలో కూడా బంగ్లాదేశ్ పై శతకం బాది సచిన్ తర్వాత అత్యధిక సెంచరీల జాబితా (72) లో నిలిచాడు. ఈ ఏడాది కోహ్లీ టీ20లలో అరుదైన ఘనత అందుకున్నాడు. పొట్టి ఫార్మాట్ లో 4 వేల పరుగులు చేసిన తొలి క్రికెటర్ గా రికార్డులకెక్కాడు. టీ20లలో అత్యధిక హాఫ్ సెంచరీలు (37) రికార్డుతో పాటు టీ20 ప్రపంచకప్ లో అత్యధిక పరుగులు (1,141) చేసిన రికార్డులూ నెలకొల్పాడు.
రిషభ్ పంత్ : ఈ ఏడాది ప్రారంభంలో పంత్ దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా కేప్ టౌన్ టెస్టులో సెంచరీ చేశాడు. తద్వారా సేనా (సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాలపై టెస్టు సెంచరీలు చేసిన తొలి వికెట్ కీపర్ (ఈ నాలుగు దేశాలకు చెందిన వాళ్లు కాకుండా) గా రికార్డులకెక్కాడు. బర్మింగ్‌హోమ్ టెస్టులో పంత్.. 146 పరుగులు చేసి రికార్డు నెలకొల్పాడు. ఈ ఏడాది టెస్టులలో పంత్ సగటు 90.9గా ఉండటం గమనార్హం.