- Home
- Sports
- Cricket
- రండి బాబు రండి.. అగ్గువకే అడ్వర్టైజ్‌మెంట్‌లు..! విండీస్-ఇండియా సిరీస్‌కు స్పాన్సర్లు కరువు
రండి బాబు రండి.. అగ్గువకే అడ్వర్టైజ్‌మెంట్‌లు..! విండీస్-ఇండియా సిరీస్‌కు స్పాన్సర్లు కరువు
WI vs IND: శుక్రవారం నుంచి ప్రారంభం కాబోతున్న వెస్టిండీస్-ఇండియా వన్డే సిరీస్ ను స్పాన్సర్ చేసేందుకు స్పాన్సర్లు దొరకడం లేదట. దీంతో డీడీ స్పోర్ట్స్, ఫ్యాన్ కోడ్ భారీ డిస్కౌంట్ ఆఫర్స్‌ను కూడా ప్రకటిస్తున్నాయి.

ప్రస్తుతం టీమిండియా వెస్టిండీస్ పర్యటనలో ఉంది. అక్కడ విండీస్ తో మూడు వన్డేలు, ఐదు టీ20 లు ఆడనుంది. పొట్టి ఫార్మాట్ సిరీస్ సంగతి తర్వాత గానీ శుక్రవారం (జులై 21) నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కాబోతుంది.
అయితే ఈ సిరీస్ మనం గతంలో చూసిన మాదిరిగా స్టార్ స్పోర్ట్స్ లోనో, సోనీలోనో చూసినట్టు కాదు. అసలు ప్రైవేట్ సాటిలైట్ ఛానెళ్లో ఈ సిరీస్ ప్రత్యక్షం కాదు.
Fancode, DD Sports లలో మాత్రమే ఈ సిరీస్ ప్రసారం కానుంది. గతేడాది ఫ్యాన్ కోడ్ అనే సంస్థతో విండీస్ క్రికెట్ బోర్డు చేసుకున్న ఒప్పందం (వెస్టిండీస్ క్రికెట్ బోర్డు అధికారిక ప్రసారదారు) ప్రకారం ఈ మ్యాచులను అదే ప్రసారం చేయనుంది.
ఇదొక ఓటీటీ స్పోర్ట్స్ ఛానెల్. అయితే భారత్ తో మ్యాచులు గనక ప్రభుత్వ అధికారిక ప్రసారదారు దూరదర్శన్ లో ఈ మ్యాచులను వీక్షించొచ్చు. ఇదిలాఉండగా విండీస్ తో వన్డే సిరీస్ కోసం స్పాన్సర్లు దొరకడం లేదట.
సాధారణంగా డీడీ స్పోర్ట్స్ లో వన్డేలు ప్రసారం చేసేప్పుడు 10 సెకండ్ల యాడ్ కు రూ. 5 లక్షలు, టీ20లైతే రూ. 10 లక్షలు వసూలు చేస్తారు. కానీ ఇప్పటివరకు కూడా ఈ సిరీస్ కు స్పాన్సర్ చేసేందుకు స్పాన్సర్లు రావడం లేదట. అటు ఫ్యాన్ కోడ్ పరిస్థితి కూడా ఏమంత గొప్పగా లేదు. దానికి కూడా స్పాన్సర్ల వేట తప్పడం లేదు.
డీడీలో యాడ్స్ ప్రసారం చేసే కాంట్రాక్టు దక్కించుకున్న విన్ గ్లోబల్ మీడియా ప్రతినిధులు ఇదే విషయమై స్పందిస్తూ... ‘స్పాన్సర్లు ఈ సిరీస్ మీద అంతగా ఆసక్తి చూపడం లేదు. ఇప్పటికే కొన్ని డిస్కౌంట్లను కూడా అందుబాటులోకి తెచ్చాం. అయినా ఎవరూ ముందుకు రావడం లేదు..’ అని తెలిపారు.
‘ప్రైవేట్ శాటిలైట్ ఛానెల్ లో కాకుండా ఒక యాప్ (ఫ్యాన్ కోడ్)లో మ్యాచులు ప్రసారం కావడం ఇదే మొదటిసారి. అయితే ఈ విషయంలో డీడీ, ఫ్యాన్ కోడ్ లు మ్యాచులను ఎలా ప్రసారం చేస్తాయనేది ఆసక్తికరంగా ఉంది. విండీస్ తో భారత్ మూడు వన్డేలతో పాటు ఐదు టీ20 లు కూడా ఆడాల్సి ఉంది కాబట్టి చాలా క్రికెట్ ఆడాల్సి ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే డీడీ, ఫ్యాన్ కోడ్ కు స్పాన్సర్లు దొరకడం కష్టంగానే ఉన్నట్టుంది..’ అని ఓ యాడ్స్ ఏజెన్సీ తెలిపింది.