- Home
- Sports
- Cricket
- Eoin Morgan: ఇండియాతో సిరీస్ కు ముందు ఇంగ్లాండ్ కు బిగ్ షాక్.. కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్న మోర్గాన్
Eoin Morgan: ఇండియాతో సిరీస్ కు ముందు ఇంగ్లాండ్ కు బిగ్ షాక్.. కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్న మోర్గాన్
IND vs ENG: ఇండియా-ఇంగ్లాండ్ వన్డే సిరీస్ కు ముందు ఇంగ్లీష్ జట్టుకు ఆ టీమ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ భారీ షాక్ ఇవ్వనున్నాడు. త్వరలోనే అతడు అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పనున్నాడు.

ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టు సారథి ఇయాన్ మోర్గాన్ ఇంగ్లీష్ జట్టుకు షాకివ్వబోతున్నాడా..? త్వరలోనే అతడు కెప్టెన్సీ నుంచే గాక అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు కూడా గుడ్ బై చెప్పనున్నాడా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. త్వరలోనే అతడు రిటైర్మెంట్ ప్రకటిస్తాడని వార్తలు వస్తున్నాయి.
గత కొంతకాలంగా ఫామ్ లేమితో బాధపడుతున్న ఈ ఇంగ్లాండ్ వెటరన్.. ఇక అంతర్జాతీయ కెరీర్ నుంచి తప్పుకోవడమే ఉత్తమమన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తున్నది. గార్డియన్ నివేదిక ప్రకారం.. జులై మొదటి వారంలో మోర్గాన్.. ఇంగ్లాండ్ వన్డే, టీ20 కెప్టెన్సీ తో పాటు ఆటగాడిగా కూడా రిటైర్ కానున్నట్టు సమాచారం.
ఇంగ్లాండ్ కు తొలి వన్డే ప్రపంచకప్ (2019) అందించిన మోర్గాన్.. గత ఏడాదిన్నర కాలంగా అనుకున్న స్థాయిలో రాణించడం లేదు. ముఖ్యంగా గత 28 ఇన్నింగ్స్ (రెండు ఫార్మాట్లలో కలిపి) లలో అతడు రెండు అర్థ సెంచరీలు మాత్రమే చేశాడు.
ఇక ఇటీవలే ముగిసిన నెదర్లాండ్స్ సిరీస్ లో కూడా మోర్గాన్ దారుణంగా విఫలమయ్యాడు. ఒకవైపు తన సహచర ఆటగాళ్లు జోస్ బట్లర్, జేసన్ రాయ్, సాల్ట్ ఫిలిప్స్, డేవిడ్ మలన్ లు భారీగా పరుగులు బాదితే రెండు మ్యాచులాడిన మోర్గాన్ రెండుసార్లు డకౌట్ అయ్యాడు. ఇక మూడో వన్డేలో అతడు గాయం కారణంగా మ్యాచ్ ఆడలేదు.
ఫామ్ లేమితో పాటు వరుసగా గాయాల బారిన పడుతుండటం.. ఫిట్నెస్ సమస్యలతో అతడు సతమతమవుతున్నాడు. దీంతో కెప్టెన్సీతో పాటు ఆటగాడిగా కూడా ఆటకు గుడ్ బై చెప్పడమే ఉత్తమమన్న నిర్ణయానికి మోర్గాన్ వచ్చినట్టు సమాచారం.
జులై 7 నుంచి 17 వరకు ఇండియా.. ఇంగ్లాండ్ తో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడాల్సి ఉంది. అయితే ఈ సిరీస్ కు ముందే మోర్గాన్ తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశమున్నట్టు తెలుస్తున్నది.
మోర్గాన్ స్థానంలో 2015 నుంచి వన్డే లకు వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న జోస్ బట్లర్ గానీ మోయిన్ అలీ గానీ పరిమిత ఓవర్ల సారథిగా ఎంపికయ్యే అవకాశముంది. ఈ ఇద్దరిలో అలీ కంటే బట్లర్ వైపునకే ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) మొగ్గు చూపే అవకాశముంది.