- Home
- Sports
- Cricket
- నీలాంటోడు అరుదుగా ఉంటాడు.. గాయంతో టీ20 ప్రపంచకప్ ఆడకు.. షాహీన్ అఫ్రిదికి పాక్ మాజీ బౌలర్ సూచన
నీలాంటోడు అరుదుగా ఉంటాడు.. గాయంతో టీ20 ప్రపంచకప్ ఆడకు.. షాహీన్ అఫ్రిదికి పాక్ మాజీ బౌలర్ సూచన
Shaheen Shah Afridi: పాకిస్తాన్ యువ పేసర్ షాహీన్ షా అఫ్రిది గాయంతో ఆసియా కప్ లో ఆడలేదు. ప్రస్తుతం అతడు లండన్ లో చికిత్స చేయించుకుంటున్న విషయం తెలిసిందే.

అక్టోబర్ లో ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సి ఉన్న టీ20 ప్రపంచకప్ లో పాకిస్తాన్ తరఫున కీలక ఆటగాడిగా ఉన్న షాహీన్ షా అఫ్రిది ప్రస్తుతం లండన్ లో మోకాలి గాయానికి చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఆసియా కప్ కు ముందు గాయంతో ఆ టోర్నీ నుంచి తప్పుకున్న షాహీన్.. టీ20 ప్రపంచకప్ కు అందుబాటులో ఉంటాడనే నమ్మకంతో పీసీబీ.. అతడిని 15 మంది సభ్యులలో ఎంపిక చేసింది.
అయితే షాహీన్ గాయం తీవ్రతపై రోజుకో మాట వినపడుతున్నది. ప్రపంచకప్ కు ఇంకా నెల రోజుల సమయం కూడా లేకపోవడంతో అసలు అప్పటివరకైనా షాహీన్ పూర్తిస్థాయిలో కోలుకుంటాడా..? కోలుకున్నా ఆటకు ఫిట్ గా ఉంటాడా..? లేదా.?? అనేది అనుమానంగానే ఉంది.
ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ పేసర్ ఆకిబ్ జావేద్.. షాహీన్ అఫ్రిదికి కీలక సూచన చేశాడు. షాహీన్.. రాబోయే టీ20 ప్రపంచకప్ ఆడకపోవడమే మంచిదని కామెంట్స్ చేశాడు. ఈ ఒక్క ప్రపంచకప్ కోసం చూసుకుంటే రాబోయే రోజుల్లో అఫ్రిది వంటి బౌలర్లు మళ్లీ దొరకరని హెచ్చరించాడు.
జావేద్ మాట్లాడుతూ... ‘షాహీన్ అఫ్రిది వంటి బౌలర్లు అరుదుగా ఉంటారు. అటువంటి వారిని తయారుచేయడం కష్టం. షాహీన్ కు నేనిచ్చే సలహా ఏంటంటే.. అతడు ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్ ఆడకపోవడమే మంచిది.
ఎందుకంటే ఒక్క ప్రపంచకప్ కోసం అతడిని ఆడించి.. మళ్లీ జరగరానిదేమైనా జరిగితే అతడి కెరీర్ ప్రమాదంలో పడుతుంది. అది మరింత ప్రమాదకరం. ఒక్క వరల్డ్ కప్ కోసం చూసుకుంటే షాహీన్ వంటి బౌలర్లు మళ్లీ దొరకరు. షాహీన్ పాకిస్తాన్ కు ప్రపంచకప్ కంటే ఎంతో ముఖ్యమైన ఆటగాడు.. ఆ విషయం గుర్తుంచుకోవాలి..’ అని అన్నాడు.
ప్రస్తుతం లండన్ లో మోకాలి వైద్యం తీసుకుంటున్న షాహీన్.. పొట్టి ప్రపంచకప్ వరకు అందుబాటులో ఉంటాడని పాకిస్తాన్ ఆశిస్తున్నది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వైద్య సిబ్బంది అతడి ఆరోగ్య పరిస్థితిపై బోర్డుకు నిత్యం సమీక్షలు పంపుతున్నది.
పాకిస్తాన్ కు చెందిన ప్రముఖ వైద్యుడు, గతంలో లివర్ పూల్ ఫుట్‌బాల్ క్లబ్, కెంట్ క్రికెట్ క్లబ్ కు మెడికల్ చీఫ్ గా పనిచేసిన డాక్టర్ జాఫర్, క్వీన్స్ పార్క్ రేంజర్స్ ఫుట్‌బాల్ క్లబ్ హెడ్ డాక్టర్ ఇంతియాజ్ వద్ద చికిత్స పొందుతున్నాడు. వీళ్ల పర్యవేక్షణలో షాహీన్ కోలుకుంటున్నాడని పీసీబీ వర్గాలు చెబుతున్నాయి.