నా ఈ సక్సెస్‌కి ఆ ముగ్గురే కారణం... టీ20 వరల్డ్ కప్ టోర్నీకి ముందు దినేశ్ కార్తీక్ ఎమోషనల్ పోస్ట్...
12 ఏళ్ల గ్యాప్ తర్వాత టీ20 వరల్డ్ కప్ టోర్నీ ఆడబోతున్నాడు దినేశ్ కార్తీక్. 2019 వన్డే వరల్డ్ కప్ తర్వాత టీమిండియాలో చోటు కోల్పోయిన దినేశ్ కార్తీక్, ఇక కమ్‌బ్యాక్ ఇవ్వడం కష్టమే అనుకున్నారంతా. అయితే 37 ఏళ్ల లేటు వయసులో భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చి, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు దినేశ్ కార్తీక్...
Image credit: PTI
రిషబ్ పంత్, టీ20ల్లో వేగంగా పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతుండడంతో అతనికి బదులుగా దినేశ్ కార్తీక్‌నే ప్రధాన వికెట్ కీపర్‌గా వాడాలని భావిస్తోంది టీమిండియా మేనేజ్‌మెంట్. రిషబ్ పంత్ ఒకటి రెండు మ్యాచులు ఆడినా, దినేశ్ కార్తీక్‌కే ఎక్కువ మ్యాచుల్లో అవకాశం దక్కొచ్చని అంచనా...
Dinesh Karthik
2007, 2009, 2010 టీ20 వరల్డ్ కప్ తర్వాత మళ్లీ 12 ఏళ్లకు 2022 టీ20 వరల్డ్ కప్ ఆడబోతున్నాడు దినేశ్ కార్తీక్. అప్పుడు టీమ్‌లో కెప్టెన్‌గా వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ ఉండడంతో కార్తీక్ కేవలం బ్యాటర్‌గా టీమ్‌లోకి రాగా ఇప్పుడు వికెట్ కీపర్‌గా బాధ్యతలు నిర్వహించబోతున్నాడు...
Image credit: Getty
37 ఏళ్ల దినేశ్ కార్తీక్‌కి ఇదే ఆఖరి వరల్డ్ కప్ కావచ్చు. దీంతో టీ20 వరల్డ్ కప్‌కి ముందు సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్టు చేశాడు కార్తీక్. ‘రికీ పాంటింగ్... చిన్నప్పటి నుంచి నా ఫెవరెట్ క్రికెటర్లలో ఒకడు. ముంబై ఇండియన్స్‌లో ఉన్నప్పుడు ఆయనతో గడిపిన ప్రతీ నిమిషం ఎంతో ఎంజాయ్ చేశా..
రికీ పాంటింగ్ ఓ ఛాంపియన్ లీడర్, అంతకుముందు అద్భుతమైన గేమ్ రీడర్. పాంటింగ్ ఆటను, ఆటగాళ్లను అర్థం చేసుకునే తీరు వేరేగా ఉంటుంది. ప్రతీ క్రికెటర్ ఒక్కసారైనా రికీ పాంటింగ్ లాంటి క్రికెటర్‌ని కలవాలి, ఆయనతో మాట్లాడి ఎన్నో విషయాలు నేర్చుకోవాలి..
నాలో స్ఫూర్తి నింపిన ప్రతీ మాటకు ధన్యవాదాలు రికీ, నాలో కూరుకుపోయిన నిరాశ, నిస్తేజాలను అవి మటుమాయం చేశాయి. నేను త్వరలో మళ్లీ నీతో సమయం గడపాలని అనుకుంటున్నా! అభిషేక్ నాయర్... నాపై నాకు నమ్మకం కలిగిలా నన్ను ఎంతగానో ప్రోత్సహించావు.
Image credit: PTI
నేను ఎక్కడా ఆగకుండా అనునిత్యం నన్ను నెడుతూనే ఉన్నావు. నా జీవితంలో నువ్వు ఎప్పటికే ఓ ప్రత్యేకమైన వ్యక్తివి. అయితే నేను అనుకున్నవన్నీ జరగడానికి నా వెనక ఓ శక్తిలా నిలబడిన మరో వ్యక్తి... రోహిత్ శర్మ...
నాపైన, నా సామర్థ్యాలపై పూర్తి నమ్మకం ఉంచి, ఈ వయసులో నాకు అవకాశాలు ఇచ్చి నన్ను ప్రోత్సహించిన వ్యక్తి మాత్రం రోహిత్ శర్మనే.. థ్యాంక్యూ రోహిత్! ఇలా ఎందరో నేను కన్న కలను నిజం చేసేందుకు నాకు సహకరించారు . అందరికీ పేరుపేరునా థ్యాంక్యూ..’ అంటూ సుదీర్ఘ పోస్టు చేశాడు దినేశ్ కార్తీక్...